హైదరాబాద్, ఏప్రిల్ 28 (నమస్తే తెలంగాణ): గవర్నమెంట్ ప్లీడర్లు (జీపీలు), అసిస్టెంట్ గవర్నమెంట్ ప్లీడర్లు (ఏజీపీలు), ఏపీపీలు, ఇతర న్యాయ నియామకాల్లో ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు సామాజిక న్యాయాన్ని పాటిస్తూ దేశంలోనే తొలిసారి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు అత్యధిక ప్రాధాన్యం కల్పించారని హైకోర్టు న్యాయవాదులు హర్షం వ్యక్తం చేశారు. అందుకు సీఎం కేసీఆర్‌కు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేయడంతోపాటు హైదరాబాద్‌లోని ట్యాంక్‌బండ్ వద్ద ఏర్పాటు చేసిన 125 అడుగుల అంబేదర్ విగ్రహానికి శుక్రవారం పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా హైకోర్టు ప్రభుత్వ న్యాయవాది కొమ్ము ప్రవీణ్‌కుమార్ మాట్లాడుతూ.. ఇటీవల చేపట్టిన 6 జీపీ, 31 ఏజీపీ నియామకాల్లో సీఎం కేసీఆర్ 90% అవకాశాలను ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకే కల్పించారని, ఇది హైకోర్టు చరిత్రలోనే గొప్ప పరిణామమని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఏజీపీలు సరిత, మంచర్ల విష్ణువర్ధన్, ఝాన్సీ, తెలంగాణ హైకోర్టు ఈసీ మెంబర్లు సైదులు, హరీందర్‌సింగ్ తదితరులు పాల్గొన్నారు.