హైదరాబాద్/సంగారెడ్డి, జూలై 1(నమస్తే తెలంగాణ) : సంగారెడ్డి జిల్లా పాశమైలారంలోని సిగాచి పరిశ్రమ ప్రమాదంలో బాధితులకు సీఎం రేవంత్‌రెడ్డి ప్రకటించిన పరిహారం ‘అశ్వథ్థామ హతః.. కుంజరహాః’ అన్నట్టుగా తయారైంది. మృతుల కుటుంబాలకు కోటి, తీవ్రంగా గాయపడిన వారికి రూ.10 లక్షలు, స్వల్పంగా గాయపడిన వారికి రూ. 5 లక్షలు చొప్పున పరిహారం అందజేస్తామని సీఎం ఘనంగా ప్రకటించారు. ఆ మొత్తాన్ని కంపెనీ నుంచి వసూలు చేసి ఇస్తామని చిన్నగా మెలిక పెట్టారు. ప్రమాద స్థలాన్ని సీఎం రేవంత్ మంగళవారం మంత్రులు శ్రీధర్‌బాబు, పొం గులేటి, దామోదర, వివేక్‌తో కలిసి సందర్శించారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆధ్వర్యం లో సమగ్ర విచారణ చేపడతామని, కమిటీ నివేదిక అనంతరం బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని ప్రకటించారు.
తక్షణ సహా యం కింద మృతుల కుటుంబాలకు ప్రభు త్వం తరఫున రూ. లక్ష చొప్పున ఇస్తామని చెప్పారు. కంపెనీ నుంచి పరిహారం ఇప్పించే బాధ్యతను మంత్రులు వివేక్, దామోదర, అధికారులకు అప్పగించారు. సీఎం రేవంత్ ప్రకటనపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పరిహారం చెల్లించే విషయంలో ప్రభుత్వం చేతులెత్తేసిందని ఆరోపిస్తున్నారు. అంతేకాదు ప్రకటించిన రూ.కోటిలో పరిశ్రమ వాటా ఎంత? ప్రభుత్వ వాటా ఎంత? అని మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా సీఎం అసహనం వ్యక్తం చేశారు. ‘కోటి పరిహారం ఇస్తామని చెప్పాం కదా, అందులో ప్రభుత్వ శాతం, కంపెనీ శాతం ఎంతయితే ఏంటి? ఎవరి శాతం ఎంతన్నదానితో పని ఏముంది? ’ అంటూ రుసరుసలాడారు. కేంద్రం మృతుల కుటుంబానికి రూ.2 లక్షల చొప్పున పరిహారం ప్రకటించగా, రాష్ట్ర ప్రభుత్వం రూ.లక్ష మాత్రమే ఇస్తామనడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
ప్రమాదంలో మరణించిన బాధితుల వివరాలు ఇప్పటివరకు ఇటు కంపెనీ యాజమాన్యం దగ్గరగానీ, అటు కార్మిక శాఖ దగ్గరగానీ లభ్యం కాలేదు. దీంతో మృతుల సంఖ్య పై స్పష్టత రావడం లేదు. సీఎం పర్యటన నేపథ్యంలో కంపెనీ యాజమాన్యం ఉజ్జాయింపు గా చెప్పిన లెక్కలనే అధికారులు రేవంత్ రెడ్డికి వివరించగా, వాటినే సీఎం ప్రకటించారని గుసగుసలు వినిపిస్తున్నాయి. ప్రమాద సమయంలో 143 మంది పరిశ్రమలో ఉన్నారని, వారిలో 58 మందిని మాత్రమే అధికారులు గుర్తించారని సీఎం చెప్పారు. వాస్తవానికి టెక్నికల్ ఉద్యోగులు, స్కిల్డ్ ఎంప్లాయిస్ పేర్లు మాత్రమే కంపెనీ రికార్డుల్లో నమోదు చేసినట్టు తెలుస్తున్నది. వీళ్లు కాకుండా దాదాపు 100 నుంచి 110 మంది వరకు అన్‌స్కిల్డ్/రోజువారీ కార్మికులు పని చేస్తున్నారని ప్రాణాలతో బయటపడిన ప్రత్యక్ష సాక్షులు ఇచ్చిన వాంగ్మూలాన్ని బట్టి తెలుస్తున్నది.
వీరి వివరాలను ఇప్పటివరకు కంపెనీ యాజమాన్యం కానీ, రాష్ట్ర కార్మిక శాఖగానీ గుర్తించలేకపోయింది. పేలుడు ధాటికి కార్మికుల శరీర అవయవాలు 100 మీటర్ల దూరం వరకు ఎగిరిపడ్డట్టు ప్రత్యక్ష సాక్షులు చెప్తున్నారు. ఎయిర్ బ్లోయర్, రియాక్టర్‌కు అతి సమీపంలో పనిచేస్తున్న 25 మంది కార్మికుల ఆనవాళ్లు కూడా మిగలలేదని పేర్కొంటున్నారు. మరో 20 నుంచి 25 మంది కార్మికుల మృతదేహాలు 80% నుంచి 100% వరకు కాలిపోయిన స్థితి లో ఉన్నాయన్నారు. ఇటువంటివారి గుర్తింపు, పరిహారంపై సీఎం రేవంత్‌రెడ్డి కనీసం ప్రకటన చేయకపోవడంపై బాధితుల కుటుంబాల నుంచి వ్యతిరేకత వ్యక్తం అవుతున్నది.
సిగాచి కంపెనీ సెక్యూరిటీ ప్రొటోకాల్ అమలు చేయలేదని ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్, ఇన్స్పెక్టర్ ఆఫ్ బాయిలర్స్ అధికారులు చెప్తున్నారు. కార్మిక శాఖ ప్రాథమిక నివేదిక ప్రకా రం.. అనుమతి లేకుండా కార్మికులను డంప్ చేసి పరిశ్రమ నడిపిస్తున్నట్టు సమాచారం. ఇప్పటి వరకు కంపెనీ మీద ప్రభుత్వపరంగా ఎలాంటి ఫిర్యాదు చేయకపోవడం, కేసు నమోదు చేయకపోవడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పరిశ్రమలశాఖ అధికారులు, బాయిలర్స్ డైరెక్టర్స్ తనిఖీలు చేశారా? బాయిలర్లను తనిఖీ చేసి ఏమైనా సమస్యలు గుర్తించారా? వాటి పనితీరుపై యాజమాన్యానికి ఏమైనా సూచనలు చేశారా? అని రేవంత్‌రెడ్డి ప్రశ్నించినప్పుడు అటు ప్రభుత్వ అధికారులు, ఇటు కంపెనీ యాజమాన్యం పొంతన లేని సమాధానం ఇచ్చినట్టు ప్రత్యక్ష సాక్షులు చెప్తున్నారు. ప్రమాద ఘటనపై దర్యాప్తు చేసి నివేదిక సమర్పించాలని సీఎం అధికారులను ఆదేశించారు. కానీ కంపెనీ యాజమాన్యంపై తక్షణ చర్యలకు ఆదేశించకపోవడంపై కార్మిక సంఘాలు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నాయి. సీఎం రేవంత్‌రెడ్డి పర్యటన కంపెనీ ప్రతినిధులకు వత్తాసు పలకడానికే అన్నట్టుగా సాగిందని వారు ఆరోపిస్తున్నారు.
సిగాచి ఫార్మా కంపెనీ నుంచి మృతుల కుటుంబాలకు రూ.కోటి అందడం అసాధ్యమని ఇన్సూరెన్స్ అధికారులు చెప్తున్నారు. సిగాచి కంపెనీ అన్ని యూనిట్ల పెట్టుబడి కలిపినా రూ.43 కోట్లే అని, వార్షిక ఆదాయం రూ.300 కోట్ల మేర ఉందని ఇన్సూరెన్స్ అధికారులు చెప్తున్నారు. పర్మినెంట్ ఉద్యోగులకు మాత్రమే ఇన్సూరెన్స్ ఉన్నదని, అది కూడా రూ.కోటి ప్రీమియం కాదన్నారు. ప్రాణాలు కోల్పోయిన వారిలో అన్‌స్కిల్డ్ లేబర్ ఎక్కువ సంఖ్యలో ఉన్నారని, వీరికి ఇన్సూరెన్స్ కంపెనీ నుంచి ఎలాంటి పరిహారం అందదని స్పష్టం చేస్తున్నారు.
పాశమైలారం ప్రమాదంపై సీఎం రేవంత్ సమగ్ర విచారణకు ఆదేశించారు. మంగళవారం ఆయన సిగాచి ఫార్మాను సందర్శించిన అనంతరం కంపెనీ ఆవరణలో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ప్రమాదం జరిగిన తీరును కలెక్టర్ ప్రావీణ్య, ఎస్పీ పరితోష్ పంకజ్‌ను అడిగి తెలుసుకున్నారు. రసాయనిక పరిశ్రమల్లో ప్రమాదాలు జరగకుండా చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ.. ప్రమాదంలో 51 మంది మృతి చెందడం బాధాకరమని పేర్కొన్నారు. మృతుల కుటుంబాలకు ప్రభు త్వం అండగా ఉంటుందని చెప్పారు. ప్ర మాదంలో ఎవరి నిర్లక్ష్యం ఉన్నా , వారిపై చర్యలు తీసుకుంటామని తెలిపారు.