హైదరాబాద్ జూలై 19 (నమస్తేతెలంగాణ): కులగణన సర్వే డాటా కాదని, మెగా హెల్త్ చెకప్ అని సీఎం రేవంత్‌రెడ్డి అభివర్ణించారు. తమ పార్టీ అగ్రనేత రాహుల్‌గాంధీ మాట ప్రకారం కులగణనను విజయవంతం గా నిర్వహించామని చెప్పారు. కులగణనపై అధ్యయనానికి జస్టిస్ సుదర్శన్‌రెడ్డి చైర్మన్‌గా ప్రభుత్వం నియమించిన స్వతంత్రప్రతిపత్తి కలిగిన నిపుణుల కమిటీ శనివారం 300 పేజీలతో కూడిన నివేదికను ప్రభుత్వానికి సమర్పించింది. మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థలో సీఎం రేవంత్‌రెడ్డితో నిపుణుల కమిటీ సమావేశమైంది. ఈ సమావేశం లో సీఎం మాట్లాడుతూ.. బలహీనవర్గాల అ భ్యున్నతికి, సామాజిక న్యాయానికి కులగణన బాటలు వేస్తుందని అన్నారు. అర్హులందరికీ సంక్షేమ ఫలాలు అందేలా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. పట్టణ, గ్రామీణ ప్రాం తాల మధ్య వ్యత్యాసాలు, ఇందుకు గల కారణాలపై అధ్యయనం చేయాలని నిపుణుల కమిటీని కోరుతున్నానని తెలిపారు. కమిటీ చైర్మన్ జస్టిస్ సుదర్శన్‌రెడ్డి, వైస్‌చైర్మన్ ప్రొఫెసర్ కంచె ఐలయ్య, సభ్యులు సీఎంకు తమ నివేదిక అందజేశారు. సర్వే శాస్త్రీయమైనదని, అధికారికమని, పారదర్శకమని దేశానికి రోల్‌మోడల్‌గా నిలుస్తుందని కమిటీ తెలిపింది.
కులగణన రిపోర్ట్ బయటపెట్టాలి ; తెలంగాణ రాష్ట్ర బీసీ కమిషన్ చైర్మన్ నిరంజన్
హైదరాబాద్, జూలై 19 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన కులగణన సర్వే నివేదికను ప్రజలకు అందుబాటులో పెడితే పారదర్శకంగా ఉంటుందని తెలంగాణ రాష్ట్ర బీసీ కమిషన్ చైర్మన్ నిరంజన్ తెలిపారు. ఈ మేరకు శనివారం ఒక ప్రకటన విడుదల చేశారు. రాష్ట్రంలో చేపట్టిన కులగణన సర్వే నివేదికను అధ్యయనం చేసేందుకు ప్రభుత్వం నియమించిన స్వతంత్ర నిపుణుల కమిటీ తన నివేదిక సమర్పించడంపై హర్షం వ్యక్తంచేశారు. కమిటీ ప్రభుత్వానికి ఇచ్చిన నివేదిక రాష్ట్రంలో బీసీల స్థితిగతులను ప్రతిబింబిస్తున్నదని చెప్పారు. బీసీ కమిషన్ తీసుకోబోయే అనేక నిర్ణయాలకు నివేదికలోని సమాచారం ఉపయోగపడుతుందని తెలిపారు.