Congress Govt | ఖమ్మం, సెప్టెంబర్ 2 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) సూర్యాపేట, /మామిళ్లగూడెం, సెప్టెంబర్ 2: వరద బాధితులకు తక్షణ సహా యం కింద ప్రతి కుటుంబానికి రూ.10వేలు అందిస్తామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రకటించారు. వరదల్లో చనిపోయిన వారి కుటుంబానికి రూ.5 లక్షల చొప్పున, పశువులకు రూ.50 వేలు, గొర్రెలు, మేకలకు రూ.5వేలు, నష్టపోయిన పంటలకు ఎకరాకు రూ.10వేల చొప్పున పరిహారం అందజేస్తామని ప్రకటించారు. ఇండ్లు కోల్పోయిన వారికి ఇందిరమ్మ ఇండ్లు ఇస్తామని చెప్పారు. రెండు రోజుల్లో మున్సిపల్,రెవెన్యూ సిబ్బందితో సర్వే చేయిం చి, నష్టాన్ని అంచనావేసి పరిహారం అందిస్తామని పేర్కొన్నారు.సీఎం రేవంత్‌రెడ్డి తన మంత్రివర్గ సహచరులు భట్టి విక్రమార్క, తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డితోకలిసి సోమవారం సూర్యాపేట, ఖమ్మం జిల్లాల్లోని వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించారు. ఈ సందర్భంగా ఖమ్మం జిల్లా, మంచికంటినగర్‌లో బాధితులను ఉద్దేశించి సీఎం మాట్లాడుతూ మున్నేరు వరదలో చిక్కుకొని సర్వం కోల్పోయిన బాధితులను ప్రభుత్వం ఆదుకుంటుందని చెప్పారు.
సూర్యాపేటలో సమీక్ష
అంతకుముందు సీఎం మార్గమధ్యంలో సూర్యాపేట జిల్లా మోతె మండల కేంద్రంలో ఆగారు. స్థానిక ఫంక్షన్ హాల్లో మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, ఎమ్మెల్యేలతో కలిసి వరద పరిస్థితిపై సమీక్ష నిర్వహించారు.సాగర్ ఎడమ కాల్వ తెగడం వల్ల జరిగిన పంట నష్టంపై ఆరా తీశారు. అనంతరం మాట్లాడుతూ రాష్ట్రంలోనే సూర్యాపేట జిల్లాలో అత్యధికంగా 30 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైందని అన్నారు. తక్షణ సాయంగా కలెక్టర్‌కు రూ.5 కోట్లు మంజూరు చేస్తున్నట్టు తెలిపారు. ఈ రెండు జిల్లాల్లో సీఎం పర్యటనకు అడుగడుగునా నిరసన వ్యక్తమైంది.
మూడు రోజులుగా నిద్రలేదు!
రాష్ట్రంలో వర్షాలు,వరద పరిస్థితిపై మూడు రోజలుగా నిద్ర లేకుండా సమీక్ష చేస్తున్నానని సీఎం రేవంత్‌రెడ్డి చెప్పారు. రాష్ట్రంలో రూ. 5వేల కోట్లు నష్టం జరిగినట్లు ప్రాధమిక అంచనాకు వచ్చామని, కేంద్రం తక్షణం రూ.2 వేల కోట్లు విడుదల చేయాలని కోరుతున్నామని అన్నారు. వరద పరిస్థితిపై ప్రధాని మోదీ, కేంద్రమంత్రి అమిత్‌షాతోపాటు ప్రతిపక్ష నేత రాహుల్‌గాంధీకి వివరించి సాయం కోరానని తెలిపారు. సీఎంఆర్ఎఫ్కు విరాళాలు అందిస్తే ప్రజలకు మరిన్ని సౌకర్యాలు కల్పిస్తామని తెలిపారు. ప్రతిపక్షాలు కూడా ప్రభుత్వానికి సహకారం అందించాలని కోరారు.
పరిశీలనకు రావాలని ప్రధానికి వినతి
వరద నష్టాన్ని జాతీయ విపత్తుగా ప్రకటించాలని ప్రధాని నరేంద్రమోదీకి సీఎం రేవంత్‌రెడ్డి విజ్ఞప్తిచేశారు. వర్షాల వల్ల జరిగిన నష్టాన్ని పరిశీలించేందుకు రావాలని ప్రధానిని కోరు తూ లేఖ రాయాలని సీఎస్‌ను ఆదేశించారు. సోమవారం ఆయన హైదరాబాద్‌లోని కమాండ్ కంట్రోల్ సెంటర్లో ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ..కలెక్టరేట్లలో కంట్రోల్ రూంలు ఏర్పాటుచేసి 24 గంటలు పర్యవేక్షించాలని చెప్పారు. ప్రతి మూడు గంటలకో బులెటిన్ విడుదల చేయాలని సూచించారు.
పోలీసులకు ఎన్డీఆర్ఎఫ్ తరహా శిక్షణ
రాష్ట్రంలోని 8 బెటాలియన్లలో మూడో వంతు యువ పోలీసులకు ఎన్డీఆర్ఎఫ్ తరహాలో శిక్షణ ఇవ్వాలని సీఎం రేవంత్‌రెడ్డి డీజీపీని ఆదేశించారు. 25 పెద్ద టవర్లు కూలిపోయినా విద్యుత్తు సిబ్బంది వెంటనే కరెంట్ సరఫరాను పునరుద్ధరించారని అభినందించారు. కూలీలను గుర్తించి నిత్యావసర సరకులు పంపిణీ చేయాలని ఆదేశించారు.