హైదరాబాద్, డిసెంబర్ 11 (నమస్తే తెలంగాణ): ఈ నెల 20లోగా పోలీసు శాఖలో బదిలీలు ఉండవచ్చని తెలుస్తున్నది. ఈ నెల 20 తరువాత హోంశాఖపై సీఎం రేవంత్‌రెడ్డి ఉన్నతస్థాయి సమీక్ష చేపట్టనున్నట్టు తెలిసింది. డీజీపీ ఆఫీసులోనే ఆయా విభాగాల ఏడీజీలు, ఉన్నతాధికారులతో సమావేశమవుతారు. గురువారం నుంచి పునఃప్రారంభమయ్యే అసెంబ్లీ సమావేశాలు ముగిసిన తరువాత పోలీసు శాఖపై సమీక్ష ఉంటుందని చెప్తున్నారు. ఆయా విభాగాల పనితీరు, అధికారుల పనితనంపై డీజీపీ రవిగుప్తా, ఇంటెలిజెన్స్ ఏడీజీ శివధర్‌రెడ్డిని సీఎం స్పష్టమైన నివేదిక కోరినట్టు సమాచారం.
హోంశాఖను తన వద్దనే పెట్టుకున్న సీఎం.. కీలకమైన పోస్టుల ప్రక్షాళణ దిశగా అడుగులు వేస్తారన్న చర్చ మొదలైంది. ఈ నెల 20లోపే ఉన్నతాధికారుల బదిలీలు ఉంటాయని పోలీసులు భావిస్తున్నారు. అగ్నిమాపక విభాగాన్ని సైతం మరింత పటిష్ఠంగాగా తీర్చిదిద్దేందుకు సీఎం పూర్తిస్థాయిలో సమీక్ష చేపట్టనున్నట్టు తెలిసింది. హోంశాఖపై సమీక్షలో ఎలాం టి నిర్ణయాలు తీసుకుంటారు? ఎంతమంది అధికారులకు స్థానచలనం కల్పిస్తారు? శాంతిభద్రతలపై ఎలాంటి ఆదేశాలు ఇస్తారనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొన్నది.