నదీజలాలపై చర్చ పేరిట సీఎం రేవంత్‌రెడ్డి అసెంబ్లీ సాక్షిగా పచ్చి అబద్ధాలు చెప్పి సభను, తెలంగాణ ప్రజలను తప్పుదోవ పట్టించిండు. నదీజలాల విషయంలో కాంగ్రెస్ దశాబ్దాలపాటు చేసిన మోసాలు, కొనసాగిస్తున్న పాపాల పరంపరను వివరించేందుకు, నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలకు వాస్తవాలు చెప్పేందుకే నీటిపారుదల శాఖ మాజీ మంత్రి హరీశ్‌రావు బీఆర్ఎస్ తరఫున పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చిండ్రు.
-కేటీఆర్
హైదరాబాద్, జనవరి 4 (నమస్తే తెలంగాణ) : బేసిన్లు తెలియని, నీళ్ల బేసిక్స్ తెలియని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డే ముమ్మాటికీ తెలంగాణ జలద్రోహి అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విరుచుకుపడ్డారు. నాటి నుంచి నేటి వరకు తరతరాలుగా తెలంగాణకు తీరని అన్యాయం చేసింది కాంగ్రెస్సేనని మండిపడ్డారు. నదీజలాలపై చర్చ పేరిట సీఎం రేవంత్‌రెడ్డి అసెంబ్లీ సాక్షిగా పచ్చి అబద్ధాలు చెప్పి సభను, తెలంగాణ ప్రజలను తప్పుదోవ పట్టించారని విమర్శించారు. నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలకు వాస్తవాలు చెప్పేందుకే మాజీ మంత్రి హరీశ్‌రావు బీఆర్ఎస్ తరఫున పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారని స్పష్టంచేశారు. సీఎం రేవంత్‌రెడ్డి అధికారమదంతో విర్రవీగుతూ బలుపుమాటలు మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు. రైతుబంధువు, తెలంగాణ బతుకును కోరిన త్యాగధనుడు కేసీఆర్‌ను అనరాని మాటలనడం బాధాకరమని వాపోయారు. కరువు నేలల్లో సిరులు పండించి, మరణ మృదంగాలు మోగిన నేలలో జీవకళను తెచ్చిన గొప్ప పాలనాదక్షుడు కేసీఆర్ అని కొనియాడారు. అలాంటి మహానేతపై రేవంత్‌రెడ్డి చిల్లర మాటలతో రెచ్చిపోవడం దుర్మార్గమని ఆగ్రహం వ్యక్తంచేశారు. కేసీఆర్‌పై దుర్భాషలాడితే హృదయం రగిలిపోతున్నదని పేర్కొన్నారు.
55 ఏండ్ల కాంగ్రెస్, 17 ఏండ్ల చంద్రబాబు పాలనలోనే తెలంగాణ తీవ్రంగా నష్టపోయిందని స్పష్టంచేశారు. అల్పబుద్ధి కలిగిన రేవంత్‌రెడ్డి పాలనలో తెలంగాణ విలవిలలాడుతున్నదని కేటీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. పదేండ్ల పాలనలో తెలంగాణ బతుకు చిత్రాన్ని మార్చిన కేసీఆర్, నీళ్ల మంత్రిగా ప్రాజెక్టుల నిర్మాణంలో పాలుపంచుకున్న హరీశ్‌రావును ఉరితీయాలని రేవంత్ మాట్లాడడం సిగ్గుచేటని మండిపడ్డారు. ‘అసలు ఉరి వేయాల్సి వస్తే మాట తప్పిన కాంగ్రెస్‌కు ఎన్నిసార్లు వేయాలి? తెలంగాణ ప్రజలను నమ్మించి నట్టేట ముంచిన పార్టీకి ఏ శిక్ష వేయాలి?’ అంటూ ప్రశ్నాస్ర్తాలు సంధించారు. అశోక్‌నగర్‌కు వచ్చి ఏటా జాబ్ క్యాలెండర్ విడుదల చేసి రెండు లక్షల ఉద్యోగాలిస్తామని మోసం చేసినందుకు, వరంగల్ డిక్లరేషన్ సాక్షిగా రైతులకు రుణమాఫీ చేస్తామని చెప్పి మాట తప్పినందుకు, మహిళలకు ప్రతినెలా రూ.2,500 ఇస్తామని దగా చేసినందుకు, బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇస్తామని ద్రోహం చేసినందుకు రాహుల్‌గాంధీ, రేవంత్‌రెడ్డికి ఉరివేయాలి’అని తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు. అసెంబ్లీలో జరిగిన నదీజలాల చర్చలో నీళ్లపై బేసిక్స్ తెలియని, దేవాదుల ఏ బేసిన్లో ఉన్నదో తెలియని, ఇరిగేషన్‌పై అవగాహన లేని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నోటికొచ్చినట్టు మాట్లాడటం తీవ్ర ఆక్షేపణీయమని పేర్కొన్నారు. రేవంత్‌రెడ్డి బచావత్, బ్రిజేశ్‌కుమార్ ట్రిబ్యునల్‌కు, ఐఐటీ, ఐఐఐటీ, ఐటీఐకి తేడాతెలియదని, తెలిసిందల్లా దోచుకోవడం, దాచుకోవడమేనని దెప్పిపొడిచారు.
ఆరు గ్యారెంటీలు, 420 హామీల అమలులో కాంగ్రెస్‌ది అట్టర్‌ఫ్లాప్ సర్కారు అని, సర్వభ్రష్ట ప్రభుత్వానికి రేవంత్‌రెడ్డి అధినాయకుడిగా ఉన్నారని కేటీఆర్ ఎద్దేవాచేశారు. తెలంగాణలో సర్వత్రా విఫలమైన పాలన నడుస్తున్నదని విమర్శించారు. రేవంత్‌రెడ్డి ఏనాడూ తెలంగాణ కోసం కొట్లాడలేదని, మాట్లాడలేదని గుర్తుచేశారు. ఉద్యమకారులపై దాడులకు దిగిన దుర్మార్గుడని మండిపడ్డారు. ‘మేమందరం తెలంగాణ సాధన కోసం అలుపెరగని పోరాటం చేస్తున్న సమయంలో రేవంత్‌రెడ్డి సమైక్యవాదుల సంచులు మోస్తూ, వాళ్ల బూట్లకు పాలిష్ చేసిండు’ అని తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. కురచబుద్ధి, కుట్రపూరిత విధానాలతో తెలంగాణ ప్రజలకు తీరని వేదనను మిగుల్చుతున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. సుసంపన్నమైన తెలంగాణ రాష్ట్రం నీచపు మనస్తత్వం కలిగిన వ్యక్తి పాలనలో ఆగమవుతుంటే కడుపు తరుక్కుపోతున్నదని ఆవేదన వ్యక్తంచేశారు. నందమూరి చెప్పినట్టు అంగుష్ట మాత్రులు అనే పదానికి, ఆ మాటకు ఈ మూర్ఖపు ముఖ్యమంత్రి ముమ్మాటికీ అర్హుడని చురకలంటించారు. నాడు కాంగ్రెస్ నేతలను ఉద్దేశించి ఎన్టీఆర్ చేసిన వ్యాఖ్యలు అక్షరసత్యమని గుర్తుచేశారు.
రాజకీయాల్లో ఉన్నప్పుడు విలువలు ముఖ్యమని, కానీ రేవంత్‌రెడ్డికి ఇవేవీ తెలియదని కేటీఆర్ విమర్శించారు. ‘అసెంబ్లీసాక్షిగా కేసీఆర్, హరీశ్, నాపై రేవంత్‌రెడ్డి తిట్లదండకం అందుకోవడం, బూతులు మాట్లాడటం దురదృష్టకరం. మేం రేవంత్‌రెడ్డిలా తిట్టాలనుకుంటే తిట్టగలం..అవసరమైతే ముఖ్యమంత్రి తాతల తాతలను కూడా తూలనాడే శక్తి కలిగి ఉన్నోళ్లం. నాలుగు భాషల్లో అనర్గళంగా దూషించగలం. కానీ కేసీఆర్ నేర్పిన సంస్కారమే ముఖ్యమని భావిస్తున్నం. అందుకే మిన్నకుంటున్నం’ అని స్పష్టంచేశారు. రేవంత్‌రెడ్డి ఒక అజ్ఞాని, ఉష్ట్రపక్షి అని నిప్పులు చెరిగారు. ‘తెలంగాణకు జరిగిన ద్రోహానికి 55 ఏండ్ల కాంగ్రెస్, 17 ఏండ్ల మీ బాస్ చంద్రబాబునాయుడి నేతృత్వంలోని టీడీపీ ప్రభుత్వమే కారణం.. దానికి పరిపూర్ణమైన బాధ్యత మీదే’నంటూ ఆగ్రహం వ్యక్తంచేశారు.
శాసన సభానాయకుడైన రేవంత్‌రెడ్డి వినాశకాలే విపరీతబుద్ధి అనే చందంగా వ్యవహరిస్తున్నడు. అధికారమదంతో విర్రవీగుతూ బలుపుమాటలు మాట్లాడుతున్నడు. చావునోట్లో తలపెట్టి తెలంగాణను సాధించిన కేసీఆర్‌పై రాంబదు మాదిరిగా మాటల దాడి చేయడం దుర్మార్గం. రైతుబంధువు, తెలంగాణ బతుకును కోరిన త్యాగధనుడిని అనరాని మాటలనడం బాధాకరం.
-కేటీఆర్