
యాదాద్రి ఆరంభం.. నిర్విఘ్నంగా జరగాలని, స్వామివారి అశీస్సులు సంపూర్ణంగా ఉండాలని, చిన్న మనుషులైనటువంటి మేము తెలిసో తెలియకో పొరపాట్లు చేసినా నిండు హృదయంతో క్షమించి తమ కార్యాన్ని తామే జరిపించుకోవాలని పరిపూర్ణమైన హృదయంతో స్వామివారిని ప్రార్థిస్తున్నాను. పొరపాట్లు జరిగినా క్షమించాలని వేడుకుంటున్నా.
–సీఎం కేసీఆర్

సర్వలోక శరణ్యుడు శ్రీలక్ష్మీనారసింహుడి దివ్యక్షేత్రం యాదాద్రి విరాడ్రూపం పునరావిష్కారమవుతున్నది. నాడు తన భక్తశిఖామణి ప్రహ్లాద సంరక్షణార్థం..హిరణ్య కశపుడి సంహారానికి స్తంభం నుంచి ఉద్భవించిన శ్రీనారసింహుడు.. పంచనారసింహుడిగా తానై అవతరించిన దివ్య యాదాద్రిపై పునరావిర్భావం చెందబోతున్నాడు. 2022 మార్చి 28న ఉత్తరాయణ పుణ్యకాలాన స్వామివారు తన భక్తావళికి దివ్యదర్శనం ప్రసాదించనున్నారు. దీంతో ఆత్రంగా ఎదురుచూస్తున్న భక్తకోటికి మూలవరుల దివ్యరూప పునర్దర్శనం జరుగబోతున్నది. అపూర్వ నిర్మాణంతో ఇలలోనే వైకుంఠనగరాన్ని తలపిస్తున్న యాదాద్రిని నిర్మించిన ముఖ్యమంత్రి కేసీఆర్ మంగళవారం స్వామివారి సన్నిధిలో ముహూర్తాన్ని ప్రకటించారు.
హైదరాబాద్, అక్టోబర్ 19 (నమస్తే తెలంగాణ): యాదాద్రి దివ్యక్షేత్రం పునఃప్రారంభ తేదీని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ప్రకటించారు. చిన్నజీయర్ స్వామి ఆధ్వర్యంలో విద్వత్ సభ, సిద్ధాంతుల సభ నిర్ణయించిన ముహూర్తం ప్రకారం వచ్చే ఏడాది మార్చి 28వ తేదీన మహాకుంభ సంప్రోక్షణ కార్యక్రమం నిర్వహించనున్నట్లు వెల్లడించారు. మార్చి 21న అంకురార్పణతో ఎనిమిది రోజులపాటు మహా సుదర్శన యాగం నిర్వహించనున్నట్టు చెప్పారు. మంగళవారం యాదాద్రిలో పర్యటించిన సీఎం కేసీఆర్ ఆలయ నిర్మాణ పనులను పరిశీలించిన అనంతరం ఆలయ పున:ప్రారంభ తేదీలను ప్రకటించారు. గర్భగుడిని పరిశీలించిన తర్వాత చినజీయర్ స్వామి స్వదస్తూరీతో రాసిన ముహూర్త పత్రాన్ని స్వామివారి పాదాల చెంత ఉంచాలని ఆలయ ఈవో గీతకు ముఖ్యమంత్రి అందించారు. అనంతరం మీడియా సమావేశంలో మాట్లాడారు. ముఖ్యాంశాలు ఆయన మాటల్లోనే..
ఇది నూతన ఆలయ ప్రతిష్ఠ కాదు కాబట్టి.. దీన్ని మహాకుంభ సంప్రోక్షణ అని పిలుస్తారు. ఇప్పటికే ఉన్న ఆలయాన్ని విస్తరణ చేసి కొత్త అందాలు దిద్ది.. వసతులు పెంచినప్పుడు జరిపే కార్యక్రమాన్ని మహా కుంభ సంప్రోక్షణ అంటారు. ఈ కార్యక్రమ తేదీలను ఖరారు చేయాలని చిన్నజీయర్ స్వామిని నేను స్వయంగా కలిసి కోరాను. వారు విద్వత్సభను, సిద్ధాంతుల సభను సమావేశపరిచి ముహూర్తం నిర్ణయించారు. ఇక్కడ ఉత్కృష్టమైన పని జరిగింది. సుప్రసిద్ధమైన క్షేత్రం కాబట్టి, జనసామాన్యం విశేషంగా దర్శించుకొని తరించే పుణ్యక్షేత్రం కాబట్టి.. మహా సుదర్శన యాగంతో జరగాలని మొదటి నుంచీ భావిస్తున్నాం. ఆ మహాకుంభ సంప్రోక్షణానికి సంబంధించిన కార్యక్రమం 1,008 కుండాలతో కూడిన మహా సుదర్శన యాగంతో మొదలవుతుంది. అందులో చాలా ఉత్కృష్టమైన రుత్వికులు పాల్గ్గొనాల్సి ఉంటుంది. గతంలో శ్రీరంగం, తిరుపతి, పూరి జగన్నాథ్ ఇలా పలు పుణ్యక్షేత్రాలకు వెళ్లినప్పుడు అక్కడి రుత్వికులతో నేనే స్వయంగా మాట్లాడిన.
జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో వైష్ణవ పీఠాలు, ఇతర సంప్రదాయాలకు సంబంధించిన పీఠాలు చాలానే ఉన్నాయి. రాఘవేంద్రస్వామి ఆలయం కావొచ్చు.. శృంగేరి పీఠం కావొచ్చు రకరకాల పీఠాలకు చెందిన స్వాములను ఆహ్వానించాల్సిన బాధ్యత మనపై ఉంటుంది. కార్యక్రమం ప్రకటిస్తే వారందరికీ ఆహ్వానాలను పంపించడం లేదా స్వయంగా వెళ్లి ఆహ్వానించాల్సి ఉంటుంది. ఇంతటి ఉత్కృష్టమైన కార్యక్రమంలో వారందరు కూడా దీవెనలు అందించడం అనేది మన భారతీయ సంస్కృతిలో ఒక పరంపర. కాబట్టి.. మనం కూడా ఇలాగే జరిపించుకోవాలనే సదుద్దేశంతో కార్యక్రమాన్ని సమయం తీసుకుని చక్కగా నిర్వహించాలని నిర్ణయించారు.
ఈ యజ్ఞం అంత సులువైంది కాదు. సుమారు లక్షా యాభైవేల కేజీల స్వచ్ఛమైన నెయ్యి హోమం కోసం అవసరం. ఇంకా చాలా పదార్థాలు అవసరముంటాయి. వీటన్నింటినీ సమీకరించాల్సిన అవసరమున్నది. వాటన్నింటిని సమీకరించి జాగ్రత్తగా నిల్వ చేయాల్సి ఉంటుంది. అందుకే చాలామంది యాగాలు తలపెట్టరు.. ఏందుకంటే ఇది డబ్బుతో జరిగే కార్యక్రమం కాదు. మనస్సుతోని, భక్తితోని లగ్నం చేస్తే తప్ప జరగని పనులివి. ఒకసారి తలపెట్టినమంటే నిర్విఘ్నంగా జరగాలి. తప్పకుండా స్వామివారి ఆశీస్సులతో జరుగుతుంది. మనం సంకల్పం చేస్తే స్వామివారే చేయించుకుంటారు. స్వామివారి దీవెనలు ఉన్నాయనే ధైర్యంతోని ఇంతపెద్ద కార్యక్రమాన్ని తలపెడుతున్నాం. కార్యక్రమం జరగాలని కోరినప్పుడు చిన్నజీయర్ స్వామివారు అందర్నీ సంప్రదించి నిర్ణయించిన ము హూర్తం ప్రకారం మహా కుంభ సంప్రోక్షణ 28-03-2022న జరుగుతుంది. అంతకు 8 రోజుల ముందు.. మార్చి 21న అంకురార్పణ ఉంటుంది. మహా సుదర్శన యాగం ప్రారంభం అవుతుంది.

స్వయంభువుగా వెలసిన శ్రీలక్ష్మీనారసింహ పుణ్యక్షేత్రంలో ఈ విషయాలు మీతో పంచుకోవడం సంతోషంగా ఉన్నది. సమైక్య రాష్ట్రంలో తెలంగాణ ప్రస్థానం అన్ని రంగాల్లో తీవ్ర నిర్లక్ష్యానికి గురైన విషయం మనందరికీ తెలుసు. ఆనాడు తెలంగాణ సామాజిక, ఆధ్యాత్మికపరమైన నిర్లక్ష్యానికి గురైంది. గోదావరి, కృష్ణ, ప్రాణహిత పుష్కరాలు కూడా ఇక్కడ నిర్వహించేవారు కాదు. ఉద్యమ సందర్భంలో నేను దాన్ని ప్రస్తావించి ప్రకటిస్తే అదికూడా ఒక మహోద్యమంలాగా మారింది. ఫలితంగా కృష్ణా, ప్రాణహిత, గోదావరి తీరాల్లో వందల ఘాట్ల నిర్మాణం జరిగింది. మహోజ్వలంగా తెలంగాణ పుష్కర శోభను యావత్ ప్రపంచానికి ప్రసరింపజేసింది. గొప్ప చరిత్ర, సాంస్కృతిక సంపదను కలిగివున్న తెలంగాణ.. చాలా అద్భుతమైన ఆధ్యాత్మిక సంపద కూడా కలిగిన ప్రాంతం. ఇక్కడ అన్ని రకాల, అన్ని శాఖల ఆధ్యాత్మిక పరిమళాలు, చారిత్రక అవశేషాలు ఉన్నట్లు నూతన చరిత్రకారులు ప్రపంచానికి తెలియజేస్తున్నారు. అట్లాంటి మహోత్కృష్టమైన పుణ్యక్షేత్రాల్లో యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం ఒకటి. 50 ఏండ్ల క్రితం కుటుంబ పెద్దలతో ఇక్కడికి వచ్చాను. అప్పుడు మెట్లగుండానే రావాల్సివచ్చేది. స్వామివారి దర్శనం చేసుకొనే అదృష్టాన్ని పొందాను. ఆధ్యాత్మిక సంపద, శాఖోపశాఖలు, శైవం, వైష్ణం, బౌద్ధం తదితర అన్ని శాఖలవారూ నడయాడిన ప్రాంతం తెలంగాణ.
ప్రపంచ ప్రసిద్ధిగాంచిన అష్టాదశ పీఠాల్లో ఒకటైన జోగుళాంబ అమ్మవారి శక్తిపీఠం అలంపూర్‌లో ఉన్నది. శ్రీలంకలో కూడా ఒక శక్తిపీఠం ఉంది. ఉపాసకులు అన్నిచోట్లా ఉపాసన చేస్తేనే ఉపాసన సంపన్నమవుతుంది. అందుకే వారు సరైన వసతి ఉన్నా, లేకున్నా ఉపాసన చేయాలి కాబట్టి వస్తారు. గతంలో జోగుళాంబ శక్తిపీఠానికి ప్రాచుర్యం కల్పించలేదు. కృష్ణా పుష్కరాల సందర్భంగా జోగుళాంబలో ఘాట్‌ను ఏర్పాటుచేస్తే నేను అక్కడికే వెళ్లి స్నానం చేశాను. లక్షలాది భక్తులు స్నానాలు ఆచరించారు. దీంతో మరోసారి తెలంగాణ ఆధ్యాత్మిక చరిత్రను పుష్కరాల రూపంలో సుసంపన్నం చేశాం.
పుణ్యక్షేత్రాల పునర్నిర్మాణం కావచ్చు, పునః సంప్రోక్షణ కావచ్చు, క్రమానుగతంగా జరిగే అభివృద్ధి కావచ్చు. 1969లో మొదటిసారి మేము తిరుపతి వెళ్తే అక్కడ శ్రీకృష్ణదేవరాయులు కట్టించిన ధర్మశాలలోనే ఉన్నాము. అప్పట్లో అక్కడ ఏమీ ఉండేవి కావు. ఇప్పుడు భక్తుల సంఖ్య పెరుగుదలకు అనుగుణంగా వసతులు పెరిగాయి. ఇక్కడ కూడా ఈ ప్రాంత ప్రజలు, దేశ ప్రజలు ఇంకెప్పుడు ప్రారంభిస్తారని అడుగుతున్నారు. ఆలయాల నిర్మాణం, వాటి ప్రారంభం మన చేతుల్లో ఉండవు. ఆగమ నియమనిబంధనల ప్రకారం, అన్ని జాగ్రత్తలు తీసుకొని చేయాల్సి ఉంటుంది. ప్రారంభించడంతోనే పనులు అయిపోవు. ప్రారంభం తర్వాత కూడా పనులు జరుగుతూనే ఉంటాయి. ఈ ఆలయం పునర్నిర్మాణం మొదలు పెట్టినప్పుడు శ్రీరామానుజ త్రిదండి చినజీయర్‌స్వామి ఆధ్వర్యంలో వైష్ణవ సంప్రదాయాల ప్రకారం వారి సూచనల ప్రకారం చేయాలని నిర్ణయించాం. వారు స్వయంగా వచ్చి పరిశీలించారు. వాస్తు నిపుణులు, సిద్ధాంతులకు సూచనలు చేశారు. ఆ ప్రకారం చేశాం. వారు ఒక లక్ష్యాన్ని నిర్దేశించి చెప్పిన ప్రకారం చేశాం. వారి ఆశీస్సులు మాకు ఎప్పుడూ లభిస్తున్నాయి.
యాదాద్రి కరువుకు ఆలవాలంగా ఉన్న పరిస్థితి. మంచినీళ్లకు కూడా ఇబ్బంది పడే పరిస్థితి. కాళేశ్వరం ప్రాజక్టులో భాగంగా చేపట్టిన నృసింహసాగర్ రిజర్వాయర్.. దాన్ని ఇక్కడ బస్వాపూర్ రిజర్వాయర్ అని కూడా అంటారు. దాని నిర్మాణం పూర్తికావచ్చింది. దీనిద్వారా ప్రతిరోజూ పవిత్ర గోదావరి జలాలతో స్వామిని అభిషేకించే అదృష్టం లభించింది. భక్తుల పుణ్యస్నానాలకు ప్రతిరోజూ పవిత్ర గోదావరి జలాలు ఉంటాయి. ఈ బస్వాపూర్ రిజర్వాయర్ తెలంగాణలోనే రెండవ అతిపెద్ద రిజర్వాయర్. మల్లన్నసాగర్ రిజర్వాయర్ పనులు ఈ మధ్యనే 95% పూర్తయ్యాయి. నీరు కూడా 10.5 టీఎంసీలు నిల్వచేశాం. దీంతో బస్వాపూర్ రిజర్వాయర్, లక్ష్మీ తటాకం ఎప్పుడూ స్వచ్ఛమైన గోదావరి నీటితో అద్భుతంగా ఉంటాయి. మల్లన్నసాగర్, నృసింహసాగర్ నుంచి జలాలు స్వామివారి పాదాలను సృశించి పంట పొలాలకు వెళ్తాయి. ఆలేరు, భువనగిరి, రామన్నపేట, నకిరేకల్ నియోజకవర్గాల్లో సుమారు 5 లక్షల ఎకరాలకు అద్భుతమైన పంటలు పండించే అవకాశం కలుగుతున్నది.
కార్యక్రమం సందర్భంగా లక్షలమంది భక్తులు యాదాద్రిని దర్శించుకునే అవకాశం ఉంటుంది. ఇప్పటి నుంచి నిరంతరంగా అనేక కూర్పులు చేర్పులు మంచి చెడ్డలు చేస్తే తప్ప అది విజయవంతంగా ముందుకు సాగదు. ఇప్పటి నుంచి జిల్లా మంత్రి జగదీశ్‌రెడ్డికి, దేవాదాయశాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డికి చాలా పెద్ద కార్యభారం ఉంటుంది. ఆ భారం నాపై ప్రధానంగా ఉంటుంది.. కానీ ఇంచుమించుగా నిత్య కార్యక్రమం మాదిరిగా వారు చూడాల్సి ఉంటుంది. కాబట్టి వారిపై ఎక్కువ పని ఒత్తిడి ఉంటుంది.
జర్నలిస్టులు వార్తా వాహకులు. మంచిని, చెడును బాగా ప్రచారం చేస్తరు. భక్తి పరంపర కాబట్టి ఇక్కడ చెడు ఏం ఉండదు. కాబట్టి దీనికి సంబంధించి మీ యొక్క దీవెనలు చాలా అవసరం. దీన్ని ప్రమోట్ చేయాలి గతంలో మనం నిరాదరణకు గురయ్యాం. మన మనుషులు మనుషులు కాలేదు, నదులు నదులు కాలేదు, దేవుళ్లు దేవుళ్లు కాలేదు. నేను ఉద్యమ సందర్భంలో ఆవేదన వెలిబుచ్చేవాడిని. ఇవాళ క్రమానుగతంగా ఒకటి ఒకటి చేసుకుంటూ ఒక దరిన పడ్డాం. ఇప్పుడు గర్వంగా, సంతోషంగా దేశానికి అన్నం పెట్టే స్థాయికి అన్నపూర్ణగా ఎదిగాం. స్వామి వారి ఆశీస్సులతో ప్రాజెక్టులు పూర్తి కావడం, వర్షాలు సుసంపన్నంగా కురవడం, చాలా గొప్పగా వ్యవసాయం జరగటం చూస్తున్నాం. అవసరార్థమై ఉన్నవారిని ఆదుకుంటూ, కడుపుల పెట్టుకుంటూ చూసుకోవడం దేశంలో ఎక్కడా లేదు. ఒకటి ఒకటి చేసుకుంటూ దేశంలోనే ఆర్థికంగా సుసంపన్నమైన రాష్ట్రంగా ఎదిగాం. అందుకే చాలా సందర్భాల్లో మాది ధనిక రాష్ట్రం అని చెప్తుంటా. కొంత మంది వెటకారాలు చేసినా వారి విజ్ఞతలకు వదిలేసి, నేను చెప్తూ ప్రమోట్ చేస్తుంటా. అది ఫ్యాక్ట్ కూడా. కరోనా మహమ్మారి తర్వాత, ఆర్థిక పురోగతిలో చాలా ముందున్న రాష్ట్రం తెలంగాణ. ఆ రకంగా మనం పురోగమిస్తున్నాం. అందుకు స్వామి వారి ఆశీస్సులు అందుతున్నాయి.
ఈ కార్యక్రమానికి ముహూర్తం ఎలా నిర్ణయిస్తారంటే, సంక్రాంతి పండుగను ముందుకు జరిపేందుకు వీలు కాదు. ఈ కార్యక్రమం ఉత్తరాయణంలోనే జరగాలి. అలా జరగాలంటే సమయం కుదిరి రావాలి. అవసరమైన ఉపాసకులు మనకు లభించాలి. మహా సుదర్శన హోమం నిర్వహణకే ఐదారువేల మంది రుత్వికులు అవసరం. వారికి సహాయకులు మరో మూడు నాలుగువేల మంది కావాలి. వీరంతా ఒక దగ్గరి నుంచి రారు. శ్రీరంగం నుంచి, తిరుమల నుంచి భద్రాద్రి నుంచి రావొచ్చు. తెలుగు రాష్ర్టాల్లోనే కాకుండా ఇతర రాష్ర్టాల్లో ఉండేటువంటి పీఠాధిపతులు వస్తారు. అమెరికాలోని వైష్ణవ ఆలయాల పూజారులు కూడా వస్తామని చాలా అభిలాషగా ఉన్నారు. వాళ్లందర్ని కూడా ఆహ్వానించాల్సిన బాధ్యత మనపై ఉంటుంది. వీళ్లందరికీ ఆహ్వానాలు పంపించాలి. కొంతమందిని స్వయంగా కలిసి ఆహ్వానించడం వంటి పనులుంటాయి కాబట్టి.. కనీసం మనకు రెండు మూడు నెలల సమయం అవసరం ఉంటుంది.
యాదాద్రి ఆలయాన్ని వైభవోపేతంగా తీర్చిదిద్దాలనే సంకల్పంతో పునర్నిర్మాణ బాధ్యతలు రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్, తెలంగాణ బిడ్డ, కళాతపస్వి కిషన్‌రావుకు అప్పగించాం. హైదరాబాద్‌లోని శిల్పారామం సృష్టికర్త కూడా కిషన్‌రావే. నగరంలో అదొక ల్యాండ్ మార్క్‌గా ఉన్నది. ఇటీవల మూసీ ఒడ్డున కూడా శిల్పారామం ఏర్పాటుచేశారు. ఇది ఎక్కడ పెట్టినా పది-పది వేలమంది సందర్శిస్తున్నారు. అందరూ మా జిల్లాలో పెట్టండి అని అడుగుతున్నారు. కిషన్‌రావు ఆధ్వర్యంలో మొత్తం యాదాద్రి నిర్మాణం జరిగింది. నల్లగొండ జిల్లావాసి కావడం వారి జిల్లావారికి గర్వకారణం. ఆయన చాలా చక్కగా బాధ్యతను నిర్వర్తించారు. గొప్పగా పుణ్యక్షేత్రం ఆవిష్కృతమైంది.
జీయర్ స్వామి వారు కూడా ఒక గొప్ప కార్యక్రమాన్ని తలపెట్టారు. ఒక రకంగా మన అదృష్టం.. అంతర్జాతీయంగా అత్యంత ప్రసిద్ధమైన హైదరాబాద్ నగర ఖ్యాతిని ప్రపంచవ్యాప్తం చేసేలా గొప్ప ఆస్తిని మనకు జత చేశారు. వైష్ణవాచార్యులు, మహానుభావులు శ్రీ రామానుజాచార్యులు.. ఆయన గురించి చాలా మందికి తెలియదు. వారు ప్రజలందరికీ భగవంతుడిని దర్శించే అవకాశం ఉండాలె, ప్రజలందరికీ భగవంతుడు సమానమేనని చెప్పిన సమతామూర్తి. మహా గురువులు. వారు జన్మించి వెయ్యి సంవత్సరాలు దాటింది. ఇప్పుడు వెయ్యి నాలుగు సంవత్సరాలు నడుస్తున్నది. ఈ సందర్భంగా అనేక మంది అనేక రకాల పుణ్యకార్యాలు చేస్తున్నారు. ఇందులో భాగంగా జీయర్ స్వామి వారు.. హైదరాబాద్‌లోని వారి ఆశ్రమం దివ్యసాకేతంలో గొప్ప కార్యక్రమాన్ని చేశారు. చాలా ఎత్తైన, దివ్యమైన రామానుజాచార్యులవారి విగ్రహాన్ని ఏర్పాటుచేశారు. వైష్ణవులు బాగా ఆరాధించి ప్రేమించేటువంటి 108 దివ్యదేశాలకు సంబంధించినటువంటి ఆలయ నిర్మాణాలు కూడా పూర్తికాబోతున్నాయి. అక్కడ వారు కూడా మహా సుదర్శన యాగం నిర్వహిస్తున్నారు. ఈ సుదర్శనయాగం నిర్వహించే సామర్థ్యం, శక్తి, ధారణ ఉన్నటువంటి రుత్వికులు కావాలి. ఏకకాలంలో రెండూ జరుపలేం కాబట్టి.. చిన్నజీయర్ స్వామి వారి ఆశ్రమంలో యాగాన్ని పూర్తి చేసుకొని అక్కడి నుంచి పది పదిహేను రోజుల వ్యవధిలో ఉత్తరాయణ పుణ్యకాలంలో యాదాద్రిలో ప్రారంభిస్తాం.
సంవత్సర సంధి అని ఉంటది. తెలుగు సంవత్సరం మారే సమయంలో.. అంటే ఈ సంవత్సర సంధి సమయంలో కార్యక్రమాలు నిర్వహించరు. కాబట్టి మహాకుంభ సంప్రోక్షణ తేదీని మార్చి 28న నిర్ణయించారు. అది నిర్విఘ్నంగా జరగాలని, స్వామివారి అశీస్సులు సంపూర్ణంగా ఉండాలని, చిన్న మనుషులైనటువంటి మేము తెలిసో తెలియకో పొరపాట్లు చేసినా నిండు హృదయంతో క్షమించి తమ కార్యాన్ని తామే జరిపించుకోవాలని పరిపూర్ణమైన హృదయంతో స్వామివారిని ప్రార్థిస్తున్నాను. పొరపాట్లు జరిగినా క్షమించాలని వేడుకుంటున్నా.
తెలంగాణ ఆధ్యాత్మిక శక్తికి ప్రతీకగా నిర్మితమైన యాదాద్రి ఆలయం పునఃప్రారంభం ముహూర్తం ఖరారైంది. స్వస్తి శ్రీ ప్లవ నామ సంవత్సరం ఫాల్గుణ మాసం బహుళ ఏకాదశి సోమవారం తేదీ: 28/03/2022 శ్రవణా నక్షత్ర యుక్త మిథున లగ్నంలో ఆలయ పునఃప్రారంభం చేయనున్నారు.
సంవత్సర కాలాన్ని గణనకు వీలుగా ఉత్తర, దక్షిణ ఆయనాలుగా విభజించారు. మకర సంక్రాంతి నుంచి సూర్యుడు దక్షిణం నుంచి ఉత్తరం దిశగా సుమారు ఆరు నెలలు ప్రయాణిస్తాడు. అందుకే ఈ కాలాన్ని ఉత్తరాయణం అంటారు. ఆ తర్వాత ఉన్న ఆరు నెలలు దక్షిణాయనం. దీనిని పితృదేవతలకు చెందినదిగా పేర్కొన్నారు. ఉత్తరాయణం దేవతలకు సంబంధించినదిగా చెబుతారు. అన్ని దిక్కులూ దేవుడి దృక్కులే అయినా.. ఉత్తరం ఉత్తమమని చెబుతారు. ఉత్తు, తరం.. ఉత్తరం. అంటే ఉత్తమమైన సమయం అని అర్థం. ఈ కాలంలో చేసే ధార్మిక, దైవ సంబంధ కార్యాలు విశేష ఫలాన్నిస్తాయని నమ్మిక. అందుకే, పలు దేవతా ప్రతిష్ఠలు, ఉపనయనాలు, ఇతర ప్రత్యేక శుభకార్యాలు ఉత్తరాయణంలో మాత్రమే చేసే సంప్రదాయం ఉన్నది.
దేవాలయ ప్రతిష్ఠాది దైవ సంబంధ కార్యాల్లో సంవత్సర సంధి ఉండకూడదు. ఉగాదికి ముందు ఐదు రోజులు, తర్వాత ఐదు రోజులను సంవత్సర సంధిగా పరిగణిస్తారు. ఈ పది రోజులు దైవ సంబంధమైన శుభకార్యాలు చేయడం సరికాదు. ఆగమ, జ్యోతిష శాస్ర్తాల ఆధారంగా ముహూర్తం నిర్ణయించినట్టు యాదాద్రి దేవస్థానం ఆస్థాన సిద్ధాంతి సంపత్కుమార కృష్ణమాచార్య సిద్ధాంతి పేర్కొన్నారు.
దైవ కార్యాల్లో మహాకుంభ సంప్రోక్షణ మహత్తరమైన కార్యక్రమం. ఇందులో భాగంగా కుంభాల్లో మంత్రజలాలను ఆవాహన చేసి వాటితో ఆలయ రాజగోపురంపై ఏర్పాటు చేసిన కలశాలను, గర్భాలయ గోపురాన్ని అభిషేకం చేస్తారు. వేదమంత్రాలను పఠిస్తూ అభిషేకం నిర్వహిస్తారు. గోపురంపై కలశ స్థాపన, ఆలయ పునర్నిర్మాణం, ధ్వజస్తంభ ప్రతిష్ఠ తదితర సందర్భాల్లోనూ మహాకుంభ సంప్రోక్షణ క్రతువు నిర్వహించడం ఆగమశాస్త్ర సంప్రదాయం. దీనివల్ల ఆలయంలోని దైవీశక్తి తరంగాలు సామాన్య భక్తుడికి ప్రసరిస్తాయి.
దైవానుగ్రహం కోసం యాగాలు నిర్వహిస్తారు. విష్ణు సంబంధమైన యాగాన్ని మహా సుదర్శన యాగం అని పిలుస్తారు. వైష్ణవ క్షేత్రాల్లో మహాసుదర్శన యాగం వైభవంగా నిర్వహిస్తూ ఉంటారు. యాదాద్రి ఆలయం పునఃప్రారంభం సందర్భంగా సహస్ర (1008) కుండాత్మక సుదర్శన నారసింహ మహాయాగాన్ని నిర్వహిస్తారు. ఇందులో భాగంగా, అష్టాదశ పురాణాలు, వేదాలు, ఇతిహాసాలు, దివ్య ప్రబంధాల పారాయణం చేయనున్నారు. నరసింహ సుదర్శన మహామంత్ర జపంతోపాటు హోమం నిర్వహిస్తారు. యాగఫలంతో తలపెట్టిన దైవకార్యాలు నిర్విఘ్నంగా పూర్తవుతాయి. అంతేకాదు, ఆలయంలోని ఆధ్యాత్మికతను పెంచేవిధంగా ఈ మంత్రశక్తి దోహదం చేస్తుంది.
ప్రతి శుభకార్యంలోనూ అంకురార్పణ (అంకురారోపణ) చేయడం శాస్త్రం. కంచుళ్లలో (మట్టి మూతలు) మేఖల (మేక ఎరువు) మట్టిపోసి మంత్రోక్తంగా నవధాన్యాలు చల్లుతారు. అవి పచ్చగా మొలకెత్తడం శుభానికి సంకేతంగా భావిస్తారు. వివాహాది శుభకార్యాల్లో అంకురార్పణ వంశాభివృద్ధిని సూచిస్తుంది. దైవకార్యాల్లో చేసే అంకురారోపణ ఫలితంగా ఆ క్షేత్రంలో ఆధ్యాత్మికత దినదిన ప్రవర్ధమానమవుతుంది.