హైదరాబాద్ సిటీబ్యూరో, జూలై 2 (నమస్తే తెలంగాణ): జర్నలిస్టు కేవీఆర్‌ను పోలీసులు ఓ హంతకుడిని, రేపిస్టును లాక్కెళ్లినట్టు ఈడుకెళ్లారని ఆయన భార్య విజయలక్ష్మి ఆవేదన వ్యక్తంచేశారు. ఏపీ పోలీసులు ఒక ఫేక్ కేసులో తెలంగాణ జర్నలిస్టును హంతకుడిలాగా తీసుకెళ్తుంటే ముఖ్యమంత్రి ఏం చేస్తున్నారు? కేవీఆర్ అరెస్ట్ వెనుక సీఎం రేవంత్‌రెడ్డి ఉన్నారా? ఇదంతా ఆయనకు తెలిసే జరుగుతున్నదా? అని ఆమె ప్రశ్నించారు. ఉదయం నుంచి మా ఇంటి ముందు రెక్కీ నిర్వహించి.. ఇంటి నుంచి బయటకు రాగానే వచ్చి లాక్కెళ్లారని తెలిపారు.
ఎందుకు తీసుకెళ్తున్నారని అడిగినందుకు తనను కూడా లాగి పడేశారని కన్నీటి పర్యంతమయ్యారు. స్థానిక పోలీసులు వచ్చాక సరూర్‌నగర్ పీఎస్‌కు వెళ్లి మాట్లాడుతామన్నా పట్టించుకోలేదని వాపోయారు. కేసు ఎక్కడ నమోదైందో అక్కడికి వెళ్లి మాట్లాడుకోవాలని చెప్తున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. కేవీఆర్ చేసిన నేరమేంది? ఆయనను ఎక్కడికి తీసుకెళ్లారో కూడా తెలియని పరిస్థితిలో ఉన్నామని అన్నారు. తెలంగాణ ప్రభుత్వం ఈ విషయమై ఎందుకు స్పందించడం లేదు? ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆంధ్రా పోలీసులకు సహకరిస్తున్నారా? అని నిలదీశారు. కేవీఆర్‌ను సురక్షితంగా ఇంటికి పంపించాలని ఆమె వేడుకున్నారు.