CM Revanth Reddy | హైదరాబాద్, ఆగస్టు 16 (నమస్తే తెలంగాణ): తన సోదరుల్లో ఎవరూ ప్రొటోకాల్ వాడటం లేదని, ఎవరికీ ప్రభుత్వంలో పదవులు లేవని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. ఢిల్లీ పర్యటనలో భాగంగా ఆయన మీడియాతో చిట్‌చాట్ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. తనకు ఏడుగురు సోదరులని, వీరికి ప్రభుత్వంలో ఎలాంటి బాధ్యతలు అప్పగించలేదన్నారు. తాను సీఎం అయ్యానని వారు ఇంట్లో కూర్చోలేరు కదా? అని ప్రశ్నించారు. వారు విదేశీ పర్యటనకు వెళ్లినా రాజకీయం చేస్తున్నారని మండిపడ్డారు.
తమ ప్రభుత్వం ఏ పథకాన్నీ ఆపలేదని చెప్పారు. ఉద్యోగులకు ప్రతినెల 1న వేతనాలు ఇస్తున్నట్టు తెలిపారు. పీసీసీ అధ్యక్ష పదవిపై అధిష్టానం నిర్ణయమే ఫైనల్ అని స్పష్టం చేశారు. తన అభిప్రాయం ఎప్పుడో చెప్పానన్నారు. రుణమాఫీ పూర్తి చేయడమే తన ప్రాధాన్యత అని, ఈ మేరకు పూర్తి చేశానన్నారు. రాజ్యసభ సభ్యుడిగా సింఘ్వి రాకను స్వాగతిస్తున్నానని చెప్పారు. వీ హనుమంతరావు కాంగ్రెస్ సీనియర్ నేత అని, ఆయనను మించిన విధేయుడు కాంగ్రెస్‌కు లేడన్నారు.
హైదరాబాద్, ఆగస్టు16 (నమస్తే తెలంగాణ): గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలుగా నామినేట్ అయిన తెలంగాణ జన సమితి అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాంరెడ్డి, అమీర్ అలీఖాన్ శుక్రవారం ప్రమాణ స్వీకారం చేశారు. మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి వారితో ప్రమాణ స్వీకారం చేయించారు. కార్యక్రమానికి మంత్రులు పొన్నం ప్రభాకర్, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరై ఎమ్మెల్సీలకు శుభాకాంక్షలు తెలియజేశారు.
షాద్‌నగర్, ఆగస్టు 16: షాద్ నగర్ పోలీసులపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదైంది. ఈ నెల 10న దొంగతనం నెపంతో తనపై పోలీసులు థర్డ్ డిగ్రీ ప్రయోగించి చిత్రహింసలకు గురి చేశారని బాధిత మహిళ సునీత సీఐకి ఫిర్యాదు చేశారు. విచక్షణారహితంగా కొట్టి, బయటకు చెప్పితే పెట్రోల్ పోసి అంటిస్తామని పోలీసులు బెదిరించినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. తనతోపాటు తన భర్త, కుమారుడిని కూడా పోలీసులు కొట్టారని తెలిపారు. దీంతో సస్పెన్షన్‌కు గురైన డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ రాంరెడ్డితోపాటు నలుగురు సిబ్బందిపై కేసు నమోదు చేసిన సీఐ దర్యాప్తు జరుపుతున్నారు.
హైదరాబాద్, ఆగస్టు 16 (నమస్తే తెలంగాణ): మహాత్మా జ్యోతిబాఫూలే ప్రజాభవన్‌లో శుక్రవారం నిర్వహించిన ప్రజావాణిలో 319 దరఖాస్తులు అందా యి. రెవెన్యూ 50, మైనారిటీ వెల్ఫేర్ 61, పంచాయత్‌రాజ్ గ్రామీణాభివృద్ధి 27, విద్యుత్‌శాఖ 81, ఆరోగ్యశ్రీ 21 ఇతర శాఖలకు సంబంధించి 79 దరఖాస్తులు అందినట్టు అధికారులు తెలిపారు. రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి, ప్రజాపాలన ప్రత్యేకాధికారి దివ్య దరఖాస్తులు స్వీకరించారు.