CM Revanth Reddy | హైదరాబాద్, ఫిబ్రవరి 17 (నమస్తే తెలంగాణ): కాళేశ్వరం ప్రాజెక్టు తెలంగాణకు వరప్రదాయిని కాదని, తెలంగాణకు ఒక కళంకంగా మిగిలిపోయిందని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. తమ్మిడిహెట్టి బరాజ్‌ను కొనసాగించాలని సూచించినా, మేడిగడ్డ వద్ద బరాజ్ కట్టొద్దని చెప్పినా గత ప్రభుత్వం పెడచెవిన పెట్టిందని విమర్శించారు.
సాగునీటి రంగంపై శనివారం అసెంబ్లీలో జరిగిన చర్చలో సీఎం మాట్లాడారు. ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టుకు అడ్డంకులను తొలగించేందుకు ఉమ్మడి రాష్ట్రంలోనే మహారాష్ట్ర సీఎంతో చర్చలు జరిగాయని, 2012లో అంతర్రాష్ట్ర బోర్డు, స్టాండింగ్ కమిటీ, కో-ఆర్డినేషన్ కమిటీలు వేశారని తెలిపారు. ఈ ప్రాజెక్టు వల్ల నాడు మహారాష్ట్రలో ముంపునకు గురయ్యేది 1,850 ఎకరాల పట్టా భూములు మాత్రమేనని చెప్పారు.
అది వదిలిపెట్టి మేడిగడ్డ దగ్గర ప్రాజెక్టు నిర్మించాలని నాటి సీఎం కేసీఆర్‌కు ఏ దేవుడు కలలోకి వచ్చి చెప్పారో తెలియదని ఎద్దేవా చేశారు. గోదావరి ప్రాజెక్టులపై ఐదుగురు రిటైర్డ్ ఇంజినీర్లతో నాటి సీఎం కేసీఆర్, హరీశ్‌రావు ఒక కమిటీ వేశారని, ఆ కమిటీ సమగ్రంగా పరిశీలించి 14 పేజీల నివేదిక ఇచ్చిందని చెప్పారు.
తమ్మిడిహెట్టి దగ్గరే ప్రాజెక్టు నిర్మించాలని కమిటీ సూచించిందని తెలిపారు. 153 మీటర్ల ఎత్తులో నిర్మించేందుకు మహారాష్ట్రతో చర్చలు జరపాలని, ఒప్పుకోకుంటే చివరికి 150 మీటర్ల ఎత్తుతో నిర్మించాలని సూచించిందని పేర్కొన్నారు. మేడిగడ్డ వద్ద బరాజ్ నిర్మిస్తే నిరుపయోగమని ఆ కమిటీ తేల్చిందని తెలిపారు. ఆ నివేదికను తొకిపెట్టి మామా అల్లుళ్లు (కేసీఆర్, హరీశ్‌రావు) కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మించారని విమర్శించారు. వాళ్లిద్దరూ కలిసి రాష్ర్టానికి తీరని ద్రోహం చేశారని ఆరోపించారు.
‘ప్రాజెక్టులు పగిలిపోతుంటే ప్రజలకు క్షమాపణలు చెప్పాల్సింది పోయి.. సభలో మమ్మల్ని ప్రశ్నిస్తారా?’ అని మండిపడ్డారు. ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టును ఆపితే నాడు చేవెళ్లలో సబితా ఇంద్రారెడ్డి ధర్నా చేశారని గుర్తుచేశారు. ఆమె ఇప్పుడు హరీశ్‌రావును సమర్థిస్తున్నారని విమర్శించారు. జరిగిన తప్పులకు హరీశ్‌రావు క్షమాపణ చెప్పి… జ్యుడీషియల్ విచారణకు వచ్చినప్పుడు నిజాలు ఒప్పుకోవాలని సూచించారు.