Musi | 50 వేల కోట్లతో మూసీ ప్రక్షాళన చేస్తాం. కాలుష్య రహిత మూసీగా తీర్చిదిద్దుతాం
-పార్లమెంటు ఎన్నికల ప్రచారం సందర్భంగా
ఏప్రిల్ 21న భువనగిరిలో రేవంత్‌రెడ్డి మూసీ సుందరీకరణ ప్రాజెక్టు అంచనా వ్యయం 71 వేల కోట్లు
– జూన్ 14న మంత్రి జూపల్లి కష్ణారావు
ఐదేండ్లలో లక్షన్నర కోట్లు ఖర్చు చేసి మూసీ నదికి ఊపిరిపోస్తాం
-గోపన్‌పల్లి ఫ్లై ఓవర్ ప్రారంభోత్సవం సందర్భంగా జూలై 4న రేవంత్‌రెడ్డి
రెండున్నర నెలల్లోనే మూసీ సుందరీకరణ ప్రాజెక్టు వ్యయం ఏకంగా రూ. లక్ష కోట్లు అదనంగా ఎందుకు పెరిగింది? సమగ్ర ప్రాజెక్టు రిపోర్టు లేదు.. అంచనాలు అంతకన్నా లేవు.. కానీ, అంచనాలను సీఎం ఎలా పెంచి ప్రకటించారు? ఈ మధ్యలో ఏం జరిగింది? అంచనా లు పెంచింది ఎవరు? వీటన్నింటికీ అన్ని వేళ్లు ‘మెయిన్‌హార్ట్’ వైపే చూపిస్తున్నాయి. అవును.. పొరుగున ఉన్న ఏపీలో అమరావతి గ్రాఫిక్స్ మాయాప్రపంచానికి సూత్రధారి అయిన ఈశ్వరన్‌కు చెందిన ఈ కంపెనీ రంగ ప్రవేశంతోనే మూసీ సుందరీకరణ అంచనా వ్యయం అమాంతంగా పెరిగిందనే ఆరోపణ లు వినిపిస్తున్నాయి. అమరావతి రాజధాని అభివృద్ధి పేరిట ఈశ్వరన్ కంపెనీ కన్సార్షియం స్టార్టప్ రాజధాని పేరుతో ఏకంగా రూ.66 వేల కోట్ల అవినీతికి స్కెచ్ వేసిందనే ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో అదే ఈశ్వరన్‌కు చెందిన మెయినహార్ట్ మూ సీ సుందరీకరణలో ప్రవేశిస్తున్న దరిమిలా మున్మం దు అమరావతి గ్రాఫిక్స్ తరహాలోనే కాకుండా సుందరీకరణ ఏ మలుపులు తిరగనున్నాయనే అనుమానాలు వెల్లువెత్తుతున్నాయి.
హైదరాబాద్ సిటీబ్యూరో ప్రధాన ప్రతినిధి, అక్టోబర్ 8 (నమస్తే తెలంగాణ): చంద్రబాబు హయాంలో పురుడుపోసుకున్న మూసీ సుందరీకరణను ఎవరు అడ్డుపడినా పూర్తి చేస్తామని రేవంత్ ఇప్పటికే పలుమార్లు ప్రకటించారు. ఈ ప్రాజెక్టు బాబు తర్వాత వైఎస్.. రోశయ్య.. కిరణ్‌కుమారెడ్డి.. కేసీఆర్ ఇలా ప్రతి సీఎం హయాంలో ఏదో ఒక పేరుతో కొనసాగుతున్నదే. కానీ కేసీఆర్ ప్రభుత్వ ఆనవాళ్లు లేకుండా చేస్తానని ప్రకటించిన రేవంత్.. సీఎం కుర్చీలో కూర్చున్నది మొదలు మూసీ రివర్‌ఫ్రంట్ డెవలప్మెంట్ ప్రాజెక్టును ‘గురు’తర బాధ్యతగా భుజానికెత్తుకున్నారు. థేమ్స్ తరహాలో ఈ ప్రాజెక్టును చేపడతామంటూ జనవరి 19న మజ్లిస్ శాసనసభాపక్ష నేత అక్బరుద్దీన్ ఒవైసీతో కలిసి లండన్‌లోని థేమ్స్‌ను సందర్శించి వచ్చారు. ఆ తర్వాత పార్లమెంట్ ఎన్నికల ప్రచారం మొదలు ఇప్పటివరకు వందల సార్లు మూసీ సుందరీకరణ ప్రాజెక్టును జపిస్తూనే ఉన్నారు.
మూసీ సుందరీకరణ మాస్టర్‌ప్లాన్ రూపొందించే కీలక బాధ్యతను సింగపూర్‌కు చెందిన మెయిన్‌హార్ట్ కన్సార్షియంకు అప్పగిస్తూ ప్రభుత్వం ఈ నెల 4న ఉత్తర్వులు జారీ చేసింది. కానీ ఇందుకు 8 నెలల ముందే ఆ కంపెనీకి చెందిన ప్రతినిధి బృందం సీఎం రేవంత్‌రెడ్డిని సచివాలయంలో కలిసింది. ఈ ఏడాది ఫిబ్రవరి 6న సచివాలయంలో కంపెనీ ప్రతినిధులు కలిసి.. కంపెనీ గతంలో చేపట్టిన పలు రివర్‌ఫ్రంట్ డెవలప్మెంట్ ప్రాజెక్టుల వివరాలను ప్రజెంటేషన్ రూపంలో తెలియజేశారు. అయితే మూసీకి సంబంధించి కూడా ప్రతిపాదనలు ఇవ్వాలని సీఎం అప్పట్లోనే వారికి సూచించారు.
మార్చి 10న భువనగిరి పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో.. మూసీ సుందరీకరణకు రూ.50 వేల కోట్ల ఖర్చవుతుందని రేవంత్ ప్రకటించారు. ఆ తర్వాత పలుమార్లు కూడా అదే ప్రకటన చేశారు. మే చివర్లో మెయిన్‌హార్ట్ కంపెనీ.. మూసీ సుందరీకరణపై ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది. సుందరీకరణ ఎలా చేయాలి? ఏయే పనులు చేపట్టాలి? అందుకు ఎంత వ్యయం అవుతుందనే ప్రతిపాదనలు అందులో సమర్పించినట్టు తెలిసింది. అందులోనే మూసీ సుందరీకరణకు రూ.లక్షన్నర కోట్లు ఖర్చవుతుందని పొందుపరిచినట్టు విశ్వసనీయంగా తెలిసింది.
అప్పటినుంచి నెమ్మదిగా ప్రభుత్వ పెద్దల నోటి నుంచి మూసీ సుందరీకరణ అంచనా వ్యయం పెరుగుతూ వచ్చింది. జూన్ 14న ఎక్సైజ్, పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ మూసీ సుందరీకరణ ప్రాజెక్టు అంచనా వ్యయాన్ని రూ.71 వేల కోట్లుగా ప్రకటించారు. జూలై 4న గోపన్‌పల్లి ఫ్లైఓవర్ ప్రారంభోత్సవంలో మూసీ అంచనా వ్యయాన్ని రూ.లక్షన్నర కోట్లుగా వెల్లడించారు. అంటే.. డీపీఆర్ తయారు కాకముందే అంచనా వ్యయం మూడు రెట్లు పెరగడం వెనక అసలు మతలబు ‘మెయిన్‌హార్ట్’ ప్రతిపాదనలు అనేది స్పష్టం అవుతున్నది.
సింగపూర్ మాజీ మంత్రి, ప్రస్తుతం అవినీతి కేసుల్లో జైలులో ఉన్న ఈశ్వరన్ మెయిన్‌హార్ట్ కంపెనీలో ప్రధాన భాగస్వామి. ఈశ్వరన్‌కు చెందిన మరో కంపెనీ సెమ్కాప్ అండ్ అసెండర్స్ సింగ్‌బ్రిడ్జి (మెయిన్హర్ట్ అనుబంధ సంస్థ)కే అమరావతి నగరాభివృద్ధి బాధ్యతను గతంలో చంద్రబాబు ప్రభుత్వం అప్పగించింది. ఈ సంస్థలో ప్రధాన పెట్టుబడిదారు, డైరెక్టర్ ఈశ్వరన్. అమరావతి రాజధాని గ్రాఫిక్స్ మాయాజాలం ఏపాటిదో.. ఇటీవల వరదలతో తేలిపోయింది. తొలుత రాజధాని అభివృద్ధికి మాస్టర్ ప్లాన్ అంటూ రంగప్రవేశం చేసిన ఈశ్వరన్ సింగపూర్ కన్సార్షియం..
ఆపై అవినీతికి దారులు వెతికింది. అప్పటి ఏపీ ప్రభుత్వ పెద్దలతో కలిసి కృష్ణా నదీతీరాన ఏకంగా రూ.66 వేల కోట్ల దోపిడీకి ఈశ్వరన్ స్కెచ్ వేశారనే ఆరోపణలు ఉన్నాయి. స్విస్ చాలెంజ్ విధానంలో అమరావతి స్టార్టప్ ఏరియా ప్రాజెక్టును చంద్రబాబు ప్రభుత్వం ఏకపక్షంగా అసెండర్స్ కన్సార్షియంకు అప్పగించగా.. 1,691 ఎకరాలతో పాటు రూ.5,500 కోట్లు పెట్టే ఏపీ సర్కారుకు 42 శాతం వాటా, కేవలం పర్యవేక్షణ చేసే అసెండర్స్కు 58 శాతం వాటా దక్కేలా ఒప్పందం జరిగిందని మీడియాలో కథనాలు వచ్చాయి. సింగపూర్ బయట అవినీతి తీరు ఇలా ఉంటే.. ప్రపంచంలోనే అవినీతిరహిత దేశాల్లో ఐదో స్థానంలో నిలిచిన సింగపూర్‌లోనూ ఈశ్వరన్ అవినీతి చక్రవర్తిగా విరాజిల్లారు.