Hyderabad Metro | హైదరాబాద్ సిటీబ్యూరో, సెప్టెంబర్ 30 (నమస్తే తెలంగాణ): ‘మేమూ మనుషులమే. హైదరాబాద్‌లో నివాసం ఉంటున్నవాళ్లమే. లేని ఫోర్త్ సిటీ కోసం 40 కి.మీ మేర మెట్రోమార్గాన్ని నిర్మిస్తున్నారు. అలాంటిది ఉత్తర హైదరాబాద్‌లోని సుచిత్ర, మేడ్చల్, అల్వాల్, శామీర్‌పేట ప్రాంతాలకు మెట్రో రైలు కారిడార్ ఎందుకు వేయరు? మాకొద్దా మెట్రో? మేం ఏం పాపం చేశాం?’ అని స్థానిక ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఆదివారం మెట్రో రైలు సంస్థ ప్రకటించిన రెండో దశ మెట్రో రైలు ప్రాజెక్టులో 116 కి.మీ మేర కొత్తగా మెట్రో కారిడార్లను నిర్మిస్తామని ప్రకటించగా.. అందులో మేడ్చల్, శామీర్‌పేటవైపు ఉన్న ప్రాంతాలకు మెట్రో ప్రతిపాదన లేకపోవడంపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఉత్తర హైదరాబాద్‌కు మెట్రో కావాలని అడుగుతున్నా పరిగణనలోకి తీసుకోవడం లేదని మండిపడుతున్నారు. మేడ్చల్ మెట్రో సాధన సమితిగా సంఘటితమై కాంగ్రెస్ ప్రభుత్వంపై ఉద్యమానికి సిద్ధమయ్యారు. మేడ్చల్, దాని పరిసర ప్రాంతాలతో కూడిన ఉత్తర హైదరాబాద్‌ను ప్రభుత్వం విస్మరించిందని, ఇది ఏ మాత్రం ఆమోదయోగ్యం కాదని ధ్వజమెత్తారు.
హైదరాబాద్‌కు ఉత్తరాన ఉన్న సికింద్రాబాద్ ప్యాట్నీ-శామీర్‌పేట, ప్యారడైజ్-మేడ్చల్ మార్గంలో లక్షల మంది ప్రజలు నివాసం ఉంటున్నారు. పరిశ్రమలు, వ్యాపార, వాణిజ్య కేంద్రాలు కూడా భారీగానే ఉన్నాయి. నిత్యం లక్షల మంది ఈ రెండు మార్గాల్లో రాకపోకలు సాగిస్తున్నారు. దీంతో కేసీఆర్ ప్రభుత్వం మెట్రో మార్గాలను ప్రతిపాదించింది. కానీ, అధికారంలోకి కాంగ్రెస్ ప్ర భుత్వం ఆ రెండు మార్గాలను పక్కనపెట్టింది. దీన్ని నిరసిస్తూ ఈనెల 6న జీడిమెట్ల గాంధీ విగ్రహం వద్ద ధర్నా, రాస్తారోకో నిర్వహించాలని మేడ్చల్ మెట్రో సాధన సమితి సభ్యులు నిర్ణయించారు. ప్రభుత్వంపై పోరాడేందుకు హైకోర్టును ఆశ్రయిస్తున్నామని, పిటిషన్‌ను కూడా సిద్ధం చేశామని తెలిపారు.