BRS | హైదరాబాద్, అక్టోబర్ 15 (నమస్తే తెలంగాణ): బీఆర్ఎస్ ఎన్నికల ప్రధాన ప్రచార రథం అత్యాధునిక హంగులతో ప్రజలను ఆకట్టుకుంటున్నది. పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ఈ బస్సు నుంచే రాష్ట్రవ్యాప్తంగా ప్రచారం నిర్వహించనున్నారు. హుస్నాబాద్ నియోజకవర్గంలో ఆదివారం ఈ బస్సు నుంచే కేసీఆర్ ఎన్నికల శంఖారారాన్ని పూరించారు. కనువిందైన గులాబీ రంగు.. దానిపై కారు గుర్తు.. భారతదేశ పటం, బీఆర్ఎస్ పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ నిలువెత్తు రూపంతో అత్యాధునిక ఆకర్షణీయ బస్సు తెలంగాణ అంతటా కలియ దిరుగనున్నది.

ఎన్నికల ప్రచారం కోసం ప్రత్యేకంగా రూపొందించిన ఈ బస్సును సమాజ్‌వాదీ పార్టీ అధినేత, ఉత్తరప్రదేశ్ మాజీ సీఎం అఖిలేశ్‌యాదవ్ బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్‌కు నజరానా ఇచ్చారు. ప్రతి ఇంటికి సంక్షేమం, ప్రతిముఖంలో సంతోషం… ఓట్ ఫర్ కార్.. ఓట్ బీఆర్ఎస్, మన రాష్ట్రంలో మన పార్టీ.. మన ఓటు మన కారు గుర్తుకే’ వంటి నినాదాలు.. విధానాలతో అత్యంత ఆకర్షణీయంగా బస్సు ముస్తాబై కనువిందు చేస్తున్నది. లోపల ఎంతదూరం ప్రయాణం చేసినా బడలిక లేకుండా ఉండేందుకు కావాల్సిన అన్ని సౌకర్యాలు, హంగులతో బస్సును ప్రత్యేకంగా రూపొందించారు.
హైడ్రాలిక్ ఎలివేటర్ (బస్సు లోపలి నుంచి పైకప్పుపైకి వెళ్లేందుకు అనువుగా), బస్సుకు ఇరువైపులా హై క్వాలిటీ సౌండ్ సిస్టమ్, లోపల టీవీ, వైఫై సహా అత్యాధునిక సాంకేతిక సదుపాయాలతో మెర్సిడెస్ బెంజ్ బస్సు సీఎం కేసీఆర్ నిర్వహించే ఎన్నికల ప్రచారంలో అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల రోడ్ల మీద తిరుగుతూ కనువిందు చేయనున్నది.