హైదరాబాద్ : ఎరువుల ధరల పెంపుపై ప్రధాని నరేంద్ర మోదీకి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ బుధవారం లేఖ రాశారు. పెరిగిన ఎరువుల ధరలు తగ్గించాలని, కోట్ల మంది రైతుల తరపున విజ్ఞప్తి చేస్తున్నానని కేసీఆర్ తన లేఖలో పేర్కొన్నారు. 2022 వరకు రైతుల ఆదాయం రెట్టింపు చేస్తామని 2016లో ప్రకటించారు. ఇంత వరకు అతీగతీ లేదు.
రైతాంగం ఇప్పటికే తీవ్ర నష్టాల్లో ఉందన్నారు. ఎరువుల ధరలు 50 నుంచి 100 శాతం పెరిగాయి. గత 90 రోజులుగా ఎరువుల ధరలు విపరీతంగా పెరుగుతున్నాయి. ఇప్పటికే అనేక రైతు వ్యతిరేక నిర్ణయాలు తీసుకున్నారు. వ్యవసాయాన్ని కార్పొరేట్ శక్తులకు కట్టబెట్టేందుకు కుట్రలు చేస్తున్నారు. గత ఐదేండ్లలో ఇన్పుట్ కాస్ట్ రెట్టింపు అయిందన్నారు. గుడ్డిగా కేంద్రం ఎరువుల ధరలను పెంచుతోంది. యూరియా, డీఏపీ వినియోగం తగ్గించాలని రాష్ట్రాలకు చెబుతున్నారు. ఎరువుల ధరలు తగ్గించకపోగా, ఆ భారాన్ని రైతులపై నెడుతున్నారు. దేశంలోని కోట్లాది రైతుల పక్షాన చెబుతున్నా.. ఎరువులు సబ్సిడీపై ఇవ్వాలి. రైతుల పెట్టుబడి మొత్తాన్ని తగ్గించాల్సిన అవసరం ఉందన్నారు.
కేంద్రం చర్యలతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ఎరువుల సబ్సిడీ విధానాన్ని రైతుల ప్రయోజనాలకు విరుద్ధంగా మార్చారు. 70 ఏండ్లుగా ఎరువులపై సబ్సిడీ కొనసాగుతోంది. నరేగాతో వ్యవసాయాన్ని అనుసంధానం చేయాలని తెలంగాణ తీర్మానం చేసి పంపింది. అయినా కేంద్రం నుంచి ఎలాంటి స్పందన లేదు అని కేసీఆర్ పేర్కొన్నారు..