మంచిర్యాల, జూన్ 1 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : ధాన్యం కొనుగోలు చేయాల్సింది కేంద్రమేనని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తెలిపారు. ‘నిన్నమొన్న బీజేపీ మిత్రులు బస్సు యాత్ర చేయడం సంతోషం.. కానీ ఇప్పటికే మనం 62 లక్షల టన్నుల ధాన్యం సేకరించినం. ఇంకో పది, పదిహేను లక్షల టన్నుల ధాన్యం సేకరించాల్సి ఉన్నది. ఈ సీజన్లో 75 లక్షల టన్నుల వడ్లు సేకరించే ఆలోచనలో ఉన్నం. మరి కేంద్రం ఈ 75 లక్షల టన్నుల వడ్లను కొనేందుకు సిద్ధంగా ఉన్నదా?’ అని ప్రశ్నించారు. కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషిని ఎన్నిసార్లు కలిసినా పంజాబ్, హరియాణాకు ఇచ్చిన ప్రాధాన్యత తెలంగాణకు ఇవ్వడం లేదని వాపోయారు. ఆసిఫాబాద్ జిల్లా కెరమెరి మండలం కొఠారి గ్రామ పంచాయతీ కొత్తగూడలో సోమవారం లక్ష ఇందిరమ్మ ఇండ్ల సామూహిక గృహ ప్రవేశ కార్యక్రమాన్ని ప్రారంభించారు.
కాగజ్‌నగర్ ఎక్స్‌రోడ్‌లో నిర్వహించిన బహిరంగ సభలో సీఎం మాట్లాడారు. ఈ నెల 15లోపు వడ్ల సేకరణ పూర్తవుతుందని, ధాన్యం, మక్కజొన్న, జొన్న, పొద్దుతిరుగుడు పంటలను రాష్ట్ర ప్రభుత్వం సేకరిస్తుందని, కానీ మద్దతు ధర ప్రకటించిన ఈ పంటలన్నింటినీ కేంద్రమే కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. ‘ఈ బాధ్యత కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి తీసుకోకపోతే జూన్ 15 తర్వాత మీ పార్టీ ఆఫీస్ ముందు, ఇండ్ల ముందు పంట కుప్పలు పోసి కేంద్ర ప్రభుత్వంపై యుద్ధం ప్రకటిస్తాం. మీరు పంటలు ఎందుకు కొనరో మీ సంగతి తేలుస్తానని హెచ్చరించారు.
మహారాష్ట్ర సీఎం సమయమిస్తలేరు
తమ్మిడిహట్టి బరాజ్ నిర్మాణానికి మహారాష్ట్రను కేంద్రమే ఒప్పించాలని ముఖ్యమంత్రి బీజేపీపైకి నెపం నెట్టేశారు. గత ప్రభుత్వం కావాలనే ఈ ప్రాజెక్ట్‌ను పడావు పెట్టిందని అసత్య ప్రచారం చేసి, తాము కచ్చితంగా తమ్మిడిహట్టి బరాజ్ నిర్మించి గ్రావిటీతో ఎల్లంపల్లి ప్రాజెక్ట్‌కు నీళ్లు తరలిస్తామని గొప్పలు చెప్పుకొని, చివరికి ఈ విషయంలో ప్రధాని మోదీ, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి చొరవ తీసుకోవాలంటూ నెపం కేంద్రంపైకి నెట్టేశారు. ఈ సమస్యపై చర్చించడానికి దాదాపు ఏడాది నుంచి ప్రయత్నిస్తున్నా మహారాష్ట్ర సీఎం స్పందించడం లేదు’ అని వాపోయారు. ‘ఆనాడు పోలవరం ప్రాజెక్టు కోసం ఆంధ్రప్రదేశ్‌కు ఖమ్మం జిల్లాలోని ఏడు మండలాలు, లక్షలాది మంది తెలంగాణ బిడ్డలను అప్పగించిన ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, తెలంగాణలో తమ్మిడిహట్టి బరాజ్ కోసం మహారాష్ట్రలోని రెండువేల ఎకరాల భూమి ఇప్పించలేరా? తెలంగాణ ముఖ్యమంత్రి అంటే ఇంత చిన్నచూపు ఎందుకో చెప్పాలి’ అని ప్రశ్నించారు. ఏడాది తిరిగే లోపు ఆదిలాబాద్ గూడేల్లో గుడిసెలు కనిపించకూడదని.. ఈ మేరకు ప్రత్యేక కార్యాచరణతో ముందుకు వెళ్తామని చెప్పారు.
ఇక్కడ నీళ్లే లేవు : ఆత్రం సుశీల
కార్యక్రమంలో గ్రామానికి చెందిన ఆత్రం సుశీల మాట్లాడుతూ ‘మా ఊరి అంగన్వాడీ స్కూల్లో టీచర్, ఆయమ్మ లేరు. తాగునీళ్లు కూడా రావడం లేదు. అంగన్వాడీ టీచర్ బీసీలకు ఇస్తామంటున్నారు. ఇక్కడ కొలాం వర్గానికి ఇవ్వాలి’ అని విజ్ఞప్తి చేశారు. తాగునీళ్లు లేని గ్రామంలో ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చారంటూ మహిళ మాట్లాడిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టింది.
బీఆర్ఎస్ నాయకుల ముందస్తు అరెస్ట్
ఆసిఫాబాద్, మంచిర్యాల జిల్లాల్లో సీఎం రేవంత్‌రెడ్డి పర్యటన సందర్భంగా బీఆర్ఎస్ నాయకులు, కార్మిక సంఘం నాయకులు, పోడు రైతులను పోలీసులు ముందస్తుగా అదుపులోకి తీసుకున్నారు. జిల్లాల్లో సోమవారం సాయంత్రం సీఎం టూర్ ఉండగా ఉదయం నుంచే బీఆర్ఎస్ నాయకులను అరెస్టు చేసి స్టేషన్లకు తరలించారు.
సీఎం సాక్షిగా ఆదివాసీ ఎమ్మెల్యేకు అవమానం
సీఎం సభలో స్థానిక ఆదివాసీ ఎమ్మెల్యే కోవలక్ష్మిని తీవ్రంగా అవమానించారు. ఆమెకు కార్యక్రమంలో అసలు మాట్లాడే అవకాశమే ఇవ్వలేదు. స్థానిక ఎమ్మెల్యేను కాదని మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్‌సాగర్‌రావు సభాధ్యక్షత వహించారు. మంత్రులు మాట్లాడిన తర్వాతైనా ఎమ్మెల్యేకు అవకాశం ఇస్తారనుకుంటే నేరుగా మాట్లాడారు. దీంతో అవమానాన్ని తట్టుకోలేక ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవలక్ష్మి సీఎం మాట్లాడుతుండగానే వెళ్లిపోయారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ ‘ప్రభుత్వ కార్యక్రమంలో సాక్షాత్తు ముఖ్యమంత్రి పాల్గొన్న సభలో ప్రొటోకాల్ పాటించకుండా, ఆదివాసీ ఎమ్మెల్యేనైన నన్ను అవమానించారు’ అని ఆవేదన వ్యక్తం చేశారు. నియోజకవర్గ సమస్యలు చెప్పుకొందామంటే మాట్లాడే అవకాశమే ఇవ్వలేదని, తాను అధ్యక్షత వహించాల్సిన కార్యక్రమంలో వేరే ఎమ్మెల్యేతో మాట్లాడించి ప్రభుత్వ కార్యక్రమాన్ని, పార్టీ ప్రోగ్రామ్‌గా మార్చారని మండిపడ్డారు. కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు స్థానిక ఎమ్మెల్యేలు ఏ పార్టీ వారైనా గౌరవించేవారని, ఇప్పుడా పరిస్థితి లేదని ఆవేదన వ్యక్తంచేశారు.