Harish Rao | అబద్ధాలు ప్రచారం చేయడంలో సీఎం రేవంత్ రెడ్డికి డబుల్ పీహెచ్డీ ఇవ్వొచ్చని మాజీ మంత్రి హరీశ్‌రావు అన్నారు. పట్టపగలే నిర్భయంగా గోబెల్స్ ప్రచారం చేస్తుంటాడని విమర్శించారు. హుజూరాబాద్ నియోజకవర్గంలో హరీశ్‌రావు మీడియాతో మాట్లాడుతూ.. కర్ణాటక, తెలంగాణలో గ్యారెంటీల పేరుతో కాంగ్రెస్ నాయకులు మోసం చేశారని అన్నారు. మహారాష్ట్రలోనూ గ్యారెంటీ పేరుతో మోసం చేయబోయారని తెలిపారు. అక్కడకు వెళ్లి మహిళలకు 3 వేలు, రైతులకు రుణమాఫీ చేస్తామని హామీలు గుప్పించారని పేర్కొన్నారు. తెలంగాణ నుంచి సీఎం, మంత్రులు వెళ్లి ప్రచారం చేశారని చెప్పారు. కానీ వీరిని చూడగానే తెలంగాణలో చేసిన మోసాన్ని గుర్తించారని.. అందుకే తగిన బుద్ధి చెప్పారని అన్నారు.
నూటొక్క దేవుళ్ల మీద ఒట్లు పెట్టి సీఎం రేవంత్ రెడ్డి మోసం చేశారని హరీశ్‌రావు విమర్శించారు. మహిళలకు 2500, ఫించన్, భరోసా బోనస్, తులం బంగారం ఇవ్వలేదని అన్నారు. మహారాష్ట్రలో కాంగ్రెస్ పార్టీకి గుణపాఠం చెప్పారు. రేవంత్, కాంగ్రెస్ నాయకులు బుద్ధి తెచ్చుకోవాలని సూచించారు. ఓటమి తర్వాత అయినా బుద్ధి తెచ్చుకొని, వంద రోజుల్లో చేస్తామన్న హామీలు అమలు చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఖూనీ అయ్యిందని విమర్శించారు.
పట్ట పగలే అబద్ధాలను కూడా నిర్భయంగా మాట్లాడే రేవంత్ కు డాక్టరేట్, డబుల్ PHD ఇవ్వాలి.
– మాజీ మంత్రి, ఎమ్మెల్యే @BRSHarish pic.twitter.com/85qzYGInIb
— BRS Party (@BRSparty) November 24, 2024
దళిత బంధు పథకాన్ని హుజూరాబాద్‌లో కేసీఆర్ ప్రారంభించారని కేసీఆర్ గుర్తుచేశారు. 18,500 కుటుంబాలకు కేసీఆర్ దళిత బంధు ఇచ్చారని తెలిపారు. రెండో విడత డబ్బులు ఇవ్వడం లేదని ప్రశ్నిస్తే ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి మీద అరాచకానికి పాల్పడ్డారని తెలిపారు. కొత్త పథకాలు దేవుడెరుగు. మేము ఇచ్చినవి ఇవ్వడం లేదని మండిపడ్డారు. ఆర్థిక మంత్రిగా, ఉప ముఖ్యమంత్రిగా ఉండి దళితులకు ఏదైనా మేలు చేశారా అని భట్టి విక్రమార్కను ప్రశ్నించారు.ఇప్పటికే విడుదలైన దళిత బంధు పథకం డబ్బులను వెంటనే ఇవ్వాలని డిమాండ్ చేశారు.
కొడంగల్‌లో ఏర్పాటు చేసేది ఫార్మా సిటీ కాదు.. ఇండస్ట్రియల్ కారిడార్ అని సీఎం రేవంత్ రెడ్డి మాట మార్చడంపై హరీశ్‌రావు మండిపడ్డారు. అబద్ధాలు చెప్పడానికి సిగ్గుండాలని అన్నారు. జూలై 19వ తేదీన ఇచ్చిన గెజిట్‌లో ఫార్మా సిటీ అని పేర్కొన్నారని తెలిపారు. ఆ గెజిట్‌ను వాపసు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ముందు ప్రజల దగ్గరకు వెళ్లి మాట్లాడాలని.. సమస్య పరిష్కరించాలని సూచించారు. పచ్చటి పొలాలను తొండలు పెట్టని జాగ అంటున్నారని మండిపడ్డారు. అబద్ధాలు మాట్లాడటంలో రేవంత్ రెడ్డికి డాక్టరేట్ ఇవ్వాలని అన్నారు.
మహారాష్ట్ర ఎన్నికల్లో సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు ప్రచారం చేసిన దగ్గర కాంగ్రెస్ పార్టీ ఓడిపోయిందని హరీశ్‌రావు తెలిపారు. తెలంగాణలో మోసం చేసింది చాలదని.. మా వద్దకు వచ్చారని మహారాష్ట్ర ప్రజలు తిప్పికొట్టారని అన్నారు. మాటలు, మూటలు కట్టుడు బంద్ చేసి, గ్యారెంటీలు అమలు చేయాలని డిమాండ్ చేశారు. చంద్రబాబు లెక్క పాత బకాయిలు కలుపుకొని ఇవ్వాలని డిమాండ్ చేశారు. అక్రమ అరెస్టులు, కేసులను హరీశ్‌రావు తీవ్రంగా ఖండించారు. వెంటనే దళిత బంధు డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. దీనిగురించి దళితుల పక్షాన అసెంబ్లీలో పోరాటం చేస్తామని స్పష్టం చేశారు.