హైదరాబాద్, డిసెంబర్ 14 (నమస్తే తెలంగాణ): గురుకులాలు, ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు సరైన వసతులు కల్పించడంలో రాష్ట్రంలోని రేవంత్రెడ్డి సర్కారు విఫలమైందని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ ఒక ప్రకటనలో విమర్శించారు. నాణ్యమైన భోజన వసతి కల్పించి, మంచి స్టడీ మెటీరియల్ అందించడంలో పూర్తిగా వైఫల్యం చెందిందని పేర్కొన్నారు.
విద్యార్థులు వంటగదిపై దృష్టి ఉండేలా సీఎం రేవంత్రెడ్డి తీసుకున్న నిర్ణయం సరైందని కాదని, గురుకుల విద్యార్థులతో కమిటీ వేయాలని సీఎం రేవంత్రెడ్డి అనాలోచిత నిర్ణయం తీసుకున్నారని తెలిపారు. చదువుకునే విద్యార్థుల దృష్టి చదువుమీద ఉండాలా? వంటల గదిలో ఉండాలా? అని ప్రశ్నించారు. ప్రభుత్వం తన తప్పులను విద్యార్థులపై వేయాలనే విధంగా ఈ నిర్ణయం ఉన్నదని పేర్కొన్నారు. విద్యార్థులకు అన్ని వసతులు కల్పిస్తే వారి ధ్యాస చదువుపైనే ఉంటుందని తెలిపారు.