CM Revanth Reddy | హైదరాబాద్, కోరుట్ల, మే 1 (నమస్తే తెలంగాణ): ప్రధాని మోదీ బీసీ కాదని, ప్రధా ని అయ్యాక ఆయన కులాన్ని బీసీలలో కలిపారని పీసీసీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. స్వతహాగా బీసీ కాకపోవడం వల్లనే ఆయనకు బీసీలపై ప్రేమ లేదని విమర్శించారు. ఓబీసీల ఓట్ల కోసమే ఆయన బీసీ అవతారం ఎత్తుతుంటారని ఎద్దేవా చేశారు.
రిజర్వేషన్ల రద్దు అంశంపై బీజేపీ అగ్రనేత అమిత్‌షా వ్యాఖ్యలను వక్రీకరించి సోషల్ మీడియాలో పోస్టు చేశారన్న అభియోగంపై తనకు నోటీసులొచ్చిన నేపథ్యంలో సీఎం రేవంత్‌రెడ్డి బుధవారం తన నివాసంలో మీడియాతో మాట్లాడారు. అంతకుముందు కోరుట్లలో ఎన్నికల ప్రచారసభలో కూడా ప్రసంగించారు. తనపై కేసు పెట్టడానికి తెలంగాణలో పోలీసులు లేరా? అని రేవంత్‌రెడ్డి ప్రశ్నించారు.
ఢిల్లీ పోలీసులు కేంద్ర హోం శాఖ ఆధీనంలో ఉంటారు కాబట్టి తనపై అక్కడి పోలీసులకు ఫిర్యాదు చేశారని పేర్కొన్నారు. తనను ఎన్నికల ప్రచారంలో పాల్గొనకుండా చూసేందుకే కేసు పెట్టారని ఆరోపించారు. కేసులు, నోటీసులకు రేవంత్‌రెడ్డి భయపడ్తడా? అని ప్రశ్నించారు. ఢిల్లీ నుంచి ఇక్కడికి వచ్చిన పోలీసులు తమ లీగల్‌సెల్ మహిళా న్యాయవాదిపై దురుసుగా ప్రవర్తించారని మండిపడ్డారు.
‘సీఎంకు ఏ పనీ ఉండదా? ఎక్కడైనా వీడియోలు మా ర్ఫింగ్ చేసుకుంటూ కూర్చుంటాడా? కిషన్‌రెడ్డికి అసలు బుర్రుందా? నోటికొచ్చింది మాట్లాడటమేనా?’ అని ఆగ్రహం వ్యక్తంచేశారు. తనకు కేంద్రం నోటీసులు ఇవ్వడాన్ని తనపై వ్యక్తిగతంగా చేసిన దాడిగా భావించడం లేదని, యావత్తు తెలంగాణపై చేస్తున్న దాడిగా భావిస్తున్నానని పేర్కొన్నారు.