హైదరాబాద్, జూలై 26(నమస్తే తెలంగాణ): ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మరోసారి తనకు అలవాటైన అబద్ధాలను అందంగా వల్లెవేశారు. తాను సీఎం అయినప్పటి నుంచి ఇప్పటి వరకు అసెంబ్లీలో ప్రతిపక్ష సభ్యుల్ని ఒక్కర్ని కూడా సస్పెండ్ చేయలేదని చెప్పారు. వారు ఎంత మాట్లాడినా అవకాశం ఇచ్చామని పేర్కొన్నారు. ఈ ఏడాది మార్చిలో జరిగిన సమావేశాల్లో బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీశ్‌రెడ్డిని మొత్తం సెషన్ నుంచి సస్పెండ్ చేసిన విషయాన్ని ఆయన మర్చిపోయారు. దీంతో జగదీశ్‌రెడ్డిని చేసింది సస్పెండ్ కాదా? అని బీఆర్ఎస్ నేతలు ప్రశ్నిస్తున్నారు. ప్రతిపక్ష సభ్యులు ఎంతసేపైనా మాట్లాడేందుకు అవకాశం ఇచ్చారనడంపైనా బీఆర్ఎస్ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.
బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కేటీఆర్, హరీశ్‌రావుతో పాటు ఇతర ఎమ్మెల్యేలు మాట్లాడుతుంటే పదే పదే మైక్ కట్ చేసిన విషయాన్ని గుర్తుచేస్తున్నారు. అలాగే అధికారపక్ష సభ్యులతో పాటు సీఎం రేవంత్‌రెడ్డి వారిని అడ్డుకునేందుకు చేసిన ప్రయత్నాలను గుర్తు చేస్తున్నారు. ఇవన్నీ దాచేసి సభల్లో మాత్రం నీతి వ్యాఖ్యలు బోధించడాన్ని తీవ్రంగా విమర్శిస్తున్నారు. శనివారం నిర్వహించిన జైపాల్‌రెడ్డి డెమోక్రసీ అవార్డు ప్రదానోత్సవంలో పాల్గొన్న రేవంత్‌రెడ్డి ప్రముఖ ఆర్థిక నిపుణుడు మోహన్ గురుస్వామికి అవార్డు అందజేశారు.
అనంతరం సీఎం మాట్లాడుతూ రాజకీయాల్లో ధన ప్రవాహం తగ్గించాల్సిన అవసరం ఉందని సెలవిచ్చారు. సీఎం చేసిన ఈ నీతి సూక్తులపై సోషల్ మీడియాలో సెటైర్లు పేలుతున్నాయి. రేవంత్‌రెడ్డి తీరు వెయ్యి ఎలుకలు తిన్న పిల్లి.. తాను మాంసాహారం ముట్టనని చెప్పిన సామెను గుర్తు చేస్తున్నదని ఎద్దేవా చేస్తున్నారు. ఎమ్మెల్సీ కొనుగోలుకు సంబంధించి ఓటుకు నోటు కేసులో ఇరుక్కొన్న రేవంత్‌రెడ్డి.. ఇప్పుడు రాజకీయాల్లో ధన ప్రవాహం తగ్గించాలంటూ నీతులు చెప్పడం ఏంటని విమర్శిస్తున్నారు.