హైదరాబాద్, ఫిబ్రవరి 5 (నమస్తే తెలంగాణ) వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో తెలంగాణ నుంచి పోటీ చేయాలని కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ చైర్ పర్సన్ సోనియాగాంధీకి తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు. రాష్ట్రం నుంచి పోటీ చేయాలని ఇప్పటికే పీసీసీ తీర్మానం చేసిన విషయాన్ని సోనియాగాంధీ దృష్టికి ఆయన తీసుకెళ్లారు. దీంతో సరైన సమయంలో నిర్ణయం తీసుకుంటానని సోనియాగాంధీ అన్నట్టు సీఎం తెలిపారు. సోమవారం ఉదయం హైదరాబాద్ నుంచి రాంచీ (జార్ఖండ్) వెళ్లిన రేవంత్.. అక్కడ రాహుల్‌గాంధీ చేపట్టిన భారత్ జోడో న్యాయ్ యాత్రలో పాల్గొన్నారు. అటునుంచి సాయంత్రం ఢిల్లీకి చేరుకొని సోనియాగాంధీతో భేటీ అయ్యారు. ఈ భేటీలో డిఫ్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి కూడా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న హామీలను సోనియాగాంధీకి సీఎం వివరించారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన ఆరు హామీల్లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, రాజీవ్ ఆరోగ్యశ్రీ పరిమితిని రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షలకు పెంచడాన్ని అమలుచేశామని వివరించారు. రూ.500కే వంటగ్యాస్ సిలిండర్, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్తు అమలుకు నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు. బీసీ కుల గణన చేపట్టాలని నిర్ణయించామని, ఇందుకు సంబంధించి సన్నాహాలు చేస్తున్నామని చెప్పారు. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో రాష్ట్రంలో ఎక్కువ సీట్లు సాధించాలని ప్రయత్నిస్తున్నామని, సీట్ల ఆశావాహుల నుంచి దరఖాస్తులు స్వీకరించామని, కసరత్తు చేసి బలమైన అభ్యర్థులను ఎంపిక చేయనున్నట్టు వివరించారు.
ఎంపీ సీట్లపై కసరత్తు
ఖమ్మం పార్లమెంట్ స్థానం నుంచి సోనియాగాంధీని పోటీలో దింపాలని రాష్ట్ర కాంగ్రెస్ నేతలు గట్టిగానే ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలిసింది. అందుకే సీఎం, డిఫ్యూటీ సీఎం స్వయంగా ఢిల్లీకి వెళ్లి సోనియాను కలిసి ఈ మేరకు విజ్ఞప్తి చేశారు. అయితే, ఖమ్మం నుంచి సోనియాగాంధీ పోటీచేయని పక్షంలో ఎంపీ టికెట్ తనకు ఇవ్వాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క భార్య నందిని డిమాండ్ చేసిన విషయం తెలిసింది. సోనియాగాంధీ అభిప్రాయం తెలిసితన తర్వాతే తన ప్రయత్నాలను ముమ్మరం చేయాలని భట్టి భావిస్తున్నారు. గాంధీభవన్‌లో మంగళవారం సాయంత్రం ఎంపీ టికెట్ల అశావహులపై పీసీసీ ఎన్నికల కమిటీ సమావేశం కానున్న నేపథ్యంలో సోనియాగాంధీతో వీరి సమావేశం ప్రాధాన్యం సంతరించుకొన్నది. ఎంపీ టికెట్ల అశావహులు, మంత్రివర్గ విస్తరణ, నామినేటెడ్ పోస్టులు, ఇటీవల జరిగిన ఎమ్మెల్సీల ఎన్నిక, గవర్నర్ కోటా ఎమ్మెల్సీలతోపాటు ఈ నెల 8 నుంచి ప్రారంభంకానున్న శాసనసభ బడ్జెట్ సమావేశాలు తదితర అంశాలు ఈ సందర్భంగా సోనియాగాంధీకి సీఎం రేవంత్‌రెడ్డి వివరించినట్టు పార్టీ వర్గాల సమాచారం.
నీతీఆయోగ్ వైస్ చైర్మన్ సుమన్ భేరితో భేటీ
కేంద్రం నుంచి తెలంగాణకు రావాల్సిన గ్రాంటు రూ.1,800 కోట్లు వెంటనే విడుదలయ్యేలా చూడాలని నీతీఆయోగ్ వైస్ చైర్మన్ సుమన్ భేరికి సీఎం రేవంత్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు. ఢిల్లీలో సోమవారం సుమన్‌ను కలిసి మూసీ రివర్ ఫ్రంట్ అభివృద్ధికి అవసరమైన నిధులు ఇప్పించాలని కోరారు. ప్రపంచబ్యాంకు ఎయిడ్ విడుదలకు చొరవ తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో తాగు నీటి సరఫరాకు అవసరమైన నిధులతో పాటుతమ ప్రభుత్వం వైద్య,ఆరోగ్య, విద్యా రంగాల్లో తీసుకురానున్న సంస్కరణలకు సహకరించాలని సీఎం కోరినటు సీఎం కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది.
ఏడోసారి హస్తినకు సీఎం
ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత రేవంత్‌రెడ్డి ఢిల్లీకి వెళ్లడం సోమవారం నాటి పర్యటనతో ఏడోసారి. డిసెంబర్ 7న సీఎంగా బాధ్యతలు చేపట్టాక ఇప్పటి వరకు 59 రోజుల్లో సగటున 8 రోజులకొకసారి సీఎం ఢిల్లీకి వెళ్లడం గమనార్హం.
ఢిల్లీ వెళ్లిన సీఎం, డిప్యూటీ సీఎం
సీఎం రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క సోమవారం ఢిల్లీకి వెళ్లారు. జార్ఖండ్ రాజధాని రాంచీలో జరుగుతున్న భారత్ జోడో న్యాయయాత్రలో పాల్గొనేందుకు సీఎం, డిప్యూటీ సీఎం, మంత్రులు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, సీతక్క, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి దీపాదాస్ మున్షీ ప్రత్యేక విమానంలో రాంచీకి వెళ్లారు. అక్కడి నుంచి ఢిల్లీకి వెళ్లారు. లోక్‌సభ ఎన్నికల సన్నద్ధతపై ఢిల్లీలో పార్టీ పెద్దలతో చర్చించనున్నట్టు తెలిసింది. వీరు తిరిగి మంగళవారం హైదరాబాద్‌కు రానున్నారు.