హైదరాబాద్, జనవరి 25(నమస్తే తెలంగాణ) : ‘ఆడలేక మద్దెల ఓడు..’ సామెత కాంగ్రెస్ సర్కారు, రెవెన్యూశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డికి సరిగ్గా సరిపోతుందేమో. సర్కారు గొప్పగా తీసుకొచ్చిన భూభారతిలో వరుసగా అక్రమాలు బయటపడటం, భూభారతి డొల్లతనం తేటతెల్లం కావడంతో తప్పించుకునేందుకు మంత్రి పొంగులేటి నానా తంటాలు పడుతున్నారు. ఇందులో భాగంగానే ఆ తప్పును ధరణిపై నెట్టేందుకు కుట్రలు చేస్తున్నారు. భూభారతిని తీసుకొచ్చి ఏడాది పూర్తవుతున్నా.. ఇంకా ధరణిపైనే ఏడవడం ఏంటనే విమర్శలు వినిపిస్తున్నాయి. తప్పులు జరిగింది, అక్రమాలు వెలుగు చూసింది భూభారతిలో అయితే, ఆ తప్పిదాలన్నీ ధరణిలోని లోపాల వల్లే జరిగినట్టుగా ప్రచారం మొదలుపెట్టారు. తద్వారా భూభారతి అంతా బాగానే ఉందని ప్రజల్ని నమ్మించే ప్రయత్నం చేస్తున్నారు. ఈ అక్రమాలపై నియమించిన ఉన్నతస్థాయి కమిటీతో శనివారం భేటీ సందర్భంగా కమిటీ సభ్యులంతా భూభారతిలో అక్రమాలు జరిగాయని చెప్పినట్టు తెలిసింది. అయితే మంత్రి మాత్రం ధరణిలోనే అక్రమాలు జరిగినట్టు అధికారుల వివరాలను వక్రీకరిస్తూ పత్రికా ప్రకటనలు జారీ చేయడం గమనార్హం.
2024 డిసెంబర్ 20న ధరణి చట్టాన్ని రద్దు చేస్తూ తెలంగాణ భూభారతి(ఆర్వోఆర్)-2024 చట్టానికి అసెంబ్లీలో కాంగ్రెస్ సర్కారు ఆమోదం తెలిపింది. ఆ తర్వాత ఏప్రిల్ 14వ తేదీన భూభారతి విధి విధానాలను అమల్లోకి తీసుకొచ్చింది. ఈ సందర్భంగా రెవెన్యూశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ‘ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీ ప్రకారం ధరణిని బంగాళాఖాతంలో వేశాం. ధరణి స్థానంలో రైతులకు చుట్టంలాంటి భూభారతి చట్టాన్ని తీసుకొచ్చాం.’ అంటూ స్పష్టం చేశారు. అంటే మంత్రి మాటల ప్రకారం ధరణి బంగాళాఖాతంలో పడిపోయింది.
వాస్తవానికి రైతులు, ప్రజల భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలనే సదుద్దేశంతో ధరణి పోర్టల్‌కు నాటి సీఎం కేసీఆర్ రూపం పోశారు. అయితే ఇందులో పలు సాంకేతిక ఇబ్బందులతో సమస్యలు ఎదురయ్యాయి. ఆ తర్వాత చాలా వరకు ప్రభుత్వం పరిష్కరించింది. కానీ దీనిపై నాటి ప్రతిపక్ష కాంగ్రెస్ పనిగట్టుకొని విష ప్రచారం చేసింది. ధరణి పోర్టల్‌తో ఏదో జరిగిపోయినట్టు ప్రజల్ని భయబ్రాంతులకు గురి చేసింది. తాము తీసుకొచ్చే భూభారతితో సమస్యలన్నీ పరిష్కరిస్తామని నమ్మబలికింది. కానీ పరిస్థితి మాత్రం అందుకు పూర్తి భిన్నంగా ఉంది. భూభారతితో రైతులకు సమస్యలు రెట్టింపు అయ్యాయి. ఒక్క సమస్య కూడా పరిష్కారం కావడంలేదు. ఎక్కడి అప్లికేషన్లు అక్కడే పెండింగ్‌లో ఉంటున్నాయి. సాదాబైనామాల పరిస్థితి దారుణంగా ఉంది. 9 లక్షలకు పైగా దరఖాస్తులు రాగా ఇందులో కేవలం 10లోపే పరిష్కరించినట్టు తెలిసింది. ఇక నిషేదిత భూముల జాబితాను సవరిస్తున్నట్టు పేర్కొన్న ప్రభుత్వం.. సమారు కోటి ఎకరాలను ఆ జాబితాలో చేర్చినట్టు తెలిసింది. ఇందులో పట్టా భూములను కూడా ఉన్నట్టు రైతులు ఆరోపిస్తున్నారు. ఇక జిల్లాల్లో నిర్వహించిన భూభారతి సదస్సుల్లో సుమారు 8 లక్షల దరఖాస్తులు స్వీకరించగా అవన్నీ పెండింగ్‌లోనే ఉన్నాయి. దీనికి తోడు సమస్యల్ని పరిష్కరించే అధికారం భూభారతిలో క్షేత్రస్థాయి అధికారులకు కట్టబెట్టడంతో కొందరు రైతుల్ని పీడిస్తున్నట్టు ఆరోపణలు వస్తున్నాయి. అంతేకాదు.. సమస్యలు పరిష్కరించకుండా ఏవో కుంటిసాకులు చెబుతూ దరఖాస్తులను తిరస్కరిస్తున్నారు. ఇలా భూభారతి పోర్టల్ ద్వారా రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
ధరణి పోర్టల్, భూభారతి పోర్టల్‌కు సంబంధమేలేదు. రెండింటి పనితీరు, విధానం, నిర్వహకులు వేర్వేరు, ధరణిలో 33 మాడ్యుల్స్ ఉంటే, భూభారతిలో 6 మ్యాడ్యూల్స్ మాత్రమే ఉన్నాయి. ఏడాదిగా భూభారతి పోర్టల్‌లోనే భూముల క్రయ విక్రయాలు నిర్వహిస్తున్నారు. అంటే ప్రస్తుతం ధరణి ఎక్కడా లేదు, కనీసం బ్యాక్‌గ్రౌండ్‌లో అయినా ఏమైనా సపోర్ట్ ఉందా అంటే అదీ లేదు. అలాంటప్పుడు మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి చెప్పినట్టుగా ధరణి పోర్టల్ ద్వారా అక్రమాలు ఎలా సాధ్యమవుతాయనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. కేవలం తమ పరువు నిలుపుకొనేందుకు భూభారతిలో జరిగిన అక్రమాలను ధరణిపై నెట్టి పబ్బం గడుపుకొనే ప్రయత్నం చేస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.