యాదాద్రి భువనగిరి, మార్చి 26 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): ఉగ్ర, జ్వాల, యోగానంద, గండబేరుండ, లక్ష్మీనారసింహ రూపాల్లో పంచనారసింహుడు యాదగిరిగుట్టపై భక్తులకు పునర్దర్శనమిచ్చే సమయానికి వేళైంది. ఏడేండ్లుగా వేచిచూస్తున్న భక్తులకు స్వామివారి మూలవరుల నిజరూప దర్శనం కనువిందు చేసేది మరికొన్ని గంటల్లోనే. సోమవారం మహా సంప్రోక్షణ కార్యక్రమం పూర్తికాగానే నృసింహుడిని దర్శించుకొనేందుకు భక్తులను అనుమతించనున్నారు. మహా సంప్రోక్షణ కార్యక్రమానికి ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు సహా మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు, అధికారులు హాజరుకానున్నారు. ప్రధాన ఘట్టం కోసం ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. యాదాద్రి వైభవాన్ని చాటేలా హైదరాబాద్ నుంచి యాదాద్రి పట్టణం వరకు స్వాగత తోరణాలు ఏర్పాటు చేసే పనులు ఊపందుకొన్నాయి. శనివారం దేవాదాయ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి స్వామిని దర్శించుకొని, ఏర్పాట్లను పరిశీలిం చారు.
కాగా, పంచకుండాత్మక యాగం ఆరో రోజు ప్రధానాలయం, బాలాలయాల్లో మూలమంత్ర, మూర్తిమంత్ర హవనం, 108 మంది రుత్వికులతో సామూహిక విష్ణు సహస్ర నామ పారాయణాలు కొనసాగాయి. శాంతిపాఠం, చతుస్థానార్చన, ద్వారతోరణ, ధ్వజ కుంభారాధనలు, ఏకాశీతి కలశాభిషేకం, ధాన్యాధివాసం వంటి సనాతన పర్వాలను నిర్వహించారు. చివరగా పూర్ణాహుతి జరిపారు. ప్రధానాలయంలో 81 కలశాలతో నిర్వహించిన ఏకాశీతి కలశాభిషేకం పండుగ వాతావరణంలో జరిగింది. శుద్ధ జలాలు, పంచామృతం, కస్తూరి, చందనం, ఫల రసాయనాలు, యాలకులు, లవంగాలు తదితర సుగంధ ద్రవ్యాలతో పూజలు జరిపి కలశాల్లో నింపారు. ఆ పూజాజలాన్ని మంత్రోచ్చారణతో అభిషేకం చేపట్టారు. సుదర్శన, ఆళ్వారులు, గరుడ, విష్వక్సేనాదులు, రామానుజులు, ఆచార్య పురుషులు, ఆండాళ్(శ్రీ గోదాదేవి)ను అభిషేకించారు. సాయంత్రం శాస్ర్తోక్తంగా ధాన్యాధివాసం పర్వాన్ని చేపట్టారు. మూలవరుల దర్శనం నాటికి ఐదు కోట్ల మూల, మూర్తి మంత్ర జపాలు పూర్తి చేస్తామని అర్చకులు వెల్లడించారు. కార్యక్రమాల్లో ఆలయ అనువంశిక ధర్మకర్త బీ నరసింహమూర్తి, ఈవో గీత, ప్రధానార్చకుడు నల్లన్‌థిఘళ్ లక్ష్మీనరసింహాచార్యులు తదితరులు పాల్గొన్నారు.
నేటి(ఆదివారం) పూజలు:
ఉదయం: శాంతిపాఠం, చతుస్థానార్చన, మూలమంత్ర హవనములు, అష్టోత్తర శతకలశాభిషేకం, నిత్య లఘు పూర్ణాహుతి
సాయంత్రం: సామూహిక శ్రీ విష్ణుసహస్రనామ పారాయణం, మూలమంత్ర హవనములు, చతుస్థానార్చన, పంచశయ్యాధివాసం, నిత్యలఘు పూర్ణాహుతి.