నరంలేని నాలుక.. అది ఎటంటే అటే తిరుగుతది.. కానీ దాన్ని తిప్పేముందు మనబుద్ధి ఒకటి పనిచేయాలి కదా! కానీ, ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఇటువంటి లాజిక్లను పట్టించుకోడు. తను చేస్తే ఒప్పు.. వేరేవాడు చేస్తే తప్పు.. ఇది మాత్రమే ఆయనకు తెలిసిన సిద్ధాంతం.. అందుకు తాజా ఉదాహరణ.. ఫోన్ ట్యాపింగ్ మీద ఆయన ఇచ్చిన అమూల్య సందేశం. ఫోన్ ట్యాపింగ్ తప్పు కాదని ఆయన బుధవారం ఢిల్లీలో చేసిన చిట్‌చాట్‌లో తేల్చిచెప్పారు. అన్ని ప్రభుత్వాలు ఫోన్ ట్యాపింగ్ చేస్తాయని, ప్రస్తుతం తమ ప్రభుత్వం కూడా చేస్తున్నదని ఆయన అంగీకరించారు.
తద్వారా రాష్ట్రంలో రేవంత్ ప్రభుత్వం ఫోన్ ట్యాపింగ్‌కు పాల్పడుతున్నదంటూ ‘నమస్తే తెలంగాణ’ ప్రచురించిన కథనాలను ఆయన ధ్రువీకరించారు. మరి ఫోన్ ట్యాపింగ్ చట్టవిరుద్ధం కాకపోతే ఎన్నికల ముందునుంచి నిన్న మొన్నటి దాకా ముఖ్యమంత్రి మొదలుకొని గల్లీ కాంగ్రెస్ లీడర్దాకా బీఆర్ఎస్పై చేసిన దుష్ప్రచారం సంగతి ఏమిటి? రాష్ట్రం కోసం, దేశం కోసం చట్టబద్ధ వ్యవహారాల్లో పాల్గొని, రేవంత్ వేసిన అపనిందల వల్ల నిందితులుగా మారి, విచారణ పేరుతో చెయ్యని నేరానికి జైలుకెళ్లిన పోలీసు అధికారుల సంగతి ఏమిటి? వారి కుటుంబాలు అనుభవించిన మానసిక క్షోభకు ఎవరు జవాబు చెప్తారు?
హైదరాబాద్, జూలై 23 (నమస్తే తెలంగాణ): అసలు ఫోన్ ట్యాపింగ్ ఇల్లీగల్ కాదు.. అది అన్ని ప్రభుత్వాలు చేసేదే.. అయితే అనుమతి తీసుకొని చేయాల్సి ఉంటుంది. గత సర్కారు హయాంలో నా ఫోన్ ట్యాప్ కాలేదు. ఒకవేళ అయ్యుంటే నన్ను సిట్ విచారణకు పిలిచేవారు కదా? ఇప్పటి వరకునన్ను విచారణకు పిలవలేదంటే నా ఫోన్ ట్యాప్ కానట్టే కదా?-ఢిల్లీలో చిట్‌చాట్‌లో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి
తెలంగాణలో ఫోన్‌ట్యాపింగ్ అంశం వివాదాస్పదం అయిన నేపథ్యంలో సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఫోన్‌ట్యాపింగ్ చేయడం చట్టవ్యతిరేకమేమీ కాదని, ఇది అన్ని ప్రభుత్వాలు చేస్తున్నదేనని చెప్పారు. తమ ప్రభుత్వం కూడా ఫోన్‌ట్యాపింగ్ చేస్తున్నదని పరోక్షంగా అంగీకరించారు. ఫోన్‌ట్యాపింగ్ చేసేందుకు అనుమతి తీసుకోవాల్సి ఉంటుందని, దానికొక పద్ధతి ఉంటుందని తెలిపారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం బుధవారం మీడియాతో చిట్‌చాట్ చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో తన ఫోన్ ట్యాపింగ్ కాలేదని వెల్లడించారు. ఒకవేళ తన ఫోన్ ట్యాప్ అయివుంటే సిట్ విచారణకు తనను పిలిచేవారు కదా అని ప్రశ్నించారు. ఇప్పటివరకు తనను విచారణకు పిలవలేదు అంటే తన ఫోన్ ట్యాప్ కానట్టే కదా అని అన్నారు. ఫోన్‌ట్యాపింగ్ ఆరోపణలపై దర్యాప్తుకు సిట్ ఏర్పాటు చేశామని తెలిపారు. ప్రస్తుతం దర్యాప్తు కొనసాగుతున్నదని, సిట్ అధికారులను తాను నియంత్రించలేనని చెప్పారు.
కేంద్రం మెడలు వంచైనా బీసీలకు 42శాతం రిజర్వేషన్లు…
బీసీలకు విద్యా, ఉద్యోగ, రాజకీయాల్లో 42% రిజర్వేషన్లకు సంబంధించి రెండు చట్టాలు చేసి కేంద్రానికి పంపించామని రేవంత్ చెప్పారు. కేంద్రం మెడలు వంచైనా సరే బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పిస్తామని స్పష్టంచేశారు. ఇందుకోసం కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గే, అగ్రనేత రాహుల్‌గాంధీని కలిసి.. పార్లమెంట్లో పోరాటం చే యాలని కోరుతామని తెలిపారు. ప్రధాని మోదీ మహారాష్ట్ర నుంచి లోక్‌సభకు ప్రాతినిధ్యం వహిస్తున్నారని సీఎం చెప్పడం విస్మయం కలిగించిం ది. వాస్తవానికి ప్రధాని మోదీ ఉత్తరప్రదేశ్‌లోని వారణాసి స్థానం నుంచి గెలిచిన సంగతి తెలిసిందే. దీనిపై సోషల్ మీడియాలో సెటైర్లు పేలుతున్నాయి.