సిద్దిపేట, డిసెంబర్ 15 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): ‘రాష్ట్రంలో జరిగిన రెండు విడతల సర్పంచ్ ఎన్నికల్లో బీఆర్ఎస్ (BRS) పార్టీకే ప్రజలు పట్టం కట్టారు. సీఎం రేవంత్‌రెడ్డి (Revanth Reddy) సొంత జిల్లాలో కూడా కాంగ్రెస్ గెలువని పరిస్థితి. కాంగ్రెస్ (Congress) ప్రభుత్వం ఈ రెండేండ్లలో ఏం చేయలేదనే ప్రజలు పంచాయతీ ఎన్నికల్లో (Panchayathi Elections) ఇలాంటి తీర్పు ఇచ్చారు’ అని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్‌రావు (Harish Rao) అన్నారు. రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికల్లో సిద్దిపేట నియోజకవర్గంలో 91 గ్రామ పంచాయతీల్లో 78 గ్రామ పంచాయతీలు బీఆర్ఎస్ పార్టీ కైవసం చేసుకున్న సందర్భంగా గెలిచిన సర్పంచ్‌లు, వార్డు సభ్యులు, పార్టీ నాయకులు సోమవారం సిద్దిపేటలోని ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్‌కు తరలివచ్చారు. ఈ సందర్భంగా హరీశ్‌రావు వారికి శుభాకాంక్షలు తెలిపి అభినందించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. సిద్దిపేట నియోజకవర్గంలో జరిగిన సర్పంచ్ ఎన్నికల్లో గొప్ప విజయం సాధించినట్టు తెలిపారు.
ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీపై ప్రజలు చూపిన ఆదరణ గొప్పదని కొనియాడారు. సిద్దిపేట ప్రజల, బీఆర్ఎస్ కార్యకర్తల అభిమానం, ప్రేమ హృదయంలో ఉంటుందని అన్నారు. నాడు బీఆర్ఎస్ ప్రభుత్వంలో అభివృద్ధిలో పరుగులు తీసిన పల్లెలు.. నేడు కాంగ్రెస్ హయాంలో పడావుపడ్డాయని ఆందోళన వ్యక్తంచేశారు. గ్రామాల్లో నేడు పరిశుభ్రత.. పారిశుద్ధ్యం పడకేసిందని ధ్వజమెత్తారు. కేసీఆర్ ప్రభుత్వంలో ఆదర్శ గ్రామాలుగా తీర్చిదిద్దుకున్నామని, అవార్డుల పల్లెలుగా చేసుకున్నామని గుర్తుచేశారు. సిద్దిపేటలో పదేండ్లలో 60 జాతీయ, రాష్ట్ర స్థాయి అవార్డులు సాధించుకున్నట్టు చెప్పారు. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం లో పల్లెలు అభివృద్ధికి నోచుకొని దుస్థితిలో ఉన్నాయని దుయ్యబట్టారు. అభివృద్ధిలో.. అవార్డులు సాధించడంలో కొత్త పాలకవర్గం పోటీపడాలని సూచించారు. మళ్లీ వచ్చేది కేసీఆర్ ప్రభుత్వమేనని స్పష్టంచేశారు. ఆదర్శ గ్రామాలుగా తీర్చిదిద్దడంలో ఐక్యతతో కృషి చేయాలని పిలుపునిచ్చారు.
కొత్త సర్పంచ్‌లతో సిద్దిపేటలోని హరీశ్‌రావు క్యాంప్ ఆఫీస్ సోమవారం కోలాహలంగా మారింది. వేలాది మంది పార్టీ శ్రేణులు తరలివచ్చారు. కొత్త జీపీ పాలకవర్గాల ప్రతినిధులు హరీశ్‌రావును కలిసి ఆత్మీయతను పంచుకున్నారు. గెలిచిన సర్పంచ్‌లను హరీశ్‌రావు అభినందించారు. గ్రామాల వారీగా సన్మానించారు. దాదాపు 6 గంటలపాటు జీపీ పాలక వర్గాలను హరీశ్‌రావు అభినందించి గ్రూప్ ఫొటోలు దిగి, స్వీట్లు తినిపించారు.