హైదరాబాద్ : సీఎం కేసీఆర్(CM KCR) తన రెండో విడత అసెంబ్లీ ఎన్నికల(Assembly elections 2023) ప్రచారంలో భాగంగా ఇవాళ నల్లగొండ జిల్లాలోని హాలియాలో మధ్యాహ్నం ఒంటి గంటకు నాగార్జున సాగర్ బీఆర్ఎస్ అభ్యర్థి నోముల భగత్ గెలుపును కాంక్షిస్తూ ప్రసంగిస్తారు. జనగామ జిల్లాలోని పాలకుర్తి నియోజవర్గం తొర్రూరులో ప్రజా ఆశీర్వాద సభలో మధ్యాహ్నం 2 గంటలకు పాల్గొననున్నారు. అనంతరం అలాగే రంగారెడ్డి జిల్లాలోని ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో మధ్యాహ్నం 3 గంటలకు జరిగే ప్రజా ఆశీర్వాద సభల్లో సీఎం కేసీఆర్ పాల్గొననున్నారు.
ఆయా ప్రచార సభల్లో ఓటర్లను ఉద్దేశించి సీఎం ప్రసంగించనున్నారు. ప్రజా సంక్షేమం కోసం పాటుపడే బీఆర్ఎస్ పార్టీకే మరోసారి పట్టం కట్టాలని ఆయన ఓటర్లను కోరనున్నారు. కాగా అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో సీఎం కేసీఆర్ వాడీవేడి ప్రసంగాలను కొనసాగిస్తున్నారు. ఇప్పటికే ఉమ్మడి నల్లగొండ, మహబూబ్నగర్, ఖమ్మం, కరీంనగర్, మెదక్, ఆదిలాబాద్ జిల్లాల్లో జరిగిన పలు ప్రజా ఆశీర్వాద సభల్లో సీఎం కేసీఆర్ ప్రసంగించారు.
కాంగ్రెస్, బీజేపీలపై విమర్శల వర్షం గుప్పిస్తున్నారు. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీపై తూటాల్లాంటి మాటలతో విరుచుకుపడుతున్నారు. కాంగ్రెస్, బీజేపీలకు ఓటేసి మోసపోవద్దని ఓటర్లకు హెచ్చరికలు చేస్తున్నారు. ఈ నెల 28 వరకు మొత్తం 54 సభల్లో సీఎం ప్రసంగించనున్నారు. తెలంగాణతోపాటు మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్గఢ్, మిజోరం రాష్ట్రాలకు అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయి.