హైదరాబాద్: పోలీసు సిబ్బంది పట్ల తనకు ప్రత్యేక అభిమానం ఉన్నదని సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) అన్నారు. పోలీసులు, వారి కుటుంబ సభ్యులు ఆత్మగౌరవంతో జీవించాలని చెప్పారు. ఎవరిముందు చేయిచాచే పరిస్థితి తెచ్చుకోవద్దని, విమర్శలకు అవకాశం ఇవ్వొద్దని కోరారు. విధి నిర్వహణలో పోలీసులు ఎలాంటి లోటు లేకుండా చర్యలు తీసుకుంటామన్నారు. పోలీసు సంస్మరణ దినోత్సవం సందర్భంగా హైదరాబాద్ గోషామహల్ స్టేడియంలో నిర్వహించిన ఫ్లాగ్‌డే పరేడ్‌లో సీఎం రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా పొల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. పోలీసుల ఖర్చులు, ఇతర ఏర్పాట్లకు నిధులు కేటాయిస్తామన్నారు. ఖద్దరును, ఖాకీని ఈ సమాజం నిశితంగా గమనిస్తుందని గుర్తించాలన్నారు. విధి నిర్వహణలో అమరులైన పోలీసులకు ఘనంగా నివాళులు అర్పిస్తున్నాని చెప్పారు.
‘దేశ భద్రత, ప్రజల రక్షణలో పోలీసుల పాత్ర ఎనలేదనిది. రాష్ట్రంలో శాంతిభద్రతలు సజావుగా ఉన్నాయంటే పోలీసులే కారణం. ఏ రాష్ట్రమైనా అభివృద్ధి చెందేందుకు శాంతిభ్రతలే కీలకం. పెట్టుబడులు రావాలంటే శాంతిభద్రతలు అదుపులో ఉండాలి. శాంతి భద్రతలు, నిఘా విషయంలో రాష్ట్ర పోలీసుల పాత్ర కీలకం. అమరులైన పోలీసులకు కుటుంబాలకు ప్రభుత్వం ఎప్పుడూ అండగా ఉంటుంది. పెరుగుతున్న ఆధునిక సాంకేతికత ద్వారా నేరాలు చేస్తున్నారు. నేరగాళ్లు సరికొత్త విధానాలతో ముందుకొస్తున్నారు. తెలంగాణ పోలీసుల విధానాలను ఇతర రాష్ట్రాలు పాటిస్తున్నాయి. మన ఫోరెన్సిక్ ల్యాబ్ అనే రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తున్నది. మన సైబర్‌క్రైమ్ విభాగం దేశంలోనే గొప్పదని కేంద్ర హోంశాఖ అభినందించింది.
ఇవాళ డ్రగ్స్ మహమ్మారి యువతను పట్టిపీడిస్తున్నదని. డ్రగ్స్ వల్ల పంజాబ్ అనేక కష్టాలు ఎదుర్కొంటున్నది. మన రాష్ట్రంలో డ్రగ్స్ ఉత్పత్తి చాలా తక్కువ. డ్రగ్స్ వినియోగం మాత్రం ఇక్కడ క్రమంగా పెరుగుతున్నది. డ్రగ్స్ నివారణకు సరికొత్త చర్యలు తీసుకుంటున్నాం. ఏఐ పరిజ్ఞానం ద్వారా ట్రాఫిక్ నియమాలు ఉల్లంఘించేవారిని గుర్తిస్తున్నాం. నేరగాళ్లను కఠినంగా శిక్షించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉంది. శాంతిభద్రతలను చేతుల్లోకి తీసుకోవద్దని ప్రజలను కోరుతున్నాం. పోలీసుల సహకారంతో అన్ని పండుగలను ఘనంగా జరుపుకుంటున్నాం. శాంతి భద్రతల రక్షణలో పోలీసుల త్యాగాలు సమాజం గుర్తుంచుకుంటుంది. ఫ్రెండ్లీ పోలీసింగ్ అంటే బాధితులకు అన్ని విధాలుగా అండగా ఉండటం. పోలీసులు నేరగాళ్లపై కఠినంగా ఉండాలి, ఉక్కుపాదం మోపాలి. ఒక్క శాతం తప్పు జరుగకుండా పోలీసులు వ్యవహరించాలి. పోలీసుల సమస్యలను పరిష్కరించే బాధ్యత మేం తీసుకుంటాం. పోలీసుల పిల్లలకు చదువులు చెప్పించే బాధ్యత తమదని’ చెప్పారు.
అమరులైన కానిస్టేబుల్, ఏఎస్ఐ కుటుంబాలకు రూ.కోటి పరిహారం చెలిస్తామని సీఎం చెప్పారు. ఎస్ఐ, సీఐ కుటుంబాలకు రూ.కోటీ 25 లక్షలు, డీఎస్పీ, ఏఎస్పీ కుటుంబాలకు రూ.కోటీ 50 లక్షలు, ఎస్పీ, ఐపీఎస్ కుటుంబాలకు రూ.2 కోట్లు పరిహారం ఇస్తామని వెల్లడించారు. శాశ్వత అంగవైకల్యం పొందిన పోలీసులకు పరిహారం చెల్లిస్తామన్నారు.
Hon’ble Chief Minister Sri.A.Revanth Reddy participates in Police Flag Day Parade at Police Martyrs Memorial, Goshamahal, Hyderabad https://t.co/96feRlkpZQ
— Telangana CMO (@TelanganaCMO) October 21, 2024