హైదరాబాద్ : దివ్యాంగుల సంక్షేమానికి సీఎం కేసీఆర్ అధిక ప్రాధాన్యత ఇస్తున్నారని సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. మంత్రి క్యాంపు కార్యాలయంలో దివ్యాంగుల సంక్షేమంపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. సమావేశంలో మహిళా, శిశు, దివ్యాంగులు, వయో వృద్ధుల సంక్షేమ శాఖల ప్రత్యేక కార్యదర్శి దివ్యా దేవరాజన్, డైరెక్టర్ శైలజ తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ..వికలాంగులు అనే పదాన్ని నిషేధించి దివ్యాంగులు అని గౌరవంగా పిలుస్తున్నం. వారిలో ఆత్మగౌరవాన్ని మరింత పెంచుతున్నామని తెలిపారు. రాష్ట్రంలో సుమారు 5 లక్షల మందికి పింఛన్లు ఇస్తున్నామని తెలిపారు. ఇందుకు ఏటా 18 వందల కోట్లు ఖర్చు అవుతుందని పేర్కొన్నారు.
ఇటీవల 21 కోట్లతో 14వేల మంది దివ్యాంగులకు వివిధ రకాల ఉపకరణాలను ఉచితంగా అందజేశామన్నారు. దివ్యాంగులకు రూ.3,016 పింఛన్ ఏ రాష్ట్రంలో కూడా ఇవ్వట్లేదన్నారు. అలాగే, దివ్యాంగుల ప్రీ మెట్రిక్ ఉపకార వేతనాలు, విద్యార్థులకు రవాణా, అంధులకు సహాయకారిగా ఉండే రీడర్ అలవెన్సులను పెంచడం గురించి తగు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని మంత్రి అధికారులను ఆదేశించారు.
మానసిక దివ్యాంగుల ఆశ్రమాలకు మరింత చేయూతనివ్వడం, వసతిగృహాల నిర్వహణను మరింత మెరుగుపర్చడం గురించి ప్రతిపాదనలు అందజేయాల్సిందిగా అధికారులను కొప్పుల ఆదేశించారు.