Padi Kaushik Reddy : కేసీఆర్ తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి ఉండకపోతే ఇవాళ రేవంత్‌రెడ్డికి సీఎం పదవి దక్కేదా..? అని బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి ప్రశ్నించారు. రాష్ట్రం సిద్ధించకపోతే అసలు తెలంగాణ సీఎం అనే పదవే ఉండేది కాదని అన్నారు. శుక్రవారం మధ్యాహ్నం ప్రెస్మీట్లో కౌశిక్‌రెడ్డి మీడియాతో మాట్లాడారు. ఇకనైనా రేవంత్‌రెడ్డి అవాకులు, చెవాకులు పేలడం మానుకోవాలని సూచించారు.
‘రేవంత్‌రెడ్డి చీటికిమాటికి కేసీఆర్‌ను, కేటీఆర్‌ను, హరీశ్‌రావును దూషిస్తున్నరు. వాస్తవానికి కేసీఆర్ లేకుంటే ఇయ్యాల రేవంత్‌రెడ్డి ముఖ్యమంత్రి అయ్యేవాడా..? అసలు ఆ ముఖ్యమంత్రి కుర్చీ ఉండేదా..? నీకు ముఖ్యమంత్రి పదవి కేసీఆర్ పెట్టిన భిక్షే కదా..? ఎందుకు మరి ఎగిరెగిరి పడుతున్నరు. ఇగనన్నా మీ అవాకులు, చెవాకులు బంద్ చేయండి. మీ సంగతి తెలంగాణ ప్రజలకు అర్థమయ్యింది. మీ గుండాయిజం, రౌడీయిజం చూసిండ్రు.’ అన్నారు.
‘నిన్న మా హరీశ్‌రావును, ఎమ్మెల్యేలను అరెస్ట్ చేసి ఎక్కడో కల్వకుర్తికి ఎందుకు తీసుకపోయిండ్రు..? హరీశ్‌రావు చేసిన తప్పేంది..? మీరు ఎందుకు ఈ వెకిలి చేష్టలు చేస్తుండ్రు..? మీరు పోలీసులను అడ్డం పెట్టుకుని ఎన్ని రోజులు ఈ అరాచకాలు చేస్తరు..? మీపై ప్రజలు తిరగబడే రోజులు దగ్గరపడ్డయ్. ఇప్పటికే కొందరు తిరగబడుతున్నరు. మీరు ఆరు గ్యారంటీలు అమలు చేయకపోతే ఇక ముందు ఏ ఒక్క కాంగ్రెస్ పార్టీ నాయకుడు కూడా ప్రజల్లో తిరిగే పరిస్థితి ఉండదు’ అని కౌశిక్ రెడ్డి హెచ్చరించారు.