హైదరాబాద్, జూలై 16 (నమస్తే తెలంగాణ): ప్రభుత్వ ప్రాధాన్యాలతోపాటు ప్రజాప్రయోజనాలను అర్థం చేసుకొని పని చేయాలని కలెక్టర్లకు సీఎం రేవంత్‌రెడ్డి దిశానిర్దేశం చేశారు. తమ ప్రభుత్వం పారదర్శకంగా ప్రజాహిత పాలనను అందించటంతోపాటు సంక్షేమం, అభివృద్ధిని సమతుల్యం చేసుకుంటూ ముందుకు సాగుతున్నదని తెలిపారు. మంగళవారం సచివాలయంలో అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, పోలీస్ కమిషనర్లు, వివిధ శాఖల ఉన్నతాధికారులతో సీఎం రేవంత్ సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వానికి కండ్లు, చెవులు, జిల్లా స్థాయిలో వారధులు, సారథులు కలెక్టర్లేనని చెప్పారు. కలెక్టర్లు ఏ జిల్లాలో పనిచేసినా ప్రజల మదిలో చెరగని ముద్ర వేయాలని సూచించారు. తెలంగాణలో పనిచేస్తున్న ఇతర రాష్ర్టాల అధికారులు భాష నేర్చుకుంటే సరిపోదని, తెలంగాణ సంసృతిలో భాగం కావాలని కోరారు. తెలంగాణను సొంత రాష్ట్రంగా భావించి పని చేయాలని అన్నారు. ప్రభుత్వ పథకాలను లబ్ధిదారులకు చేర్చే బాధ్యత కలెక్టర్లదేనని వెల్లడించారు.
శాంతిభద్రతల పరిరక్షణ విషయంలో రాజీపడొద్దని పోలీసు అధికారులకు సీఎం సూచించారు. ఫ్రెండ్లీ పోలీసింగ్ బాధితులతోనే తప్ప నేరస్థులతో కాదని గుర్తుంచుకోవాలని స్పష్టం చేశారు. డ్రగ్స్, సైబర్ నేరాలపై ఉకుపాదం మోపాలని తేల్చి చెప్పారు. పోలీసు, ఎక్సైజ్, టీజీ న్యాబ్ సమన్వయం చేసుకొని ముందుకు సాగాలని సూచించారు.
రాష్ట్రంలో ప్రతి ఒకరికి డిజిటల్ హెల్త్ ప్రొఫైల్ రూపొందించాలని నిర్ణయం తీసుకున్నామని సీఎం చెప్పారు. రాష్ట్రంలో అందరికీ ఆరోగ్యశ్రీ కార్డులను అందించేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. గ్రామాల్లో వైద్య సేవలందించే ఆర్ఎంపీ, పీఎంపీలకు ట్రైనింగ్ ఇచ్చి సర్టిఫికెట్ ఇవ్వాలన్న డిమాండ్ ఉన్నదని, అధ్యయనం చేసి అందుకు సంబందించిన ఉత్తర్వులు ఇచ్చే అంశాన్ని పరిశీలించాలని సూచించారు. సదస్సులో డిప్యూటీ సీఎం భట్టివిక్రమార, మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, శ్రీధర్‌బాబు, దామోదర రాజనర్సింహ, పొన్నం ప్రభాకర్, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, జూపల్లి కృష్ణారావు, తుమ్మల నాగేశ్వరరావు, సీతక, కొండా సురేఖ, ప్రణాళిక బోర్డు ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి, సీఎం సలహాదారు వేం నరేందర్‌రెడ్డి , సీఎస్ శాంతికుమారి, డీజీపీ జితేందర్ పాల్గొన్నారు.
కొన్ని రోజులుగా రాష్ట్రవ్యాప్తంగా వరుసగా నిరసనలు, ధర్నాలు జరుగుతుండటంపై సీఎం రేవంత్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తంచేసినట్టు తెలిసింది. తాజాగా సచివాలయంలో పలువురు మంత్రులను పిలిపించుకొని సమావేశమైనట్టు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. వివిధ వర్గాలు ధర్నాలు చేస్తున్నా, కొన్ని సంఘాలు సచివాలయం ముట్టడిస్తున్నా ఎందుకు ఖండించడం లేదని అడిగినట్టు తెలిసింది. డీఎస్సీ, గ్రూప్స్ పోస్టులు, రుణమాఫీపై ఇంత రచ్చ జరుగుతున్నా సంబంధిత మంత్రులు ఎందుకు స్పందించడం లేదని అడిగినట్టు సమాచారం. ప్రెస్‌మీట్ ద్వారానో, ప్రెస్‌నోట్ రూపంలోనో, చర్చల ద్వారానో వారి అనుమానాలను ఎందుకు నివృత్తి చేయలేకపోతున్నారని ఆరా తీసినట్టు తెలిసింది. ఈ నేపథ్యంలోనే డీఎస్సీ, గ్రూప్స్ పోస్టులపై ఓ మంత్రి ప్రెస్‌మీట్ పెట్టగా, రుణమాఫీపై మరో మంత్రి వరుసగా ప్రెస్నోట్లు, చిట్చాట్లు నిర్వహిస్తున్నట్టు ప్రచారం జరుగుతున్నది.
రాష్ట్ర ప్రజలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తొలి ఏకాదశి పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఏకాదశి పండుగను ప్రతి ఇంటా ఆనందంగా జరుపుకోవాలని ఆకాంక్షించారు.