Minister Harish rao | హైదరాబాద్, మే 2 (నమస్తే తెలంగాణ): నిమ్స్ దవాఖాన విస్తరణలో భాగంగా నిర్మించనున్న 2 వేల పడకల నూతన భవనానికి త్వరలో ముఖ్యమంత్రి కేసీఆర్ భూమిపూజ చేస్తారని ఆర్థిక, వైద్యారోగ్యశాఖల మంత్రి హరీశ్‌రావు తెలిపారు. ఇందుకు అన్ని ఏర్పాట్లు, అనుమతులు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. మంగళవారం ఆయన సచివాలయంలో వైద్యారోగ్యశాఖ ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా హరీశ్‌రావు మాట్లాడుతూ.. నూతన భవనంలో ఓపీ, ఐపీ, ఎమర్జెన్సీ సేవలకు ప్రత్యేకంగా బ్లాకులు ఉంటాయని చెప్పారు. భవనం మొత్తం ఎనిమిది అంతస్థులుగా ఉంటుందని చెప్పారు. నూతన భవనం పూర్తయితే నిమ్స్‌లో పడకల సంఖ్య 3,500కు చేరుతుందని వివరించారు. సూపర్ స్పెషాలిటీ ఎంసీహెచ్ పనులు కూడా పూర్తయితే నిమ్స్‌లోనే 3,700 పడకలు అందుబాటులోకి వస్తాయని తెలిపారు. పెరుగుతున్న జనాభా, అవసరాలకు అనుగుణంగా హైదరాబాద్ నలువైపులా ఒక్కొక్కటి వెయ్యి పడకలు కలిగి ఉండే టిమ్స్ దవాఖానలతోపాటు నిమ్స్ విస్తరణకు సీఎం కేసీఆర్ శ్రీకారం చుట్టారని గుర్తు చేశారు.
గాంధీలో దేశంలోనే తొలి సూపర్ స్పెషాలిటీ ఎంసీహెచ్
దేశంలోనే తొలిసారిగా గాంధీ దవాఖానలో నిర్మిస్తున్న 200 పడకల సూపర్ స్పెషాలిటీ ఎంసీహెచ్ పనులను ఈ నెలాఖరులోగా పూర్తి చేయాలని హరీశ్‌రావు ఆదేశించారు. గాంధీలో ఏర్పాటు చేస్తున్న ప్రభుత్వ సంతాన సాఫల్య కేంద్రం, స్టేట్ ఆర్గాన్ ట్రాన్స్‌ప్లాంట్ సెంటర్ పనులను వేగవంతం చేయాలని సూచించారు. నిమ్స్‌లో మాదిరిగా గాంధీలోనూ అవయవ మార్పిడి శస్త్రచికిత్సలు జరిగేలా చర్యలు తీసుకోవాలని సూపరింటెండెంట్‌ను ఆదేశించారు. బ్రెయిన్‌డెడ్ డిక్లరేషన్లు జరిపి, అవసరమైన వారికి అవయవాలు అందించి పునర్జన్మ ప్రసాదించాలని కోరారు. ఎంఎన్‌జే దవాఖానలో నూతనంగా ప్రారంభించిన ఆంకాలజీ బ్లాక్‌లో వైద్యసేవలు పూర్తి స్థాయిలో అందించాలని ఆదేశించారు.
శానిటేషన్, సెక్యూరిటీ, పేషెంట్ కేర్ విభాగాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి మానిటరింగ్ చేయాలని సూచించారు. అందరి కంటే ముందు వచ్చి, అందరి తర్వాత వెళ్లే డైరెక్టర్లు, సూపరింటెండెంట్లు ఆదర్శప్రాయులని హరీశ్‌రావు అభినందించారు. రోజూ రెండు గంటలపాటు దవాఖానల్లో రౌండ్స్ వేస్తూ, అన్ని విభాగాలు సందర్శిస్తే మెజారిటీ సమస్యలు పరిషారం అవుతాయని చెప్పారు. సమీక్షలో హెల్త్ సెక్రటరీ రిజ్వీ, డీఎంఈ రమేశ్‌రెడ్డి, డీహెచ్ శ్రీనివాసరావు, టీఎస్ఎంఎస్ఐడీసీ ఎండీ చంద్రశేఖర్‌రెడ్డి, టీవీవీపీ కమిషనర్ అజయ్‌కుమార్, ఆరోగ్యశ్రీ సీఈవో విశాలాచ్చి, సీఎం ఓఎస్డీ గంగాధర్, నిమ్స్ ఇన్చార్జి డైరెక్టర్ బీరప్ప, గాంధీ సూపరింటెండెంట్ రాజారావు, ఎంఎన్‌జే డైరెక్టర్ జయలత తదితరులు పాల్గొన్నారు.
స్టాఫ్‌నర్స్ పోస్టులకు 41 వేల దరఖాస్తులు
వివిధ విభాగాల్లో 5,204 స్టాఫ్‌నర్స్ పోస్టుల భర్తీ ప్రక్రియను ఆన్లైన్ విధానంలో (సీబీటీ) పారదర్శకంగా నిర్వహించాలని మంత్రి హరీశ్‌రావు ఆదేశించారు. మొత్తం 40,936 మంది దరఖాస్తు చేసుకున్నట్టు చెప్పారు. హైదరాబాద్, వరంగల్, ఖమ్మం, నిజామాబాద్‌లో పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేస్తామని తెలిపారు. 1,442 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల తుది ఫలితాల విడుదల కంటే ముందే, అసిస్టెంట్ ప్రొఫెసర్ల బదిలీలు చేపట్టాలని సూచించారు. రెండు వారాల్లో ఈ ప్రక్రియను పూర్తి చేయాలని స్పష్టం చేశారు.