రంగారెడ్డి, అక్టోబర్ 11 (నమస్తే తెలంగాణ): ఎవరితోనైనా పెట్టుకోవచ్చు కానీ, టీచర్లతో పెట్టుకోవద్దని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి వ్యాఖ్యానించారు. టీచర్లతో పెట్టుకుంటే పోలింగ్ రోజు పోలింగ్ బూత్‌ల్లో చేయాల్సింది చేస్తారని పేర్కొన్నారు. శుక్రవారం ఆయన రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్ నియోజకవర్గం కొందుర్గులో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్‌కు శంకుస్థాపన చేశారు. కార్యక్రమంలో ఆయనతోపాటు శాసనమండలి చీఫ్ విప్ మహేందర్‌రెడ్డి, ఎమ్మెల్యేలు వీర్లపల్లి శంకర్, రామ్మోహన్‌రెడ్డి, యాదయ్య పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ.. ప్రపంచాన్ని ఏలే శక్తిసామర్థ్యాలు, తెలివితేటలు తెలంగాణ విద్యార్థులకు ఉన్నాయని చెప్పారు. కాంగ్రెస్ ప్రజాపాలనలో ప్రతి విద్యార్థికి నాణ్యమైన విద్యను అందించాలనే లక్ష్యంతో పనిచేస్తున్నామని తెలిపారు. విద్యా శాఖను తనవద్దనే ఉంచుకుని అధికారుల సలహాలతో విద్యాశాఖను ప్రక్షాళన చేస్తున్నామని వెల్లడించారు. తాజాగా 11 వేల మంది టీచర్లకు నియామక పత్రాలు అందజేసి తమ ప్రభుత్వం చిత్తశుద్ధిని చాటుకున్నదని పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నో ఏండ్లుగా పెండింగ్‌లో ఉన్న బదిలీలు, పదోన్నతులను సాకారం చేసిందని వివరించారు. రాష్ట్రంలో 34 వేల మంది టీచర్లకు బదిలీలు, 21 వేల మంది టీచర్లకు ప్రమోషన్లు ఇచ్చి వారికి ప్రభుత్వం పట్ల విశ్వాసం కల్పించామని పేర్కొన్నారు.
కేసీఆర్ పాలనపై తిట్ల పురాణం
సీఎం రేవంత్‌రెడ్డి ఎప్పటిలాగే కేసీఆర్ పాలనపై తిట్ల పురాణం అందుకున్నారు. తన 15 నిమిషాల ప్రసంగంలో 10 నిమిషాలు బీఆర్ఎస్ పాలనపై విమర్శలకే కేటాయించారు. గత ప్రభుత్వం పేదలకు విద్యనందించేందుకు, మౌలిక వసతులు కల్పించేందుకు చర్యలు చేపట్టలేదని, కానీ, తాము చేస్తుంటే తప్పుపడుతున్నారని విమర్శించారు. ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ అంటే తనకు గౌరవం ఉన్నదని, ఆయన ఏ పార్టీలో ఉన్నా తనకు అభ్యంతరం లేదని, అయితే యంగ్ ఇండియా రెసిడెన్షియల్ సూళ్లను ఎందుకు తప్పుపడుతున్నారని ప్రశ్నించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీలు గొర్రెలు, బర్రెలు కాసుకుని బతకాలా? అని ప్రశ్నించారు. రాష్ట్రంలో ఐదువేల ప్రభుత్వ పాఠశాలలను మూసివేసి గత ప్రభుత్వం పేదలకు విద్యను దూరం చేసిందని ఆరోపించారు. ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతుల కోసం కేసీఆర్ రూ.10వేల కోట్లు కూడా ఖర్చు చేయలేదని విమర్శించారు.
ఒక్క హామీ ఇవ్వలె
ముఖ్యమంత్రి రాకతో గంపెడు ఆశలు పెట్టుకున్న షాద్‌నగర్ నియోజకవర్గ ప్రజలు తీవ్ర నిరాశకు గురయ్యారు. స్థానిక ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ నియోజకవర్గంలోని పలు సమస్యలను ప్రస్తావించి సీఎం హామీ ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. అయితే, సీఎం రేవంత్‌రెడ్డి నుంచి ఒక్క సమస్య పరిష్కారానికీ, ఒక్క అభివృద్ధి పనికి కూడా హామీ లభించలేదు. దీంతో స్థానిక ప్రజలు తీవ్ర అసంతృప్తి వ్యక్తంచేశారు. సీఎం పర్యటన నేపథ్యంలో బీఆర్ఎస్ నాయకులను, ఎమ్మార్పీఎస్ నాయకులను పోలీసులు ముందస్తుగా అరెస్టు చేశారు.
పీవీ దార్శనికతతోనే..
మాజీ ప్రధాని పీవీ నరసింహారావు దార్శనికతతో, ముందుచూపుతో 1972లోనే రెసిడెన్షియల్ స్కూళ్ల ఏర్పాటుకు శ్రీకారం చుట్టారని సీఎం రేవంత్‌రెడ్డి చెప్పారు. పేదలకు విద్యను చేరువ చేసేందుకు యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్లను ఏర్పాటుచేస్తున్నామని చెప్పారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు వేరుగా విద్యాలయాలు ఉంటే వారి మనసుల్లో విషం నిండుతుందని, అందుకే కుల, మతాలకు అతీతంగా కలిసి ఉండాలనే ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్లు ఏర్పాటుచేస్తున్నామని చెప్పారు. 25 ఎకరాల్లో రూ.125 కోట్ల నుంచి రూ.150 కోట్లు వెచ్చించి సమీకృత గురుకులాలను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు.