వరంగల్, నవంబర్ 19 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): అభివృద్ధిని అడ్డుకుంటే జైలుకు పంపిస్తామంటూ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రతిపక్ష నేతలపై అసహనం వ్యక్తంచేశారు. మూసీ ప్రాజెక్టు పేరిట పేదల ఇండ్లను కూల్చడం, ఫార్మా సిటీ పేరుతో గిరిజనుల భూములను గుంజుకోవడానికి వ్యతిరేకంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఉద్యమిస్తున్న నేపథ్యంలో సీఎం రేవంత్‌రెడ్డి అసహనంతో ఊగిపోయారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఏడాది అవుతున్న నేపథ్యంలో వరంగల్‌లోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీలో మంగళవారం రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన ‘ఇందిరా మహిళాశక్తి విజయోత్సవ సభ’లో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ముఖ్యఅథితిగా ప్రసంగించారు.
ఇది ప్రభుత్వ కార్యక్రమమే అయినా అసందర్భంగా రాజకీయ వ్యాఖ్య లు చేస్తూ.. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రులు కేటీఆర్, హరీశ్‌రావుపై అసహనంతో ఊగిపోయారు. ‘కేసీఆర్ ఫాంహౌస్‌లో ఉండి ఇద్దరిని వదిలిపెట్టిండు. వారు ఊర్లమీదపడి నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నారు. అభివృద్ధి కాళ్లకు కట్టె పెడితే జైలులో పెట్టి ఊచలు లెక్కబెట్టిస్తాం’ అంటూ బెదిరింపులకు దిగారు.
గుజరాత్లో నరేంద్రమోదీ సబర్మతి నదిని అభివృద్ధి చేస్తే కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి చప్పుట్లు కొడతారని, హైదరాబాద్‌లో మూసీని అభివృద్ధి చేస్తామంటే మాత్రం అడ్డం పడుకుంటున్నారని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి విమర్శించారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును అపహాస్యం చేసిన ప్రధాని మోదీ తెలంగాణ ద్రోహి అని, అలాంటి ద్రోహికి కిషన్‌రెడ్డి గులాంగిరీ చేస్తున్నారని ఎద్దేవా చేశారు. తనను సోనియాగాంధీకి గులాం అని కిషన్‌రెడ్డి విమర్శించారని, తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన సోనియాగాంధీ కాళ్లు కడిగి నెత్తిమీద పోసుకునేందుకు తాను సిద్ధమని చెప్పారు. ‘కిషన్రెడ్డీ.. గుజరాత్‌కు గులాంవా? మోదీకి గులాంవా? గుజరాత్‌కు పోయి గాడిదలను కాసుకో.. అక్కడే గులాంగిరీ చేసుకో’ అని వ్యాఖ్యానించారు. ఇందిరమ్మ అంటే ప్రపంచదేశాలకు ఒక ఉక్కు మహిళ అని, రాష్ట్రంలో ఉన్నది ఆడబిడ్డల రాజ్యమని ధైర్యంగా చెప్పుకోవాలని అన్నారు.
ఇప్పటికే రాష్ట్రంలోని రైతులకు రూ.18 వేల కోట్ల రుణమాఫీ చేశామని సీఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. అకౌంట్లు సరిగా లేకపోవడం, ఇతర కారణాలతో మాఫీ కాని వారికి త్వరలోనే పూర్తి చేస్తామని చెప్పారు. ఖాతాలను సవరించుకోవాలని రైతులకు సూచించారు. రాష్ర్టానికి ప్రతినెలా రూ.18,500 కోట్లు ఆదాయం వస్తున్నదని, ఉద్యోగుల జీతాలు, పింఛన్లకు రూ.6,500 కోట్లు, అప్పులపై వడ్డీలకు రూ.6,500 కోట్లు ఖర్చువుతున్నాయని, మిగిలిన నిధులతో సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నామని చెవివరించారు. వరంగల్ ఎయిర్‌పోర్టును పునరుద్ధరించి, పరిశ్రమలు నెలకొల్పితే కాకతీయవర్సిటీ పిల్లలకు ఉద్యోగాలు వస్తాయని అన్నారు. వరంగల్, కొత్తగూడెం, రామగుండం, ఆదిలాబాద్‌లో ఎయిర్‌పోర్టులు నిర్మించాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
ప్రభుత్వ కార్యక్రమమైనా, కాంగ్రెస్ సభ అయినా సీఎం రేవంత్‌రెడ్డి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను లక్ష్యంగా చేసుకొని అసందర్భ వ్యాఖ్యలు చేస్తున్నారు. వరంగల్‌లో నిర్వహించిన ‘ఇందిర మహిళా శక్తి విజయోత్సవసభ’లోనూ ఇదే పని చేశారు. ‘కేసీఆర్ అనే మొక్కను మళ్లీ మొలవనియ్యను.. రాష్ట్రంలో బీఆర్ఎస్ను మొలకెత్తనియ్యను.. రాసి పెట్టుకోండి… కేసీఆర్ కాస్కో చూద్దాం’ అంటూ సీఎం రేవంత్‌రెడ్డి అసందర్భ వ్యాఖ్యలు చేశారు. ‘ఫామ్‌హౌస్‌లో ఉంటే నీ గురించి తెలవదనుకోకు.. నాకు ముందు తెలుసు.. వెనుక తెలుసు.. మళ్లీ చెప్తున్నా.. రా బయటకు.. నీ దుఃఖం ఏందో, నీ బాధ ఏందో అసెంబ్లీకి రా.. సమయం, తేదీ ఫిక్స్ చెయ్యి.. చర్చ పెడదాం.. ప్రజాల్లోకి రా.. వచ్చి మాట్లాడు..’ అంటూ ఊగిపోయారు.
మాజీ ప్రధాని ఇందిరాగాంధీ జయంతి సందర్భంగా నిర్వహించిన ఈ కార్యక్రమానికి రాష్ట్రవ్యాప్తంగా ఉన్న స్వయం సహాయక సంఘాల్లోని మహిళలను అధికారులు బస్సుల్లో తీసుకువచ్చారు. మహిళలు పాల్గొన్న ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మాట్లాడిన భాష, మాటలు అందరినీ విస్మయపరిచాయి. ముఖ్యమంత్రి పదవిలో ఉన్న వ్యక్తి స్థాయి మరిచి బజారు భాష మాట్లాడారని సభకు వచ్చిన మహిళలు పేర్కొన్నారు.