ఖైరతాబాద్, ఆగస్టు 20: ప్రైవేటు ఉపాధ్యాయులు, ఉద్యోగుల రక్షణ కోసం ప్రత్యేక చట్టం రావాలని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ కోరారు. అప్పుడే కోర్టుల్లో తమ హక్కుల కోసం పోరాడవచ్చని చెప్పారు. తెలంగాణ ప్రైవేట్ టీచర్స్ ఫోరం అధ్యక్షుడు షేక్ షబ్బీర్ అలీ అధ్యక్షతన ‘విద్యాభివృద్ధి-ప్రైవేట్ ఉపాధ్యాయుల పాత్ర’ అన్న అంశంపై మంగళవారం హైదరాబాద్ సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో జరిగిన రౌండ్‌టేబుల్ సమావేశంలో ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ మాట్లాడారు. అనేక ఉపాధ్యాయులకు ఈఎస్ఐ, పీఎఫ్ సదుపాయాలు కల్పించడంలేదని, అలాంటి పాఠశాలల గుర్తింపును రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ప్రైవేట్ టీచర్ల ఆత్మగౌరవం దెబ్బతీసేలా ఇటీవల సీఎం రేవంత్‌రెడ్డి దురహంకార పూరితమైన వ్యాఖ్యలు చేశారని విమర్శించారు. ఓ ప్రైవేట్ విద్యాసంస్థలో ఎనిమిది నెలలుగా వేతనాలు ఇవ్వడం లేదని, దీనిపై పోరాటం చేస్తామని తెలిపారు. ప్రభుత్వ నియామకాల్లో ప్రైవేట్ టీచర్లకు 25 శాతం వెయిటేజీ ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సెప్టెంబర్ 5న ప్రభుత్వ ఉపాధ్యాయులకే కాదు, ప్రైవేట్ ఉపాధ్యాయులనూ సత్కరించాలని కోరారు.
ప్రైవేట్ టీచర్లపై రేవంత్‌రెడ్డి వ్యాఖ్యలు సరికా దని, సీఎం స్థాయిలో ఉన్న వ్యక్తి ఆచీతూచి మాట్లాడాలని ఎంపీ ఈటల రాజేందర్ సూచించారు. ఏడాదిలో 12 నెలలు సరిగా వేతనాలు అందక ప్రైవేట్ టీచర్లు ఇబ్బందులు పడుతున్నారని, ప్రభుత్వానికి చేతనైతే వారికి 12 నెలలు వేతనాలు ఇప్పించాలని సూచించారు.