హైదరాబాద్: రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ (CM KCR) ఇవాళ తెలంగాణ నూతన సచివాలయానికి వెళ్లారు. మీడియాకు అభివాదం చేస్తూ లోపలికి వెళ్లిన ఆయన.. అక్కడ సచివాలయ పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా సీఎంతోపాటు రోడ్లు, భవనాల శాఖ మంత్రి ప్రశాంత్ రెడ్డి, ఎమ్మెల్యే బాల్క సుమన్, ఎమ్మెల్సీ తాతా మధు, సీఎస్ శాంతి కుమారి, సీపీ సీవీ ఆనంద్ ఉన్నారు.
మరోవైపు నూతన సచివాలయం ప్రారంభ తేదీలపై కేసీఆర్ దృష్టి సారించారు. త్వరలో తేదీలను ప్రకటించే అవకాశం ఉంది. కాగా, సీఎం కేసీఆర్ (KCR) ఇప్పటికే పలుసార్లు సచివాలయాన్ని సందర్శించారు. కాగా, ఇటీవల పాత సచివాలయాన్ని కూల్చివేసి దాదాపు రూ. 617 కోట్లతో కనీవినీ ఎరగని రీతిలో నూతన సచివాలయ నిర్మాణాన్ని చేపట్టారు. అత్యంత ఖరీదైన ఫర్నీచర్, అత్యాధునిక వసతులతో, ఎంతో విలాసవంతంగా కొత్త సచివాలయ భవన నిర్మాణం జరిగింది. పనులు దాదాపు పూర్తయ్యాయి.
తెలంగాణ ప్రభుత్వం (Telangana Government) ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఈ నూతన సచివాలయాన్ని సంక్రాంతికే ప్రారంభించాలని ముందుగా సీఎం భావించారు. అయితే అప్పటికి సచివాలయ పనులు ఇంకా పూర్తి కాలేదు. దాంతోపాటు బీఆర్ఎస్ ఆవిర్భావ సభ ఏర్పాటు, రెండో విడత కంటి వెలుగు కార్యక్రమం ప్రారంభం లాంటివి నాడు సచివాలయ ప్రారంభోత్సవం వాయిదాపడేందుకు కారణమయ్యాయి.
ఆ తర్వాత సీఎం కేసీఆర్ పుట్టిన రోజు సందర్భంగా ఫిబ్రవరి 17న సచివాలయాన్ని ప్రారంభించాలని నిర్ణయించారు. దీనిపై ప్రతిపక్షాలు అభ్యంతరం వ్యక్తం చేయడం, ఇంతలో ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్ విడుదలకావడం జరిగింది. దాంతో తాజా ఎన్నికల కోడ్ కారణంగా రెండోసారి ప్రారంభోత్సవం వాయిదా పడింది. కాగా, సీఎం సచివాలయ సందర్శన సందర్భంగా అమరవీరుల చిహ్నం, అంబేద్కర్ విగ్రహాలను కూడా పరిశీలించారు.
CM Sri K. Chandrashekar Rao inspected the ongoing works at the new #TelanganaSecretariat building complex today.
సీఎం శ్రీ కే. చంద్రశేఖర్ రావు నేడు నూతన సచివాలయ భవన సముదాయ నిర్మాణ పనులను పరిశీలించారు. #TrailblazerTelangana pic.twitter.com/b55vblXAzU
— Telangana CMO (@TelanganaCMO) March 10, 2023