హైదరాబాద్, ఏప్రిల్ 26 (నమస్తే తెలంగాణ): కాంగ్రెస్ సర్కారు హామీల అమలుపై మాజీ మంత్రి హరీశ్‌రావు తన సవాల్‌కు కట్టుబడగా.. సీఎం రేవంత్‌రెడ్డి మాటలకే పరిమితమయ్యారు. ఆగస్టు 15లోగా రూ. 2 లక్షల రుణమాఫీ సహా ఆరు గ్యారెంటీల హామీలన్నీ నెరవేర్చితే తాను రాజీనామా చేస్తానని, లేనిపక్షంలో ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేస్తానని చెప్పిన రేవంత్‌రెడ్డి కూడా లేఖతో రావాలని సవాల్ విసిరారు. చెప్పిన మాట ప్రకారం శుక్రవారం ఉదయం గన్‌పార్క్‌లోని అమరవీరుల స్థూపం వద్దకు రాజీనామా పత్రంతో హరీశ్‌రావు వచ్చారు. రాజీనామా లేఖను బహిరంగంగా అందరికీ చూపించారు. ఉద్యమ జర్నలిస్టులకు దానిని అందజేశారు. కానీ.. సీఎం రేవంత్‌రెడ్డి మాత్రం అక్కడికి రాలేదు. దీంతో హరీశ్ సవాల్‌ను స్వీకరిస్తున్నానని రేవంత్‌రెడ్డి చేసినవన్నీ ఉత్తి ప్రగల్భాలేనని తేలిపోయిందని రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. హరీశ్‌రావుకు పదవులకు రాజీనామా చేయడం కొత్తేమీ కాదని గుర్తు చేస్తున్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో ప్రజల కోసం అనేకసార్లు పదవులకు రాజీనామా చేసిన విషయాన్ని గుర్తు చేస్తున్నారు. ఇప్పడు కూడా అదే స్ఫూర్తిని ప్రదర్శించారని, రాష్ట్ర రైతుల ప్రయోజనం కోసం రాజీనామాకు సిద్ధం అయ్యారని చెప్తున్నారు. కానీ, సీఎం రేవంత్‌రెడ్డికి మాత్రం ఇప్పటివరకు రాజీనామా చేసిన చరిత్ర లేదని గుర్తు చేస్తున్నారు. ఇప్పుడు కూడా అదే తరహా రాజకీయం చేస్తున్నారని చెప్తున్నారు.