హైదరాబాద్, ఆగస్టు 29 (నమస్తే తెలంగాణ): జిల్లా పోలీసు అధికారుల కార్యాలయాల(డీపీవో)ను అత్యాధునిక పద్ధతిలో భూకంపాలను తట్టుకునేలా నిర్మిస్తున్నట్టు రాష్ట్ర పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ ఛైర్మన్ కోలేటి దామోదర్ తెలిపారు. ఒక్కో డీపీవోకు దాదాపు రూ. 38.50 కోట్లు కేటాయించి 50వేలకు పైగా చదరపు అడుగుల్లో సువిశాలంగా నిర్మిస్తున్నట్టు పేర్కొన్నారు. హెడ్క్వార్టర్లు, ఏఆర్ సిబ్బంది భవనాలు కాకుండా కేవలం ఒక్క డీపీవోకే రూ.26.9 కోట్లను ప్రభుత్వం కేటాయించినట్టు పేర్కొన్నారు. ఇప్పటికే కామారెడ్డి, వనపర్తి, మెదక్, గద్వాల, నాగర్కర్నూల్, సూర్యాపేట, కుమ్రంభీం ఆసిఫాబాద్, సిద్దిపేట, రామగుండం కమిషనరేట్లను సీఎం కేసీఆర్ ప్రారంభించారని, సెప్టెంబర్లో జయశంకర్ భూపాలపల్లి, రాజన్న సిరిసిల్ల, జగిత్యాల డీపీవోలను ప్రారంభిస్తారని తెలిపారు. నిర్మల్, మహబూబాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, ములుగు, నారాయణపేట డీపీవోల నిర్మాణాలు తుది దశలో ఉన్నట్టు వివరించారు. రాష్ట్రంలోని 90 పోలీస్ స్టేషన్లలో ఫ్రంట్ ఆఫీసులు, మండలానికొక పోలీస్ స్టేషన్ భవనాలను నిర్మిస్తున్నట్టు తెలిపారు. 15 డీపీవోలు, రెండు కమిషనరేట్లకు సుమారు రూ.654.50 కోట్లు విడుదల చేశారని గుర్తు చేశారు. పోలీస్ స్టేషన్లలో రోజువారీ ఖర్చుల కోసం జంట నగరాల్లో ఒక్కో పోలీస్ స్టేషన్కు నెలకు రూ.75 వేలు, జిల్లా కేంద్రాల్లో ఒక్కోదానికి నెలకు రూ.50 వేలు, మండల కేంద్రాల్లో రూ.25 వేలు ఇస్తున్న రాష్ట్రం తెలంగాణ ఒక్కటేనని వివరించారు. డీపీవోలకు అనుబంధంగా క్యాంపు ఆఫీసులు, పరేడ్ గ్రౌండ్లు, ఏఆర్ హెడ్ క్వార్టర్స్, బ్యారక్స్ మొదలైన మౌలిక సదుపాయాల బాధ్యతను కార్పొరేషన్ చేపట్టిందని, ఇప్పుడు వీటిని ‘స్మార్ట్ బిల్డింగ్స్’గా పిలుస్తున్నట్టు పేర్కొన్నారు.