Jogu Ramanna | ఏడాది పాలన పూర్తయినా సర్వశిక్షా అభియాన్ ఉద్యోగులు, ఆశా వరర్ల సమస్యలను సీఎం రేవంత్‌రెడ్డి పట్టించుకున్న పాపాన పోవడంలేదని మాజీ మంత్రి జోగు రామన్న ఆగ్రహం వ్యక్తంచేశారు. హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్లో జోగు రామన్న మాట్లాడుతూ.. సర్వశిక్షా అభియాన్ ఉద్యోగుల సమస్యలను చాయ్ తాగినంత సేపట్లో పరిష్కరిస్తామని ఎన్నికల సమయంలో రేవంత్‌రెడ్డి హామీ ఇచ్చారని గుర్తుచేశారు. అధికారంలోకి వచ్చి 365 రోజులు దాటినా చాయ్ తాగినంత సమయం ముఖ్యమంత్రికి దొరకలేదా? అని నిలదీశారు.
సర్వశిక్షా అభియాన్ ఉద్యోగులు అన్ని జిల్లా కేంద్రాల్లో నిరాహార దీక్షలు చేస్తున్నారని జోగు రామన్న తెలిపారు. తమ డిమాండ్ల కోసం రోడ్డెకితే ఆశావర్కర్లను పోలీసులతో కొట్టించారని మండిపడ్డారు. ఆదిలాబాద్ జిల్లాలో మూసేసిన సిమెంట్ ఫ్యాక్టరీ తెరిపిస్తామని, ఆర్మూర్ నుంచి ఆదిలాబాద్‌కు రైల్వే లైన్ వేయిస్తామని కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా వాగ్దానం చేసిందని గుర్తుచేశారు. సిమెంట్ ఫ్యాక్టరీ ఎప్పుడు తెరిపిస్తారని ప్రశ్నించారు. బూటకపు హామీలెన్నో ఇచ్చి గద్దెనెకిన కాంగ్రెస్ పార్టీ వాటి అమలు దిశగా ప్రయత్నాలే చేయడం లేదని మండిపడ్డారు.
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో సీనియర్ నాయకులు పార్టీని విడిచివెళ్లినప్పటికీ బీఆర్ఎస్ బలం ఏమాత్రం చెక్కు చెదరలేదని జోగు రామన్న స్పష్టంచేశారు. ఆదిలాబాద్‌లో పార్టీ కార్యకర్తల సమావేశం నిర్వహించినట్టుగానే నిర్మల్, ఆసిఫాబాద్, మంచిర్యాల జిల్లా కార్యకర్తల మీటింగ్‌లు త్వరలోనే నిర్వహిస్తామని చెప్పారు. ఆ సమావేశాలకు హాజరు కావాలని కేటీఆర్‌ను ఆహ్వానించామని తెలిపారు. అసెంబ్లీ సమావేశాలు ముగియగానే జిల్లాలవారీగా కార్యకర్తల మీటింగ్‌లకు తాను హాజరవుతానని హామీ ఇచ్చిన కేటీఆర్‌కు కృతజ్ఞతలు చెప్పారు.