Students | హైదరాబాద్, నవంబర్ 20 (నమస్తే తెలంగాణ) : సర్కారు స్కూళ్లల్లోని పదో తరగతి విద్యార్థులను రేవంత్‌రెడ్డి ప్రభుత్వం గాలికొదిలేసింది. స్పెషల్క్లాసులని హడావుడి చేస్తున్న ప్రభుత్వం విద్యార్థుల కడుపుమాడ్చుతున్నది. రాష్ట్రంలో 4,701 ఉన్నత పాఠశాలు, 194 మాడల్ స్కూళ్లకు చెందిన 1.8లక్షల మంది పదో తరగతి విద్యార్థులు వార్షిక పరీక్షలకు సన్నద్ధమవుతున్నారు. ఈ నెల 1 నుంచి ప్రతిరోజు సాయంత్రం ప్రత్యేక క్లాసులను నిర్వహిస్తున్నారు. డిసెంబర్ నుంచి రెండు పూటలా స్పెషల్ క్లాసులు నిర్వహిస్తా రు. వీటికి హాజరయ్యే విద్యార్థులకు గతంలో స్నాక్స్ ఇవ్వగా, నేడు అందించడంలేదు. దీని ప్రభావంతో విద్యార్థుల హాజరు అంతంతమాత్రంగానే ఉంటున్నది. విద్యార్థుల పరిస్థితిని చూడలేక టీచర్లు, హెచ్ఎంలే తలాకొంత వేసుకుని ఆకలితీర్చాల్సిన పరిస్థితి నెలకొన్న ది. కొన్ని స్కూళ్లల్లో దాతలు, ఎన్జీవోలు, ప్రజాప్రతినిధుల సహకారంతో స్నాక్స్‌ను సమకూరుస్తున్నారు.
పదో తరగతి విద్యార్థుల ఆకలితీర్చేందుకు గత కేసీఆర్ ప్రభుత్వం ప్రత్యేక చొరవను తీసుకుంది. పదో తరగతిలో విద్యార్థులకు ఉచితంగా స్నాక్స్‌ను సమకూర్చింది. ఒక్కో విద్యార్థికి రోజుకు రూ.15 చొప్పున రూ.9. 67 కోట్లు ఖర్చుచేసింది. ప్రోటీన్లతో కూడిన ఉడికించిన శనగలు/ బొబ్బర్లు,/అనుమలు/పల్లీలు.. పల్లీలు బెల్లంముద్దలు, ఉడికించిన కోడిగుడ్లు, సమోసాలు, పకోడి, అరటిపండ్లు వంటి వాటిని సమకూర్చారు. రాష్ట్రంలో పభుత్వం మారడంతో స్నాక్స్ పథకం అటకెక్కింది.
కాంగ్రెస్ సర్కారు సీఎం బ్రేక్‌ఫాస్ట్ పథకాన్ని కూడా నిలిపివేసింది. ఇటీవలే సీఎం నియోజకవర్గం కొడంగల్‌లో దాత (ఓ ఫార్మా కంపెనీ) సహాకారంతో బ్రేక్‌ఫాస్ట్ పథకాన్ని కొనసాగిస్తున్నారు. రాష్ట్రమంతటా నిలిచిపో గా, ఒక్క కొడంగల్‌లోనే బ్రేక్‌ఫాస్ట్ పథకం అమలవుతున్నది. మాడల్ స్కూళ్లల్లో 95%, కేజీబీవీల్లో 93%, ఎయిడెడ్‌లో 88%, జడ్పీ స్కూళ్లల్లో 80% ఉత్తీర్ణత నమోదయ్యింది. ఈ ఏడాది బ్రేక్‌ఫాస్ట్ అమలుకాకపోవడం, మరో వైపు స్నాక్స్‌ను సమకూర్చకపోవడంతో దీని ప్రభావం ఫలితాల మీద పడుతుందన్న ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.