ఎట్టి పరిస్థితుల్లో రైతు బంధు ఆగదని కేసీఆర్ తెల్చిచెప్పారు. మునుగోడు ప్రజాదీవెన సభలో బీజేపీపై మండిపడిన ఆయన.. ‘‘తెలంగాణ రైతుల అప్పులన్నీ తీరిపోయి.. ఆయన డబ్బులు ఆయనకు వచ్చే వరకు రైతు బంధు ఆగదు. వ్యవసాయం స్థిరీకరణ జరిగితే గ్రామాలు బాగు పడతాయి. పంటలు పండితే ప్రజలు బతుకుతారు. ఊరికే తమాషాగా ఇలాంటివి చెయ్యడం లేదు. ఇక్కడ లక్ష మందికి రైతు బందు వస్తుంది. 8 వేల మందికి వికలాంగుల పెన్షన్ వస్తుంది. 40 వేల మందిరి నెలకు రూ.2 వేల పెన్షన్ వస్తోంది. ఇవన్నీ బంద్ కావాలనా? వీళ్లు ఇస్తారా? ఇండియాలో ఏ రాష్ట్రంలో అయినా ఉందా? వీళ్లను నమ్మితే సంక్షేమ పథకాలన్నీ రద్దు అవుతాయి.
ఎందుకు ఇస్తున్నారయ్యా? మా గుజరాత్లో రూ.600 ఇస్తుంటే ఓట్లు వెయ్యడం లేదా? మీరు రూ.2 వేలు ఎందుకు ఇస్తున్నారు? డబ్బులు వృధా చేస్తున్నారు? అని ఇదే జగదీశ్వర్‌రెడ్డితో అన్నారు. ఓటు ఎవరికివ్వాలి? ఇవాల పోటీ చేస్తోంది టీఆర్ఎస్ ఒక్కటి కాదు. ప్రగతి శీల శక్తులం ఏకమయ్యాం. నేడో రేపో సీపీఎం కూడా మనతో కలిసి వస్తుంది. ఇంకా ఎవరైనా ఉంటే వాళ్లను కూడా కూడదీసి ముందుకు పోతాం. కరెంటు మీటర్లకు, రైతు వ్యతిరేక విధానాలకు, మన వడ్లు కొననందుకు, మన కరెంట్ బంద్ చేస్తున్నందుకు, మనల్ని ఇబ్బంది పెడుతున్నందుకు దెబ్బ కొడితే నషాలానికి అంటాలి.
ఇప్పుడు కాంగ్రెస కూడా వస్తుంది. దానికి ఓటు వేస్తే ఏమవుతుంది? బావిలో పడేసినట్లే. కాంగ్రెస్ గెలిచేదా? వచ్చేదా? ఈడ సర్కారా? ఆడ సర్కారా? వాళ్లకు వేసే ఓటు కూడా వేస్ట్ అయిపోతుంది. వేసే బలమేదో ఒక్క దిక్కే ఇస్తే.. తెలంగాణ ఏమంటోంది? ఏం చెప్తోంది? ఏ విధానాలు బలపరుస్తోంది? అనే మెసేజ్ పోవాలి. ఇవాళ ఒక్క వ్యక్తి గెలవడం ముఖ్యం కాదు. ఈ ఎన్నికతోనే టీఆర్ఎస్ ప్రభుత్వం రాదు. టీఆర్ఎస్ బలంగానే ఉంది. కానీ తెలంగాణ ఏమంటోంది? వాళ్లు ఎలా స్పందిస్తున్నారు? అనే వార్త మునుగోడు నుంచి ఢిల్లీ వెళ్లాలి. కాబట్టి బొమ్మలు చూసో, గారడీ విద్యలు చూసో మోసపోయామంటే గోస పడతాం.
కాబట్టి దయచేసి మోసపోకుండా.. మా అక్కచెల్లెళ్లు, తల్లులు కేసీఆర్ చెప్పిన ముచ్చట నిజమా కాదా? అని చర్చించాలి. ఉన్న పెన్షన్లు, ఉన్న వసతులు, ఉన్న కరెంటు ఊడగొట్టుకుందామా? ఆలోచన చెయ్యాలి. చివరకు చేనేత కార్మికుల మీద కూడా జీఎస్టీ విధించారు. చస్తే స్మశానం మీద జీఎస్టీ, పిల్లలు తాగే పాల మీద జీఎస్టీ ఇంత అన్యాయమా? ఈ డబ్బంతా ఏమవుతోంది? దొంగలకు, దోపిడీదారులకు బ్యాంకులను లక్షల కోట్లకు ముంచేవాళ్లకు ఎన్పీయే పేర్ల మీద పది పది లక్షల కోట్లు మాఫీ చేసి పేద ప్రజల పొట్ట కొట్టే ప్రయత్నం జరుగుతోంది. మునుగోడు రైతులు ఓటేసే ముందు మన బోరు కాడకు పోయి.. బోరుకు దండం పెట్టి పోవాలె.
అక్కచెల్లెళ్లు ఓటు వేసే సమయంలో గ్యాస్ సిలిండర్‌కు దణ్ణం పెట్టి పొయ్యి ఓటెయ్యాల. మనం కత్తి ఒకడికిచ్చి యుద్ధం మరొకడిని చెయ్యాలని చెప్పకూడదు. ఎవరి చేతిలో కత్తి పెడితే కరెక్టో వాడి చేతిలోనే కత్తి పెట్టాలి. నల్లగొండ జిల్లా ఫ్లోరైడ్ బాధ పోవాలంటే తెలంగాణ రావాలని చెప్పా.. ఇవాళ పోయిందా లేదా? మన కరెంట్ కడుపునిండా రావాలంటే తెలంగాణ వస్తేనే జరుగుతుందని చెప్పా.. ఇవ్వాళ 24 గంటలు కరెంటు వస్తుందా లేదా? ఆలోచించండి. ఎవడో గాలిగాడు గత్తరగాడు వచ్చి ఏదో చెప్తే.. వాడి వెనుక గొర్రెదాటుగా పోతే గోల్మాల్ అయిపోతాం. బతుకులు ఆగమైతయ్.
రేషన్ బియ్యం కుటుంబంలో ఎంత మంది ఉంటే అంత మందికి ఇస్తున్నాం. చేనేత, గీత, యాదవులు అందరినీ ఆదుకున్నాం. ఏ వర్గాన్నీ కాదనకుండా ప్రతివాళ్లను కడుపులో పెట్టుకొని ఒక దరికి తెచ్చుకోవాలని పాటుపడుతున్నాం. వాళ్లను కాదని మనల్ని పోటు పొడిచేవాళ్లకు ఓటు వేస్తే మనకు దెబ్బపడుతుంది కాబట్టి.. మీ బిడ్డగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా చెప్పడం నా ధర్మం కాబట్టి అందరికీ ఈ విషయం మనవి చేస్తున్నా. క్రియాశీల శక్తులు, ప్రగతి శీల శక్తులు అందరం ఒక్కటై ముందుకు సాగాలి. కార్మికులను, కర్షకులను, సామాన్య ప్రజలను కాపాడటం కోసం కంకణ బద్దులమై ఈ దేశం నుంచి బీజేపీ వాళ్లను, ఈ పెట్టుబడుదార్ల ప్రభుత్వాన్ని తరిమికొడితేనే మనకు విముక్తి దొరుకుతుంది.
మన మునుగోడులో గిరిజనులు ఉన్నారు. మా తండా మా సర్పంచ్ కావాలి మాది మాకు అని 50 ఏళ్లు మొత్తుకుంటే ఎవరైనా చేశారా? కానీ టీఆర్ఎస్ ప్రభుత్వమే మూడున్నర వేల గిరిజన తండాలను గ్రామ పంచాయతీలు చేసినం, ఇప్పుడు గిరిజన బిడ్డలే రాజ్యం ఏలుతున్నారు. నేను చెప్పేవి గాలి మాటలు కాదు. మీ కళ్ల ముందు ఉన్నవే. కాబట్టి అలవోకగా ఏమరుపాటుగా ఓటేస్తే మన బతుకులు ఆగమవుతాయి కాబట్టి జాగ్రత్తగా నిర్ణయం తీసుకోవాలి. ఇక్కడి నుంచి మునుగోడు నుంచి అనూహ్యమైన ఫలితం రావాలి. అటసట గెలవడం కాదు.
పెద్ద మెజార్టీతో గెలిచి ఎవరు ముందుకు పోతారో వాళ్ల మెసేజ్ దేశానికి పోతుంది. ఆనాడు అటుకులు తిన్నమో, ఉపవాసం ఉన్నమో పేగులు తెగేదాక కొట్లాడి తెలంగాణ తెచ్చినం. తెచ్చిన తెలంగాణను ఒక లైన్లో పెట్టుకుంటున్నాం. తిప్పలు పడుతున్నం. ఈ ఎన్నికలను ఆషామాషీగా తీసుకోవద్దు. ఇవాళ మనకు లెఫ్ట్ పార్టీల మిత్రులు మనకు మద్దతుగా వచ్చారు. ఈ ఎన్నిక ఒక వ్యక్తి కోసమో, పార్టీ కోసమో జరిగేది కాదు. క్రియాశీల, ప్రగతిశీల పార్టీల నాయకత్వంలో బ్రహ్మాండమైన సందేశాన్ని దేశానికి ఇచ్చి ప్రజలను చైతన్యం చేసే తీర్పే మునుగోడు నుంచి వచ్చేలా కృషి చేయాలి’’ అని అన్నారు.