హైదరాబాద్, ఆగస్టు 9 (నమస్తే తెలంగాణ): ఇకపై తెలంగాణ రాష్ట్రాన్ని ‘ప్యూచర్ స్టేట్ (భవిష్యత్తు రాష్ట్రం)’ అని పిలుద్దామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పిలుపునిచ్చారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ హబ్, నెట్ జీరో సిటీ లాంటి ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టులతో తెలంగాణ రాష్ట్రం ‘ది ఫ్యూచర్ స్టేట్’కు పర్యాయపదంగా నిలుస్తుందని చెప్పారు. అమెరికా పర్యటనలో భాగంగా కాలిఫోర్నియాలో ఇండియన్ కాన్సులేట్ జనరల్ నిర్వహించిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బిజినెస్ రౌండ్ టేబుల్లో సీఎం పాల్గొన్నారు. ఈ సందర్భంగా టెక్ యూనికార్న్స్ సీఈవోలను ఉద్దేశించి మాట్లాడారు. ఆయా సంస్థలను తెలంగాణకు ఆహ్వానించారు. ‘మీ భవిష్యత్తును ఆవిషరించుకోండి. అందరం కలిసికట్టుగా సరికొత్త భవిష్యత్తును తీర్చిదిద్దుకుందాం’ అని పిలుపునిచ్చారు. అమెరికాలో ప్రతి రాష్ట్రానికి ఒక ప్రత్యేక లక్ష్యం, దానిని సూచించే నినాదం ఉన్నదని, ఇదే తరహాలో తెలంగాణను ఫ్యూచర్ స్టేట్ ట్యాగ్ లైన్‌తో పిలుద్దామని అన్నారు.
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబుతో కలిసి ప్రఖ్యాత అడోబ్ సిస్టమ్స్ సీఈవో శంతను నారాయణ్‌తో భేటీ అయ్యారు. హైదరాబాద్ 4.0 ఫ్యూచర్ సిటీ నిర్మాణం, యంగ్ ఇండియా సిల్స్ యూనివర్సిటీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సిటీ ఏర్పాటు ప్రణాళికలను వివరించారు. హైదరాబాద్‌లో పెట్టుబడులపై ఆయన ఆసక్తి కనబరిచారని సీఎంవో తెలిపింది. టెక్ విజనరీ శంతను నారాయణ్‌ను కలుసుకోవటం ఆనందంగా ఉందని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చెప్పారు. అమెరికాలోనే అతి పెద్ద బయో టెక్నాలజీ కంపెనీ ఆమ్జెన్ తెలంగాణలో కార్యకలాపాలను విస్తరించనున్నది.
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్‌బాబు శాన్ఫ్రాన్సిసోలోని ఆమ్జెన్ ఆర్అండ్డీ కేంద్రంలో కంపెనీ ఎండీ డాక్టర్ డేవిడ్రీస్, నేషనల్ ఎగ్జిక్యూటివ్ సోమ్ చటోపాధ్యాయతో సమావేశమయ్యారు. అనంతరం.. హైదరాబాద్‌లో కొత్తగా రిసెర్చ్ అండ్ డెవలప్మెంట్ విభాగం ప్రారంభించనున్నట్టు కంపెనీ ప్రకటించింది. హైటెక్ సిటీలో ఆరు అంతస్తుల భవనంలో ఈ సెంటర్ ఏర్పాటు కానున్నది. దాదాపు 3 వేల మందికి ఉద్యోగాలు లభించనున్నాయి. ఈ ఏడాది చివరి త్రైమాసికం నుంచే కంపెనీ తమ కార్యకలాపాలను ప్రారంభించనున్నట్టు సీఎంవో తెలిపింది. ఈ పెట్టుబడులపై సీఎం హర్షం వ్యక్తం చేశారు. దీంతో తెలంగాణలోని నిరుద్యోగులకు భారీ ఎత్తున ఉద్యోగాలు లభిస్తాయని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి స్పష్ణం చేశారు.