రూపాయి రూపాయి జమ చేసుకుని అమాయకులు ఇండ్లు కట్టుకుంటే.. పెద్ద పెద్ద జేసీబీలు తీసుకొని వెళ్లి ఉన్నపళంగా నేలమట్టం చేయాల్సిన అవసరం ఉన్నదా? వాళ్లేమైనా దేశద్రోహం చేసిండ్రా? అక్రమమైతే చట్టపరంగా క్రమబద్ధీకరించాలి.
– ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఓ టీవీ ఇంటర్వ్యూలో రేవంత్‌రెడ్డి
హైదరాబాద్, సెప్టెంబర్ 11 (నమస్తే తెలంగాణ): చెరువులు, కాల్వలను కబ్జా చేసిన ఆక్రమణదారులు ఎవరైనా సరే హైడ్రా వదలిపెట్టదని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చెప్పారు. చెరువులను చెరబట్టిన వారు ఎంతటి వారైనా జైలుకు పంపేందుకు కూడా వెనకాడబోమని పేర్కొన్నారు. ఆక్రమణదారులు కోర్టులకు వెళ్లినా, కోర్టు ఆర్డర్లను వెకేట్ చేయించి, అక్రమ నిర్మాణాలను కూల్చి తీరుతామని స్పష్టంచేశారు.
బుధవారం తెలంగాణ పోలీసు అకాడమీలో 3వ బ్యాచ్ ఎస్సైల దీక్షాంత్ పరేడ్‌కు ముఖ్య అతిథిగా హాజరైన సీఎం రేవంత్‌రెడ్డి ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ కార్యక్రమంలో సీఎం మాట్లాడుతూ.. ఆక్రమించుకున్న చెరువులను స్వచ్ఛందంగా వదలాలని, గౌరవంగా పక్కకు తప్పుకోవాలని ఆక్రమణదారులకు విజ్ఞప్తి చేశారు. హైడ్రాపై కొందరు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారని, చెరువులు, కుంటలు, నాలాల ఆక్రమణల వల్లే వరదలు వస్తున్నాయని చెప్పారు.
కొందరు బడాబాబులు చెరువుల్లో అక్రమ నిర్మాణాలు కట్టి, డ్రెయిన్ వాటర్‌ను చెరువుల్లోకి వదులుతున్నారని, ఆ నీటిని హైదరాబాద్ ప్రజలకు ఇవ్వాలా? అని ప్రశ్నించారు. ఆక్రమణలతో చెరువులు నిండిపోవడంతో వానకాలం వరదలతో పేదల జీవితాలు అతలాకుతలం అవుతున్నాయని ఆవేదన వ్యక్తంచేశారు. అందుకే చెరువుల్లోని అక్రమ నిర్మాణాలను నేలమట్టం చేసి తీరుతామని, నా లాల ఆక్రమణలను నిరభ్యంతరంగా కూల్చేస్తామని స్పష్టంచేశారు.
చెరువులను చెరబట్టిన వారి నుంచి వాటిని విడిపించడమే హైడ్రాకు తామిచ్చిన టాస్క్ అని పేర్కొన్నారు. త్వరలోనే ఆక్రమణలు తొలగించి మూసీని ప్రక్షాళన చేస్తామని, మూసీ నాలాల్లోని శాశ్వత నివాసదారులకు డబుల్‌బె డ్రూం ఇండ్లు అందిస్తామని తెలిపారు. మూసీ ప్రక్షాళనలో ఇండ్లు కోల్పోయే 11-14 వేల మందికి ప్రభుత్వం పునరావాసం కల్పిస్తుందని చెప్పారు. ఎఫ్టీఎల్, బఫర్‌జోన్ పరిధిలో నిర్మాణాలను రెగ్యులరైజ్ చేసే ప్రసక్తే లేదని స్పష్టంచేశారు.
27 రోజుల్లో 18 వేల కోట్ల రుణమాఫీ
తమ ప్రభుత్వం పెట్టుబడులు తీసుకురావడమే కాకుండా.. రైతన్నలు, నేతన్నలు, గీతన్నలను ఆదుకుంటున్నదని సీఎం రేవంత్‌రెడ్డి చెప్పారు. ఈ క్రమంలో సరిగ్గా 27 రోజుల్లోనే 22,22,685 మంది రైతుల ఖాతాల్లో రూ.18 వేల కోట్లు జమ చేసి రుణమాఫీ చేసినట్టు వివరించారు. దేశంలోనే ఇదొక కొత్త చరిత్ర అని చెప్పారు. కడుపు కట్టుకుని, నిధులు సేకరించి రుణమాఫీ చేసి రైతుల కండ్లల్లో ఆనందం చూస్తున్నామని పేర్కొన్నారు.
పెట్టుబడులు తీసుకొనిరావడం ద్వారా లక్షలాది నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించే పనిలో ఉన్నామని చెప్పారు. అయితే, సీఎం అధికారిక కార్యక్రమాల్లో రాజకీయ విమర్శలు చేయడం పట్ల పలువురు అభ్యంతరం వ్యక్తంచేస్తున్నారు. ఈ తరహా వ్యాఖ్యలు సీఎంకు తగవని అంటున్నారు.