Lasya Nanditha | ఎమ్మెల్యే లాస్యనందిత దుర్మరణం.. అల్పాహారం చేసేందుకు వెళ్తుండగా వెంటాడిన మృత్యువు
కంటోన్మెంట్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే లాస్యనందిత (37) కారు ప్రమాదంలో దుర్మరణం చెందారు. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు రింగ్‌రోడ్డు సుల్తాన్పూర్ ఓఆర్ఆర్ వద్ద శుక్రవారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆమె అక్కడికక్కడే మృతిచెందారు. ఆమె ప్రయాణిస్తున్న మారుతి వాహనం (టీఎస్09 జీజీ టీ/ఆర్1955) సుల్తాన్పూర్ టోల్గేట్ దాటిన తర్వాత తెల్లవారుజామున 5.30 గంటల సమయంలో రోడ్డు ప్రమాదానికి గురైంది.
- తెల్లవారుజామున ఓఆర్ఆర్పై ఘోర ప్రమాదం
- అతివేగం, నిర్లక్ష్యపు డ్రైవింగ్ ప్రమాదానికి కారణం
- అధికారిక లాంఛనాలతో లాస్య అంత్యక్రియలు పూర్తి
- ఆమె అకాల మరణం తీవ్రంగా కలచివేసింది: కేసీఆర్
- సీఎం రేవంత్ సహా పలువురు ప్రముఖుల దిగ్భ్రాంతి
- ఏడాదికే తిరిగిరాని లోకాలకు తండ్రీ, కూతురు
Lasya Nanditha | సంగారెడ్డి, ఫిబ్రవరి 23(నమస్తే తెలంగాణ)/మాదాపూర్: కంటోన్మెంట్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే లాస్యనందిత (37) కారు ప్రమాదంలో దుర్మరణం చెందారు. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు రింగ్‌రోడ్డు సుల్తాన్పూర్ ఓఆర్ఆర్ వద్ద శుక్రవారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆమె అక్కడికక్కడే మృతిచెందారు. ఆమె ప్రయాణిస్తున్న మారుతి వాహనం (టీఎస్09 జీజీ టీ/ఆర్1955) సుల్తాన్పూర్ టోల్గేట్ దాటిన తర్వాత తెల్లవారుజామున 5.30 గంటల సమయంలో రోడ్డు ప్రమాదానికి గురైంది. ఆ సమయంలో ఆ వాహనాన్ని ఆమె పీఏ కం డ్రైవర్ ఆకాశ్ నడుపుతున్నారు. అతివేగంతోపాటు నిర్లక్ష్యంగా వాహనం నడపడమే ప్రమాదానికి కారణమని పోలీసులు తేల్చారు. వంద కిలోమీటర్ల వేగంతో వాహనం నడపడంతో అది అదుపుతప్పి మొదట టిప్పర్‌ను, ఆ తర్వాత రహదారి పక్కన ఉన్న రెయిలింగ్‌ను బలంగా ఢీకొట్టింది. దీంతో కారు ముందుభాగం పూర్తిగా నుజ్జునుజ్జయ్యింది. ముందు సీట్లో కూర్చున్న ఎమ్మెల్యే లాస్య నందిత తల, మెడకు తీవ్ర గాయాలయ్యాయి.
కారు నడుపుతున్న ఆకాశ్ కాలికి గాయాలయ్యాయి. ప్రమాదం విషయం తెలిసిన వెంటనే పటాన్చెరు పోలీసులు స్పందించి ఘటనా స్థలానికి చేరుకున్నారు. తీవ్ర గాయాలపాలై వాహనంలో పడి ఉన్న ఎమ్మెల్యే లాస్య నందితను పోలీసులు హుటాహుటిన చికిత్స కోసం పటాన్‌చెరులోని ఒక ప్రైవేటు దవాఖానకు తరలించారు. వైద్యులు ఆమెను పరీక్షించి అప్పటికే మృతి చెందినట్టు నిర్ధారించారు. దీంతో పోలీసులు లాస్య నందిత కుటుంబసభ్యులకు సమాచారం అందజేశారు. కుటుంబసభ్యులతోపాటు పలువురు బీఆర్ఎస్ నాయకులు సదరు దవాఖానకు చేరుకున్నారు. విగతజీవిగా ఉన్న లాస్య నందితను చూసి తల్లి, సోదరి కన్నీరు మున్నీరయ్యారు.

కొద్ది గంటల క్రితంవరకు తమతో కలిసి ఉన్న లాస్యనందిత అంతలోనే రోడ్డు ప్రమాదంలో మృతిచెందడం చూసి కుటుంబసభ్యులు తట్టుకోలేకపోయారు. ఆమె మృతదేహంపై పడి కుటుంబసభ్యులు రోదిస్తుండటం చూసి అక్కడున్నవారంతా కంట తడిపెట్టారు. రోడ్డు ప్రమాదం విషయం తెలుసుకున్న మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్‌రావు హైదరాబాద్ నుంచి వెనువెంటనే పటాన్‌చెరులోని ఆమెద దవాఖానకు చేరుకున్నారు. ఎమ్మెల్యే లాస్య నందిత మృతదేహాన్ని చూసి నివాళులర్పించారు. కుటుంబసభ్యులను పరామర్శించి వారికి ధైర్యం చెప్పారు. రోడ్డు ప్రమాదం గురించి పటాన్చెరు పోలీసులతో ఆరాతీశారు. ఆ తర్వాత లాస్య నందిత మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించేందుకు గాంధీ దవాఖానకు తరలించారు. ఎమ్మెల్యే హరీశ్‌రావు లాస్య నందిత మృతదేహం ఉన్న అంబులెన్స్‌తోపాటు గాంధీ దవాఖానకు వెళ్లారు.

రాత్రి దర్గాలో ప్రార్థనలు
లాస్య నందిత మృతితో ఆమె కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి. రోడ్డు ప్రమాదంలో కన్నుమూసేంత వరకు ఆమె తమ కుటుంబసభ్యులతోనే గడిపారు. గురువారం రాత్రి లాస్య నందిత తన తల్లి, అక్క కూతురుతో కలిసి సంగారెడ్డి జిల్లా సదాశివపేట మండలం ఆరూర్ సమీపంలోని మిస్కన్షా బాబా దర్గాను సందర్శించారు. రాత్రి 12.30 గంటల నుంచి 3 గంటల వరకు దర్గా వద్ద ప్రార్థనలు చేసి అక్కడే కొద్దిసేపు నిద్రపోయారు. అనంతరం లాస్య నందిత కుటుంబసభ్యులతో కలిసి సికింద్రాబాద్‌లోని నివాసానికి మారుతి కారులో తిరుగు ప్రయాణమయ్యారు. ఇంటికి చేరుకున్న తర్వాత ఆకలి అవుతుండటంతో లాస్య నందిత అల్పాహారం చేసేందుకు పీఏ ఆకాశ్‌తో కలిసి సంగారెడ్డి వైపు బయలుదేరారు. ఎమ్మెల్యే లాస్య నందిత వాహనం ముందుసీట్లో కూర్చున్నారు. సికింద్రాబాద్ నుంచి కారులో బయలుదేరి తెల్లవారుజామున 4:58 గంటల ప్రాంతంలో శామీర్‌పేట వద్ద ఓఆర్ఆర్పైకి ప్రవేశించారు. ఆమె ప్రయాణిస్తున్న వాహనం సుల్తాన్పూర్ టోల్‌ప్లాజా దాటిన తరువాత రోడ్డు ప్రమాదానికి గురైంది. కారు ముందు భాగం నుజ్జునుజ్జు అయ్యింది. కారులోని విడిభాగాలు రోడ్డుపై చెల్లాచెదురుగా పడ్డాయి. ప్రమాదం తీవ్రతకు ముందుసీటులో కూర్చున్న లాస్య నందిత తలకు, మెడకు తీవ్ర గాయాలవ్వడంతో ఆమె అక్కడికక్కడే మృతిచెందారు.

ఆకాశ్‌పై కేసు నమోదు
ఎమ్మెల్యే లాస్య నందిత మృతికి దారితీసిన కారణాలపై సంగారెడ్డి జిల్లా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాదం జరిగిన వెంటనే జిల్లా అదనపు ఎస్పీ సంజీవరావు ఘటనా స్థలానికి చేరుకుని విచారణ జరిపారు. పోలీసులు, ఆర్టీఏ అధికారులు ప్రమాదం జరిగిన స్థలాన్ని పరిశీలించి ప్రమాదం జరిగిన తీరుపై దర్యాప్తు చేశారు. ప్రమాద ఘటనపై జిల్లా ఏఎస్పీ సంజీవరావు సాయంత్రం మీడియాతో మాట్లాడుతూ.. ఎమ్మెల్యే మృతిపై ఎలాంటి అనుమానాలూ లేవని, ఓఆర్ఆర్పై జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆమె మృతి చెందారని స్పష్టం చేశారు. అతివేగం, డ్రైవర్ ఆకాశ్ నిద్రమత్తులో ఉండటంతో రోడ్డు ప్రమాదం జరిగినట్టు చెప్పారు. నందిత సోదరి నివేదిత ఫిర్యాదు మేరకు పీఏ ఆకాశ్‌పై 304 సెక్షన్ కింద కేసు నమోదు చేసినట్టు తెలిపారు. రోడ్డు ప్రమాద ఘటనపై ఆకాశ్‌ను విచారించామని, పూర్తిస్థాయిలో దర్యాప్తు చేసి ప్రభుత్వానికి నివేదిక ఇవ్వనున్నట్టు వెల్లడించారు.

సీటుబెల్ట్ ధరించి ఉంటే..
సాధారణంగా కారులోకి ఎక్కి డ్రైవింగ్ స్టార్ట్ కాగానే సీటుబెల్ట్ పెట్టుకోకపోతే ఐదు నిమిషాలపాటు బెల్ మోగుతుంది. సీటుబెల్ట్ పెట్టుకోగానే సౌండ్ ఆగిపోతుంది. దీంతో చాలామంది సీటుబెల్ట్‌ను డమ్మీగా పెట్టేసి, సీటుబెల్ట్ ధరించకుండానే ప్రయాణిస్తుంటారు. నందిత కూడా అలాగే చేశారు. తాను సీటుబెల్ట్ ధరించకుండా, డ్రైవర్ పక్క సీటులో డమ్మీగా పెట్టారు. డ్రైవింగ్ సీట్లో కూర్చున్న ఆకాశ్ సీటుబెల్ట్ పెట్టుకోగా, పక్కనే ఉన్న లాస్య నందిత సీటుబెల్ట్ లేకుండా ప్రయాణించారు. రోడ్డు ప్రమాదం జరగగానే సీటుబెల్ట్‌లు పెట్టి ఉండటంతో ముందు సీట్లో ఉన్న రెండు, లాస్య నందిత పక్కన ఉన్న బెలూన్ ఓపెన్ అయ్యాయి. లాస్య నందిత సీటుబెల్ట్ పెట్టుకోకపోవడంతో లారీని కారు ఢీకొన్న వెంటనే ఆమె ఎగిరి ముందు భాగాన్ని గుద్దుకున్నారు. దీంతో తలకు బలమైన గాయమైంది. అయితే సాంకేతికంగా సీటుబెల్ట్ పెట్టి ఉండటంతోనే బెలూన్లు ఓపెన్ అయ్యాయి. నందిత సీటుబెల్ట్ ధరించి ఉండి ఉంటే ఆ ప్రమాదం నుంచి బయటపడేవారని భావిస్తున్నారు. ఈ ప్రమాదంలో ఆకాశ్‌కు ఎడమ కాలు విరిగింది. తొడ, కంటి రెప్ప భాగంలో కారు అద్దాలు గుచ్చుకొని గాయపడ్డాడు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

