హైదరాబాద్, జూన్ 15 (నమస్తే తెలంగాణ) : విద్య, వైద్య విభాగాల్లో అన్నిస్థాయిల్లో ఫేషియల్ రికగ్నైజేషన్ అటెండెన్స్ విధానం అమలు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు. పాఠశాలల నుంచి కాలేజీలవరకు, పీహెచ్సీ నుంచి ఉస్మానియా, గాంధీ దవాఖానవరకు ఉద్యోగులందరికీ ఇదే అటెండెన్స్ విధానం పాటించాలని చెప్పారు. ఇందుకు సంబంధించి చర్యలు తీసుకోవాలని సీఎస్‌ను ఆదేశించారు. సోమవారం 99డేస్ ప్రణాళిక అమలు తీరుపై సీఎం సమీక్ష నిర్వహించారు. మార్చి 16 నుంచి జూన్ 12 వరకు చేపట్టిన ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో చేపట్టిన కార్యక్రమాల్లో కొన్ని విభాగాలు ఆశించినంతగా చెప్పుకోలేకపోయాయని ముఖ్యమంత్రి అభిప్రాయపడ్డారు.
99 రోజుల ప్రణాళికలో భాగంగా క్షేత్రస్థాయి పర్యటనకు వెళ్లని అధికారులు, జిల్లా కలెక్టర్లపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టంచేశారు. 99 రోజులప్రణాళిక కార్యక్రమంలో పాల్గొనని కలెక్టర్లపై నివేదిక ఇవ్వాలని సీఎస్ రామకృష్ణారావును ఆదేశించారు. క్రమశిక్షణ ఉల్లంఘన చర్యలు ఎందుకు తీసుకోకూడదో వారినుంచి వెంటనే వివరణ కోరాలని సూచించారు.