హైదరాబాద్, జూన్24 (నమస్తే తెలంగాణ): సొంత నియోజకవర్గమైన కొడంగల్ కోసం యావత్తు పాలమూరు ఉమ్మడి జిల్లాకు సీఎం రేవంత్‌రెడ్డి ద్రోహం తలపెట్టారు. మక్తల్ నారాయణపేట కొడంగల్ లిఫ్ట్ స్కీమ్ (ఎంఎన్‌కేఎల్‌ఐఎస్) అనుమతుల కోసం కర్ణాటక ప్రాజెక్టులకు ఆమోదం తెలిపి ఏకంగా ఆర్డీఎస్కు ఉరివేశారు. కర్ణాటక ప్రాజెక్టుల పనులు ఏడాదికాలంగా కొనసాగుతున్నా, ఆర్డీఎస్ ఆయకట్టు రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నా.. రేవంత్ సర్కార్ మౌనం వహిస్తుండటంలో ఆంతర్యమిదేనని తెలుస్తున్నది. కర్ణాటకతో గుట్టుగా చేసుకొన్న ఒప్పందాలను ‘నమస్తే తెలంగాణ’ రట్టు చేయడంతో ఇప్పుడు ఆయన హడావుడి మొదలుపెట్టారు. ఏపీ ప్రతిపాదనలకు సైతం ఇప్పుడు మొగ్గుచూపితే మొత్తంగా ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాకు కృష్ణా జలాల్లో తీరని అన్యాయం వాటిల్లనున్నది. తన సొంత నియోజకవర్గం కోసం తొలుత రాజీవ్‌భీమా లిఫ్ట్ స్కీమ్‌కు కేటాయించిన 20 టీఎంసీల జలాలకు సీఎం రేవంత్‌రెడ్డి ఎసరు పెట్టారు. లిఫ్ట్ స్కీమ్ డ్యూటీని పెంచి 7.5 టీఎంసీలు ఆదా అవుతున్నాయని నమ్మబలికారు. ఆ జలాలను తన నియోజకవర్గమైన కొడంగల్ లిఫ్ట్ స్కీమ్‌కు కేటాయించుకున్నారు.
దీంతో భీమా ప్రాజెక్టు ఉనికినే ప్రశ్నార్థకం చేశారు. ఆ తర్వాత లిఫ్ట్స్కీమ్ అనుమతుల కోసం మరో ద్రోహానికి తెరతీశారు. లిఫ్ట్ స్కీమ్‌కు పర్యావరణ అనుమతుల కోసం కర్ణాటక రాష్ట్రం నుంచి నిరభ్యంతర పత్రం (ఎన్వోసీ)ని తీసుకోవాల్సి ఉన్నది. అందుకోసం 2025 మే 12న బెంగళూరులో కర్ణాటక జలవనరుల శాఖ అధికారులతో తెలంగాణ ప్రభుత్వం చర్చలు జరిపింది. ఈ సందర్భంగా కర్ణాటక ప్రభుత్వం షరతులు విధించింది. తుంగభద్రపై తాము చేపట్టిన చిక్కమంచాల, చిక్కాలపర్వి బరాజ్‌లపై కేంద్ర ప్రభుత్వం, సంబంధిత అధికారుల వద్ద ఎలాంటి అభ్యంతరాలు తెలుపవద్దని, వాటిని వ్యతిరేకించవద్దని, కనీసం ప్రతికూల వ్యాఖ్యలు కూడా చేయవద్దని షరతులు విధించింది. సదరు బరాజ్‌ల ద్వారా ఆర్డీఎస్ (రాజోలిబండ డైవర్షన్ స్కీమ్)కు తీరని ముప్పు ఏర్పడనున్నది. ఆర్డీఎస్తోపాటు, దిగువన తుమ్మిళ్ల ఆయకట్టు కూడా ప్రశ్నార్థకం కానున్నది. తెలంగాణకు అంతటి ముప్పు పొంచి ఉన్నా కూడా రేవంత్‌రెడ్డి ప్రభుత్వం కేవలం కొడంగల్ లిఫ్ట్ కోసం కర్ణాటక షరతులకు అంగీకారం తెలిపింది. ఆర్డీఎస్ ఆయకట్టుకు ఉరివేసింది. వెరసి ఆ చర్చ ల అనంతరమే కర్ణాటక ప్రభుత్వం 2025 జూలై 18న ఎన్వోసీని మంజూరు చేసింది.
రేవంత్ సర్కార్ దన్నుతో కర్ణాటక జోరు
రేవంత్‌రెడ్డి సర్కార్ ఇచ్చిన దన్నుతో కర్ణాటక ప్రభుత్వం తుంగభద్రపై ప్రాజెక్టుల నిర్మాణ పనుల జోరు పెంచింది. ఆర్డీఎస్ ఆనకట్టకు ఎగువన దాదాపు 100 మీటర్ల పరిధిలోనే కురిడి డ్రింకింగ్ లిఫ్ట్ పథకాన్ని దాదాపు రూ.85 కోట్లతో చేపట్టింది. ఆర్డీఎస్ బ్యాక్‌వాటర్ నుంచి 60 రోజులపాటు 2టీఎంసీల నీటిని ఎత్తిపోసి మాన్వి తాలూకాలోని కప్పగల్, కురిడి గ్రామాల్లో 2టీఎంసీల సామర్థ్యం కలిగిన రిజర్వాయర్లకు తరలించనున్నది. ఈ పనులను దాదాపు 60శాతం మేరకు పూర్తిచేసింది. ఆర్డీఎస్కు 15 కిలోమీటర్ల ఎగువన చిక్కాలపర్వి గ్రామం వద్ద రూ.397.50 కోట్లతో 2.50 టీఎంసీల నీటినిల్వ సామర్థ్యంతో రోడ్డు కమ్ బరాజ్ నిర్మాణానికి కర్ణాటక సిద్ధమైంది.
ఆర్డీఎస్ దిగువన రాయచూరు జిల్లా చికమంచాల గ్రామ సమీపంలో బ్రిడ్జి కమ్ బరాజ్‌ను 5 టీఎంసీల సామర్థ్యంతో చేపట్టాలని, మంత్రాలయానికి రోడ్డు మార్గాన్ని కూడా అనుసంధానించేందుకు సిద్ధమైంది. ఈ బరాజ్ బ్యాక్‌వాటర్ నుంచి జూకూరు రాంకట్ట డ్రింకింగ్ వాటర్ లిఫ్ట్ స్కీమ్‌ను చేపట్టేందుకు సన్నాహాలు చేస్తున్నది. ఇప్పటికే సాంకేతిక అనుమతులు సైతం తీసుకొన్నది. మొత్తంగా రెండు బరాజ్‌ల ద్వారా 7.50 టీఎంసీలు, కురిడి లిఫ్ట్ ద్వారా మరో 2 టీఎంసీలను వినియోగించుకొనేందుకు కర్ణాటక సర్కార్ జోరుగా పనులు చేపడుతున్నది. ఆ పనుల విషయంపై ఆర్డీఎస్ ఆయకట్టు రైతులు ఏడాదిగా ఆందోళన వ్యక్తంచేస్తున్నా, ప్రభుత్వ పెద్దలు, ఇంజినీర్ల దృష్టికి తీసుకొచ్చినా రేవంత్ సర్కార్ మౌనం వహిస్తూనే ఉన్నది. అందుకు ప్రధాన కారణం కర్ణాటకకు ముందస్తుగా ఆయా ప్రాజెక్టులపై ఆమోదం ఇవ్వడమేనని స్పష్టంగా తెలుస్తున్నది.
ఉమ్మడి పాలమూరుకు తీరని నష్టం
అంతర్రాష్ట్ర అంశాలను, ట్రిబ్యునల్-1 అవార్డులను పరిగణనలోకి తీసుకోకుండా కొడంగల్ కోసం కర్ణాటక ప్రాజెక్టులకు అనుమతిలిచ్చి ఏకంగా ఉమ్మడి పాలమూరు జిల్లాకు రేవంత్‌రెడ్డి ద్రోహం తలపెట్టారు. వాస్తవంగా కృష్ణా బేసిన్ ఇప్పటికే తీవ్ర నీటి లోటున్న బేసిన్, కృష్ణాకు తుంగభద్ర బేసిన్ నుంచే నిరంతరాయంగా నీరు రావాల్సి ఉన్నది. తుంగభద్రపై ప్రాజెక్టులు నిర్మిస్తే ఆ బేసిన్ నుంచి కృష్ణాకు నీటి రాక తగ్గిపోతుంది. ఫలితంగా దిగువనున్న తెలంగాణ ప్రాజెక్టులపై తీవ్ర ప్రభావం పడుతుంది. ఈ నేపథ్యంలోనే తుంగభద్ర సబ్‌బేసిన్‌లో ప్రాజెక్టుల నిర్మాణంపై ట్రిబ్యునల్ అనేక పరిమితులు విధించింది. ట్రిబ్యునల్-1 కర్ణాటకకు గంపగుత్తగా నీటిని కేటాయించినా అందులోనూ పరిమితులు విధించింది.
తుంగభద్ర సబ్‌బేసిన్‌లో ఎక్కడెక్కడ? ఎంత మొత్తంలో? నీటిని వినియోగించుకోవాలనే అంశాలపై చాలా స్పష్టంగా నిర్దేశించింది. తుంగభద్ర సబ్‌బేసిన్‌లో మొత్తం నీటి లభ్యతపై అధ్యయనం చేసి అంచనా వేసిన తర్వాతే నీటిని కేటాయించాలని నిర్దేశించింది. అయినా ఇప్పటికే కర్ణాటక ఇబ్బడిముబ్బడిగా ప్రాజెక్టులను, బరాజ్‌లను చేపడుతూ వస్తున్నది. నిర్దంద్వంగా వ్యతిరేకించాల్సిన రేవంత్‌రెడ్డి సర్కార్.. అందుకు భిన్నంగా కర్ణాటక ప్రాజెక్టులకు ఆమోదం తెలుపడం గమనార్హం. ఆ రాష్ట్ర ప్రాజెక్టులు పూర్తయితే భవిష్యత్తులో ఆర్డీఎస్, తుమ్మిళ్లకే కాదు, శ్రీశైలం ప్రాజెక్టులకు వరద ప్రవాహాలు పూర్తిగా తగ్గిపోయి దానిపై ఆధారపడిన కల్వకుర్తి, పాలమూరు-రంగారెడ్డి లిఫ్ట్‌లకు నీటికొరత తప్పదు. ఫలితంగా ఉమ్మడి పాలమూరు జిల్లాకు సాగు, తాగునీరు ప్రశ్నార్థకం కానున్నది. కేవలం కొడంగల్ లిఫ్ట్ కోసం యావత్తు పాలమూరు భవిష్యత్తుకు రేవంత్‌రెడ్డి సర్కార్ ఉరి పేనుతున్నది.
ఏపీ, కర్ణాటక మిలాఖత్!
తుంగభద్ర నదీ జలాలను చెరబట్టేందుకు ఏపీ, కర్ణాటక రాష్ర్టాలు మిలాఖతై ముందుకు సాగుతున్నాయి. రేవంత్‌రెడ్డి సర్కార్ అందుకు వంతపాడుతున్నది. కర్ణాటక ప్రభుత్వం తుంగభద్ర డ్యామ్ పూడికను సాకుగా చూపి ఇప్పటికే నావలి రిజర్వాయర్ విస్తరణకు పూనుకొన్నది. తుంగభద్ర లోలెవల్ కెనాల్ (ఎల్ఎల్సీ)కు సమాంతరంగా మరో కాల్వను తవ్వేందుకు కర్ణాటక సర్కార్ సిద్ధమైంది. కొప్పల్ జిల్లా గంగావతి తాలుకాలో ఇప్పటికే 31 టీఎంసీల సామర్థ్యంతో నిర్మించిన నావలి రిజర్వాయర్‌ను 52 టీఎంసీలకు విస్తరించి తుంగభద్ర డ్యామ్‌కు బ్యాలెన్సింగ్ రిజర్వాయర్‌గా వినియోగించుకొనేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేయడమే కాదు.. ఆ దిశగా ప్రస్తుతం వేగంగా అడుగులు వేస్తున్నది. తుంగభద్ర డ్యామ్ హైలెవల్ కెనాల్ సమాంతరంగా మరో కాలువను తవ్వి వరద జలాలను తరలించి అనంతపురం ఉమ్మడి జిల్లాలకు అందించేందుకు ఏపీ సర్కార్ ప్రణాళికలు రూపొందించింది. ఆ ప్రణాళికల అమలుకు శరవేగంగా అడుగులు వేస్తున్నది. ఈ ప్రణాళికలకు కర్ణాటక, ఏపీ రాష్ర్టాలు పరస్పరం సహకరించుకొంటున్నాయి. అంతేకాదు ఏపీ అభ్యంతరాలను సాకుగా చూపుతూ ఆర్డీఎస్ ఆధునికీకరణను కర్ణాటక చేపట్టడం లేదు. మరోవైపు ఏపీతో కలిసి మరిన్ని బరాజ్‌ల నిర్మాణానికి అడుగులు వేస్తున్నది.
‘నమస్తే’ కథనం సంచలనం.. రేవంత్ సర్కార్ ఆగమాగం
కర్ణాటకతో జరిగిన చర్చల అంశాన్ని రేవంత్‌రెడ్డి సర్కార్ ఇప్పటివరకు బయటకు పొక్కనీయలేదు. షరతుల విషయాన్ని ఎక్కడా బయటపెట్టలేదు. అంతా గోప్యంగానే దాచిపెట్టి వ్యవహారాన్ని కొనసాగిస్తూ వచ్చింది. ఈ నేపథ్యంలోనే ఆర్డీఎస్ ఎగువన, దిగువన కర్ణాటక చేపడుతున్న ప్రాజెక్టులపై ఆయకట్టు రైతులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నా, ఆందోళనకు దిగుతున్నా కూడా సర్కార్ మాత్రం పూర్తిగా మౌనం దాల్చింది. కేంద్రానికి ఫిర్యాదులు చేసిందిలేదు. రివర్‌బోర్డు మీటింగుల్లో, తుంగభద్ర బోర్డు మీటింగ్‌లోనూ ప్రస్తావించింది, ప్రశ్నించిందీ లేదు. కనీసం అటు వైపు కూడా కన్నెత్తి చూడటమే లేదు. అందులో సర్కార్ ఆంతర్యమేమిటని శోధించి ఎట్టకేలకు కర్ణాటక సర్కార్ జారీచేసిన ఎన్వోసీని ‘నమస్తే తెలంగాణ’ వెలికి తీసింది. ఎన్వోసీలోని షరతులను, రేవంత్‌రెడ్డి సర్కార్ ఆర్డీఎస్తోపాటు, యావత్తు పాలమూరుకు తలపెట్టిన ద్రోహాన్ని బట్టబయలు చేసింది. ‘ఆర్డీఎస్కు ఎసరు’ పేరిట ప్రచురితమైన ప్రత్యేక కథనం ఇప్పుడు సంచలనం రేపుతున్నది. ఉమ్మడి పాలమూరులో చర్చనీయాంశంగా మారింది. ఇంతకాలం తొక్కిన పెట్టిన వాస్తవాలు వెలుగులోకి రావడంతో రేవంత్ ప్రభుత్వం ఆగమాగమవుతున్నది. మింగలేక, కక్కలేక కిక్కురుమనని పరిస్థితి నెలకొన్నది. ఉన్నపళంగా సీఎం రేవంత్‌రెడ్డినే ప్రత్యేక సమీక్ష నిర్వహించడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
