సినీప్రముఖులతో సీఎం సమావేశం కొనసాగుతుండగా ఓ వ్యక్తి కమాండ్ కంట్రోల్ సెంటర్ ముందు హడావుడి చేశాడు. ‘సినీ పెద్దలతో కాదు.. గద్దలతో సమావేశం అవుతున్నారు’ అంటూ ప్లకార్డులు ప్రదర్శించారు. హీరోలు, దర్శకులు, నిర్మాతలే కాకుండా అన్నివర్గాల నుంచి ప్రతినిధులను పిలిపించుకొని మాట్లాడాలని డిమాండ్ చేశారు.
Telangana | హైదరాబాద్, డిసెంబర్ 26 (నమస్తే తెలంగాణ): సినీపరిశ్రమ నుంచి ప్రభుత్వం సెస్ వసూలు చేయనున్నట్టు సీఎం రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్క స్పష్టంచేశారు. రాష్ట్రంలో యంగ్ ఇండియా ఇంటర్నేషనల్ స్కూళ్ల నిర్మాణం జరుగుతన్నదని, వీటి ఖర్చు కోసం సినిమా పరిశ్రమపై సెస్ వేయాలని భావిస్తున్నట్టు తెలిపారు. గురువారం హైదరాబాద్‌లోని పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్లో సినీప్రముఖులతో సీఎం రేవంత్‌రెడ్డి సమావేశం నిర్వహించారు. సమావేశంలో సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన, సినిమా అభివృద్ధిపై చర్చించారు.
ఈ సందర్భంగా సీఎం రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్క మాట్లాడుతూ రాష్ట్రంలో బడుగు, బలహీన, దళిత, మైనారిటి విద్యార్థుల కోసం ప్రపంచస్థాయి ప్రమాణాలతో విద్యను అందించేందుకు యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్లను నిర్మిస్తున్నామని చెప్పారు. నియోజకవర్గానికి ఒకటి చొప్పున సుమారు రూ.200 కోట్లతో 119 స్కూళ్ల నిర్మాణం జరుగుతున్నదని వివరించారు.
సినీపరిశ్రమ నుంచి కొంత సెస్ రూపంలో వసూలు చేసి ఆర్థిక వనరులు సమకూర్చాలని భావిస్తున్నామని చెప్పారు. ఇదొక గొప్ప కార్యక్రమమని, సినీపరిశ్రమ సహకరించాలని కోరారు. సినీరంగ సమస్యలను పరిష్కరించేందుకు మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. టికెట్ ధరల పెంపు, బెనిఫిట్ షోలపై చర్చించి మంత్రివర్గ ఉపసంఘం నిర్ణయం తీసుకోవాలని సీఎం, డిప్యూటీ సీఎం సూచించారు. పరిశ్రమ పురోభివృద్ధి, సానుకూల వాతావరణం ఏర్పాటుకు సినీ పరిశ్రమ వైపు నుంచి కూడా ఒక కమిటీని ఏర్పాటు చేసుకోవాలని తెలిపారు.
గతంలో సినిమా స్టూడియోలకు స్థలాలు, నిర్మాణాలు, నివాస స్థలాలు, ఫిల్మ్‌నగర్, చిత్రపురి కాలనీ, కార్మికులకు ఇండ్లు, ఇతర సౌకర్యాలు కాంగ్రెస్ ప్రభుత్వాలే ఇచ్చాయని సీఎం రేవంత్‌రెడ్డి గుర్తుచేశారు. ఆ వారసత్వాన్ని కొనసాగిస్తామని, సినిమా పరిశ్రమను ప్రోత్సాహించడమే తమ ముఖ్య ఉద్దేశమని చెప్పారు. ఇప్పుడున్న హీరోలంతా తన ముందు ఎదిగినవారేనని, ఎవరో ఒకరు తన పేరు మర్చిపోతే ఎందుకు ఫీలవుతానని వ్యాఖ్యానించినట్టు సమాచారం.
తన స్థాయి అలాంటిది కాదని, ఆ ప్రచారాన్ని ఖండించాల్సిన బాధ్యత టాలీవుడ్ ప్రముఖులకు లేదా? అని ప్రశ్నించినట్టు తెలిసింది. ముఖ్యమంత్రిగా చట్టాన్ని అమలు చేయాల్సిన బాధ్యత తనపై ఉన్నదని, వ్యక్తిగతంగా ఎవరిమీదా రాగద్వేషాలు లేవని చెప్పినట్టు సమాచారం. అవసరమైతే ‘మా’ అసోసియేషన్‌కు స్థలాలు ఇస్తామన్నట్టు తెలిసింది. సమావేశంలో నాగార్జున, వెంకటేశ్, కల్యాణ్‌రామ్, అల్లు అరవింద్, సురేశ్‌బాబు, నవీన్, డీవీవీ దానయ్య, చినబాబు, రాఘవేంద్రరావు, హరీశ్‌శంకర్, త్రివిక్రమ్, కొరటాల శివ, బోయపాటి శ్రీను, వీరశంకర్, సిద్దు జొన్నలగడ్డ, వరుణ్‌తేజ్, సాయిదుర్గాతేజ్, బలగం వేణు, శివబాలాజీ సహా 60మంది సినీప్రముఖులు పాల్గొన్నారు.
ప్రపంచ స్థాయి సినిమాలు తీయాలంటే భారీగా ఖర్చు పెట్టాల్సి ఉంటుందని సీనియర్నటుడు మురళీమోహన్ చెప్పారు. ఆ మొత్తాన్ని మళ్లీ వారంరోజుల్లోనే రాబట్టుకోవాల్సి ఉంటుందని తెలిపారు. ఇందుకోసం టికెట్ల ధరల పెంపు, అదనపు షోలు తప్పవని స్పష్టంచేశారు. సంధ్య థియేటర్ ఘటన బాధించిందని తెలిపారు. ఎన్నికల ఫలితాల రోజు మాదిరిగానే సినిమా విడుదలైన మొదటిరోజు ఉంటుందని వివరించారు. సినిమా విడుదలలో పోటీ వల్లే ప్రచారం కీలకంగా మారిందని చెప్పారు.
చిన్న చిన్న విషయాలను సీఎం పట్టించుకోవద్దని నిర్మాత శ్యామ్‌ప్రసాద్‌రెడ్డి కోరారు. సినీపరిశ్రమ తరపున సీఎంకు తెలుగు చలనచిత్ర వాణిజ్య మండలి నుంచి వినతి పత్రం అందించామని చెప్పారు.
హైదరాబాద్, డిసెంబర్ 26 (నమస్తే తెలంగాణ): సీఎం రేవంత్‌రెడ్డితో సమావేశం తర్వాత టీఎఫ్‌డీసీ చైర్మన్ దిల్ రాజు విలేకరులతో మాట్లాడుతూ ప్రభుత్వం, సినీపరిశ్రమకు మధ్య గ్యాప్ ఉందనేది అపోహ మాత్రమేనని తెలిపారు. సినీపరిశ్రమ సమస్యలను తెలంగాణ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లామని చెప్పారు. బెనిఫిట్ షోలు, టికెట్ ధరలు చాలా చిన్న విషయాలని, వీటిపై చర్చ జరగలేదని తెలిపారు. హైదరాబాద్‌ను సినీపరిశ్రమకు అంతర్జాతీయ హబ్‌గా తీర్చిదిద్దేందుకు చర్యలు తీసుకోవాలని సీఎం రేవంత్‌రెడ్డి చెప్పినట్టు తెలిపారు.
సినీపరిశ్రమ, ప్రభుత్వం కలిసి పనిచేయాలని సీఎం చెప్పారని వివరించారు. హైదరాబాద్‌లో హాలీవుడ్ షూటింగ్‌లు జరిగేలా ప్రణాళికలు రూపొందించాలని కోరినట్టు వెల్లడించారు. సంధ్య థియేటర్ తొక్కిసలాట దృశ్యాలను పోలీసులు ప్రదర్శించారన్న ప్రచారం అబద్ధమని, కొందరు దుష్ప్రచారం చేస్తున్నారని దిల్‌రాజు చిట్‌చాట్‌లో చెప్పారు. సామాజిక సేవా కార్యక్రమాల్లో సెలబ్రెటీలు పాల్గొనాలని సీఎం సూచించారని తెలిపారు. గద్దర్ అవార్డులను ఎఫ్డీసీతో అనుసంధానం గురించి సూచించారని వివరించారు. బౌన్సర్ల ప్రవర్తన తీరుపై డీజీపీ తమకు చెప్పారని, ప్రతీ విషయంలోనూ బాధ్యతగా ప్రవర్తించాలని నిర్దేశించారని వెల్లడించారు.
తెలుగు సినిమా పరిశ్రమకు ప్రపంచవ్యాప్తంగా ఒక బ్రాండ్ క్రియేట్ చేయాలని నిర్ణయం తీసుకున్నామని సీఎం రేవంత్‌రెడ్డి చెప్పారు. సినీ రంగానికి హైదరాబాద్ కేంద్ర బిందువుగా ఉండేలా హాలీవుడ్, బాలీవుడ్ సైతం హైదరాబాద్ వచ్చేలా చర్యలు చేపడతామని తెలిపారు. హైదరాబాద్‌లో పెద్ద సదస్సు నిర్వహించి ఇతర సినిమా పరిశ్రమలను ఆకట్టునే ప్రయత్నం చేస్తున్నామని చెప్పారు. సినీ పరిశ్రమ ఎదుగుదలకు దేశంలోని కాస్మోపాలిటన్ సిటీల్లో హైదరాబాద్ బెస్ట్ సిటీ అని పేర్కొన్నారు.
తెలంగాణలో అవార్డులు ఇవ్వడంలేదని తెలిసి గద్దర్ పేరుతో అవార్డును ఏర్పాటు చేశామని, దిల్ రాజును ఎఫ్డీసీ ఛైర్మన్‌గా నియమించామని తెలిపారు. రాష్ట్రంలో ఎకడైనా షూటింగ్ చేసుకుని 2 గంటల్లో హైదరాబాద్ రావొచ్చని, రాష్ట్రంలోని ఎకో టూరిజం, టెంపుల్ టూరిజాన్ని ప్రమోట్ చేయాలని కోరారు. గంజాయి, డ్రగ్స్‌తో దుష్ప్రభావాలపై సినిమా పరిశ్రమ ప్రచారం చేయాలని కోరారు.