ఆ వెంటనే టెండర్లు పిలవాలని సీఎం ఆదేశం
హైదరాబాద్, జనవరి 16 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్ రీజినల్ రింగ్ రోడ్డు (ట్రిపుల్ఆర్) ప్రాజెక్టు పనులను వేగవంతం చేయాలని సీఎం రేవంత్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. ఈ ప్రాజెక్టుకు అవసరమైన భూసేకరణను 3 నెలల్లో పూర్తి చేయాలని, ఇతర అడ్డంకులను అధిగమించేందుకు చర్యలు చేపట్టాలని స్పష్టం చేశారు. ఔటర్ రింగ్ రోడ్డు (ఓఆర్ఆర్) వెలుపల నిర్మించ తలపెట్టిన ట్రిపుల్ఆర్ ప్రాజెక్టులో ఉత్తర భాగం నిర్మాణానికి అవసరమైన 1,935.35 హెక్టార్లలో ఇప్పటికే 1,459.28 హెక్టార్ల భూసేకరణ పూర్తయింది.
దీంతో మిగిలిన భూసేకరణను త్వరగా పూర్తిచేసి, పనులకు టెండర్లు పిలవాలని సీఎం ఆదేశించారు. ట్రిపుల్ఆర్ దక్షిణ భాగాన్ని జాతీయ రహదారిగా ప్రకటించి, భూసేకరణ ప్రణాళికను రూపొందించాలని ఎన్హెచ్ఏఐని కోరారు. ట్రిపుల్ఆర్ ప్రాజెక్టు పూర్తి కోసం ఆర్థికంగా ఎంత భారమైనా భరించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉన్నదని తెలిపారు. రాష్ట్రంలో పారిశ్రామికాభివృద్ధిని వేగవంతం చేసేందుకు తెలంగాణను 3 క్లస్టర్లుగా విభజించాలని ప్రభుత్వం యోచిస్తున్నది. హైదరాబాద్ ఓఆర్ఆర్ లోపల ఉన్న ప్రాంతాన్ని అర్బన్ క్లస్టర్‌గా, ఓఆర్ఆర్-ట్రిపుల్ఆర్ మధ్యలో ఉన్న ప్రాంతాన్ని సెమీ అర్బన్ క్లస్టర్‌గా, ట్రిపుల్ఆర్ వెలుపల ఉన్న ప్రాంతాన్ని రూరల్ క్లస్టర్‌గా విభజించేందుకు సిద్ధమవుతున్నది. దీనిలో భాగంగా ట్రిపుల్ఆర్ ప్రాజెక్టును త్వరగా పూర్తి చేయడంపై సీఎం రేవంత్ ఇటీవల అధికారులతో చర్చించారు.