హైదరాబాద్ సిటీబ్యూరో, మార్చి 28 (నమస్తే తెలంగాణ): ఎన్ని అడ్డంకులు ఎదురైనా, ఎంతమంది విమర్శించినా మూసీ పునరుజ్జీవనం ప్రాజెక్టును పూర్తి చేస్తామని సీఎం రేవంత్‌రెడ్డి స్పష్టంచేశారు. మూసీ సుందరీకరణ ఫేజ్-1 ప్రాజెక్టులో భాగంగా శనివారం రంగారెడ్డి జిల్లా మంచిరేవులలో ఓంకారేశ్వర స్వామి ఆలయ పునర్నిర్మాణానికి సీఎం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. రూ.700 కోట్లతో ఎనిమిది ఎకరాల విస్తీర్ణంలో ఓంకారేశ్వరస్వామి దేవాలయ నిర్మాణం, వీరభద్రస్వామి, మచిలేశ్వరస్వామి ఆలయాల పునర్నిర్మాణం చేపట్టనున్నట్టు ప్రకటించారు. మూసీ పరీవాహకంలో మతసామరస్యానికి ప్రతీకగా ముస్లింల కోసం మసీదు, సిక్కుల కోసం స్వర్ణ దేవాలయం లాంటి గురుద్వారా, క్రైస్తవుల కోసం చర్చిని నిర్మిస్తామని చెప్పారు. ఈ కార్యక్రమం ఆద్యంతం ఆంక్షల నడుమ కొనసాగింది.
శంకుస్థాపన కార్యక్రమంలో కొద్దిమంది మాత్రమే పాల్గొనేందుకు అవకాశం కల్పించారు. సీఎం కుటుంబసభ్యులతోపాటు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, సీఎస్ రామకృష్ణారావు, వేం నరేందర్‌రెడ్డి, ఎమ్మెల్యేలు ప్రకాశ్‌గౌడ్, కాలె యాదయ్య, నవీన్ యాదవ్, అనిల్‌కుమార్‌ను మాత్రమే అనుమతించారు. అదే ప్రాంతానికి చెందిన ముదిరాజ్ కార్పొరేషన్ చైర్మన్, కాంగ్రెస్ సీనియర్ నేత బొర్రా జ్ఞానేశ్వర్‌ను వేదిక మీదకు ఆహ్వానించకపోవడంతో ఆయన ఎంఆర్డీసీఎల్ చైర్మన్ నరసింహారెడ్డితో వాగ్వివాదానికి దిగారు. కనీస ప్రొటోకాల్ పాటించకుండా కార్యక్రమాన్ని ఎలా నిర్వహిస్తారని నిలదీశారు. ఏండ్ల తరబడిగా పార్టీకి సేవ చేసిన వారిని పక్కన పెట్టి కొత్తగా వచ్చిన వారికి పెద్ద పీట వేస్తున్నారని అసహనం వ్యక్తం చేశారు.
గ్రామస్థులకు అనుమతి నిరాకరణ..గృహ నిర్బంధాలు
మంచిరేవుల గ్రామ పరిధిలోని ఆలయంలో శంకుస్థాపన కార్యక్రమం చేపట్టి ఆ గ్రామస్థులను అనుమతించకపోవడంతో వారు తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. తమను అనుమతించకుండా ఆలయం కట్టేందుకు శంకుస్థాపన ఎలా చేస్తారని వారు ఎంఆర్డీసీఎల్ చైర్మన్ నరసింహారెడ్డిని నిలదీశారు. శంకుస్థాపన కార్యక్రమాన్ని అడ్డుకుంటారనే అనుమానంతో పోలీసులు పరీవాహక ప్రాంతంలోని కొంతమంది కాంగ్రెస్ నేతలను గృహ నిర్బంధం చేశారు. హిమయాత్‌సాగర్ మాజీ సర్పంచ్ ఆంజనేయులు, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, దర్గా ఖలీజ్‌ఖాన్ మాజీ కార్పొరేటర్ అస్లాంబిన్ అబ్దుల్లా, మాజీ కార్పొరేటర్ ముద్దం రాములను హౌస్అరెస్ట్ చేశారు. మూసీ పునరుజ్జీవనం పేరిట భూములను లాక్కోవద్దని సొంత పార్టీ నేతలే వ్యతిరేకించడం, వారిని కాంగ్రెస్ సర్కార్ గృహనిర్బంధంలో ఉంచడం చర్చనీయంగా మారింది.