CM KCR | జనగామ, ఆగస్టు 22(నమస్తే తెలంగాణ): జనగామ జిల్లా పాలకుర్తి మండలం వల్మిడికి సెప్టెంబర్ 4న సీఎం కేసీఆర్ రానున్నారు. ఆది కావ్యం రామాయణ సృష్టికర్త వాల్మీకి మహర్షి పుట్టిన ఊరుగా ప్రసిద్ధిచెందిన వాల్మీకి పురం కాలక్రమంలో వల్మిడిలో ఆయన నివసించిన మునులగుట్ట పకనే గల రాముడు నడయాడిన గుట్ట మీద జరిగే శ్రీ సీతారామచంద్ర స్వామి వారి విగ్రహాల పునః ప్రతిష్ఠాపన, కొత్తగా నిర్మించిన దేవాలయాన్ని సీఎం కేసీఆర్ ప్రారంభిస్తారు. ఈ మేరకు మంగళవారం వల్మిడి దేవాలయ ప్రాంగణంలో అధికారులు, ప్రజా ప్రతినిధులు, ప్రముఖులతో కలిసి మంత్రి ఎర్రబెల్లి ఏర్పాట్లను సమీక్షించారు. త్రిదండి చినజీయర్ స్వామి చేతుల మీదుగా వల్మిడి శ్రీ సీతారామచంద్ర స్వాముల వారి విగ్రహాల పునః ప్రతిష్ఠాపన జరగనుండగా, అత్యద్భుతంగా తీర్చిదిద్దిన, కొత్తగా నిర్మించిన దేవాలయ ప్రారంభోత్సవంలో మంత్రులు హరీశ్‌రావు, అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి, సత్యవతిరాథోడ్, వీ శ్రీనివాస్‌గౌడ్, ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొంటారు.
సెప్టెంబర్ 1 నుంచి 4 వరకు జరిగే ఈ ఉత్సవాలపై ప్రత్యేకంగా రూపొందించిన ఆరు రథాలతో ఆడియో, వీడియోలతో విస్తృతంగా ప్రచారం చేస్తూ, అందరికీ ఆహ్వానం పలుకనున్నారు. దేవాలయ ప్రాంగణంలో ఓ బ్యాగు, పసుపు, కుంకుమ, గాజులు, పులిహోర, లడ్డూ ప్రసాదాల పంపిణీ చేయనున్నారు. ఈ సందర్భంగా మంత్రి దయాకర్‌రావు మాట్లాడుతూ.. వాల్మీకి ఈ ప్రాంతం వారు కావడం మనందరికీ గర్వకారణమని అన్నారు. ఇకడ ఏటా శ్రీరామనవమి ఉత్సవాలు ఘనంగా జరుగుతాయని తెలిపారు. వల్మిడిలో తలంబ్రాలు పడిన తర్వాతనే భద్రాచలంలో తలంబ్రాలు వేస్తారని తెలిపారు. ఇంత గొప్ప దేవాలయ పునరుద్ధరణకు సీఎం కేసీఆర్ నిధులు ఇచ్చి ప్రోత్సహించినట్టు చెప్పారు.