హైదరాబాద్: ఆపరేషన్ సిందూర్‌లో భాగంగా దేశ రక్షణ కోసం మన సైన్యం పోరాడుతున్న తీరు స్ఫూర్తిదాయకమని బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద (KP Vivekanand) అన్నారు. దేశ ప్రజలంతా సైన్యానికి సంఘీభావం వ్యక్తం చేస్తున్నారని తెలిపారు. పాక్ దాడిలో అమరుడైన ఏపీ జవాన్ మురళీ నాయక్‌కు బీఆర్ఎస్ ఘనంగా నివాళులర్పిస్తున్నదని చెప్పారు. హైదరాబాద్ తెలంగాణ భవన్లో బీఆర్ఎస్వీ అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్, కురువ విజయ్ కుమార్‌తో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. అందాల పోటీలకు బీఆర్ఎస్ వ్యతిరేకం కాదన్నారు. అందాల పోటీలు ఆహ్లాదకరమైన వాతావరణంలో జరగాలని, యుద్ధ వాతావరణంలో కాదని చెప్పారు.
మిస్ వరల్డ్ పోటీలకు మూడంచెల భద్రత కల్పిస్తామని ప్రభుత్వం షెడ్యూల్ కూడా ప్రకటించింది, అత్యవసర సేవలు యుద్ధక్షేత్రంలో ఉండాలి కానీ, అందాల పోటీల్లో కాదని వెల్లడించారు. రేవంత్ పాలనలో రాష్ట్రం పిచ్చోడి చేతిలో రాయిలా మారిందని విమర్శించారు. సలహాదారులు ముఖ్యమంత్రికి ఏం సలహాలు ఇస్తున్నారో అర్థం కావడం లేదని చెప్పారు. ఆపరేషన్ సిందూర్ నేపధ్యంలో కగార్‌ను కూడా నిలిపి వేశారు. కగార్‌లో పాల్గొంటున్న బలగాలను కేంద్రం అత్యవసరంగా వెనక్కి పిలిచింది . సైన్యానికి సంఘీభావంగా దేశమంతా ర్యాలీలు జరుగుతుంటే సీఎం మాత్రం అందాల పోటీలు, క్యాట్‌వాక్ పోటీల్లో బిజీగా ఉన్నారని ఎద్దేవా చేశారు.
దేశవ్యాప్తంగా అనేక విమానాశ్రయాలు, పోర్టులను కూడా మూసి వేశారని, నిత్యావసర వస్తువుల ధరలు పెరుగుతాయని ప్రజలు ఆందోళనలతో ఉన్నారని తెలిపారు. ప్రజల భయాందోళనలు నివృత్తి చేయాల్సిన సీఎం రేవంత్ అందాల పోటీల బిజీలో ఉన్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అందాల పోటీలు రాష్ట్ర భవిష్యత్‌కు కీలకమని ఓ చీఫ్ సెక్రటరీ స్థాయి అధికారి మాట్లాడొచ్చా అని ప్రశ్నించారు. సీఎం రేవంత్ తెలంగాణ పరువును దిగజారుస్తున్నారని విమర్శించారు. పాలన అంటే చిన్న పిల్లల ఆటనా అని మండిపడ్డారు. అభినవ నీరో రేవంత్ రెడ్డి .. మన విద్యార్థులు పంజాబ్, శ్రీనగర్ నుంచి సొంత స్థలాలకు రావాలనుకుంటున్నారు. వారిగురించి ఒక్కసారైనా ఆలోచించారా అని ప్రశ్నించారు. అలో లక్ష్మణా అని ఓ వైపు రైతులు అల్లాడుతుంటే.. సీఎం రేవంత్ అందాల పోటీలు అంటూ వెంపర్లాడుతున్నారు . సీఎం ఆలోచనా విధానం మారాలి. అందాల పోటీలను తక్షణమే ఆపాలని డిమాండ్ చేశారు.