హైదరాబాద్, డిసెంబర్ 29(నమస్తే తెలంగాణ): ‘ప్రతిపక్షాలు చెలరేగిపోతుంటే మంత్రులు ఏం చేస్తున్నట్టు? ఒక పాయింట్ ఆఫ్ ఆర్డర్ తీసుకొని గట్టి కౌంటర్ ఎందుకు ఇవ్వలేక పోతున్నాం? సభ నడిపే తీరు ఇదా?’ అంటూ సీఎం రేవంత్‌రెడ్డి తీవ్ర అసహనం వ్యక్తం చేసినట్టు అత్యంత విశ్వసనీయంగా తెలిసింది. సోమవారం అసెంబ్లీ వాయిదాపడిన వెంటనే సీఎం రేవంత్‌రెడ్డి మంత్రులతో సమావేశం అయ్యారు. శాసనసభలో మంత్రుల వ్యవహారశైలిపై ఆయన మరోసారి అసంతృప్తి వెల్లగక్కినట్టు సమాచారం. ప్రతిపక్షాలను కట్టడి చేయటానికి మంత్రులెవరూ వ్యూహాలతో రాలేదని, సమావేశాలను ఆశామాషీ వ్యవహారంగానే చూస్తున్నారని సీఎం అన్నట్టు వినికిడి. ‘సభా నిర్వహణ తీరు ఇది కాదని, ప్రతిపక్షాలు మనల్ని నిలబెట్టి ఎన్కౌంటర్ చేస్తుంటే, ఒక్కచోటనైనా వారికి గట్టి కౌంటర్ ఇవ్వగలిగామా’ అంటూ సీఎం మంత్రులపై తీవ్ర అసహనం వెలిబుచ్చినట్టు వినికిడి.
సబ్జెక్ట్‌తో రావాలి
నదీ జలాల వివాదాన్ని లాగి బీఆర్ఎస్ రాజకీయంగా లబ్ధి పొందాలని చూస్తున్నదని సీఎం మంత్రులకు తెలిపినట్టు వినికిడి. బీఆర్ఎస్ కౌంటర్లను సమర్థవంతంగా ఎదుర్కోకపోతే ఇటు ప్రభుత్వపరంగా, అటు రాజకీయంగా తీవ్రంగా నష్టపోతామని రేవంత్‌రెడ్డి మంత్రులను హెచ్చరించారని తెలుస్తున్నది. అరకొర సమాచారంతో వస్తే దాడిని తట్టుకోలేరని చెప్పినట్టు సమాచారం. జనవరి 2, 3న నదీ జలాలపై చర్చ జరిగే అవకాశమున్నది.
సభలో లేని సీఎం రేవంత్‌రెడ్డి ప్రారంభమైన కాసేపటికే చాంబర్లోకి
హైదరాబాద్, డిసెంబర్ 29 (నమస్తే తెలంగాణ): సభా నాయకుడిగా ముఖ్యమంత్రి సభ జరుగుతున్నంతసేపు సభలోనే ఉండాలి. కానీ, ఇందుకు భిన్నంగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సోమవారం సభలో లేకపోవడం గమనార్హం. సభ ప్రారంభమైన కొద్దిసేపటికి తన చాంబర్లోకి వెళ్లారు. ఆ తర్వాత శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి, అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్‌తో కలిసి శాసనమండలి భవన పునరుద్ధరణ, మరమ్మతు పనులను పరిశీలించారు. మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. ఆ తర్వాత తిరిగి తన చాంబర్‌కు వెళ్లిన సీఎం రేవంత్‌రెడ్డి.. మంత్రులతో భేటీ అయ్యారు. ఇలా సభ నుంచి బయటకు వచ్చిన సీఎం.. మళ్లీ సభలోకి వెళ్లకపోవడం గమనార్హం.